ఆస్తి కావాలంటే.. చచ్చినోళ్లు రావాలంటున్న ‘ధరణి’..!

దిశ, తెలంగాణ బ్యూరో : అంతుచూస్తున్న ధరణి.. చచ్చినా వదలని తీరుగా దాని పనితీరు తయారైంది.. భూహక్కుదారు కాలం చేస్తే వారసులకు భూమి చెందాలంటే కచ్చితంగా యజమాని వచ్చి వేలి ముద్రలు వేయాల్సిందే.. లేదంటే పని ముందుకు సాగదు… పని సాఫీకి ఉద్దేశించిన పోర్టల్​ ఇప్పుడు ప్రాబ్లమెటిక్‎గా మారింది.. సరైన సొల్యూషన్స్​లేకపోవడంతో ఏం చేయాలో తెలియక క్షేత్రస్థాయిలో ఉండే తహసీల్దార్లు, ఆర్డీవోలు తలలు పట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకమైన ధరణి పోర్టల్ ద్వారా కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. […]

Update: 2021-02-25 12:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అంతుచూస్తున్న ధరణి.. చచ్చినా వదలని తీరుగా దాని పనితీరు తయారైంది.. భూహక్కుదారు కాలం చేస్తే వారసులకు భూమి చెందాలంటే కచ్చితంగా యజమాని వచ్చి వేలి ముద్రలు వేయాల్సిందే.. లేదంటే పని ముందుకు సాగదు… పని సాఫీకి ఉద్దేశించిన పోర్టల్​ ఇప్పుడు ప్రాబ్లమెటిక్‎గా మారింది.. సరైన సొల్యూషన్స్​లేకపోవడంతో ఏం చేయాలో తెలియక క్షేత్రస్థాయిలో ఉండే తహసీల్దార్లు, ఆర్డీవోలు తలలు పట్టుకుంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకమైన ధరణి పోర్టల్ ద్వారా కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. పార్టు బీ కింద నమోదు చేసిన దరఖాస్తుల పరిష్కారానికి మార్గాలు దొరకడం లేదు. అందులోనే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రగతి భవన్ కేంద్రంగా రెవెన్యూ శాఖపై సుదీర్ఘ అనుభవం ఉన్న బృందం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. సమస్యలేం ఉన్నాయంటూ తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్తోంది. గతంలో గుర్తించిన సమస్యలకే పోర్టల్ ద్వారా పరిష్కారం చూపలేదు, పైపెచ్చు ఇంకేమున్నాయంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు మాత్రం పర్యటిస్తూనే ఉన్నారు. సమస్యల గుర్తింపుతోనే వారి పని సాగుతోంది.

కంప్యూటర్ మిస్టేక్ తో పట్టాదారు పాసు పుస్తకాల జారీని నిలిపేసి మూడేండ్ల నుంచి ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఆపరేటర్లు ఉద్దేశ్యపూర్వకంగానో, యాదృచ్ఛికంగానో చేసిన పొరపాట్లను సరిదిద్దేందుకు కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ జాప్యంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నట్లు తహసీల్దార్లు, ఆర్డీఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టాదారు చనిపోతే వారసులకు హక్కులు కల్పించడం కష్టమే. చచ్చినా చావే అన్నట్లుగా ధరణి పోర్టల్ లోని సాంకేతిక లోపాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వారసులను గుర్తించి లేదా క్షేత్ర స్థాయిలో విచారణ చేసి హక్కులు కల్పించే వ్యవస్థ, ఆప్షన్లు లేకపోవడం పెద్ద మైనస్​. చాలా గ్రామాల్లో సర్వే నంబర్ల వారీగా మొత్తం విస్తీర్ణానికి, పట్టాదారుల విస్తీర్ణాలకు మధ్య వ్యత్యాసం ఉండడం మరిన్ని తలనొప్పులు తెస్తోంది. వీటితో తలెత్తే సమస్యలకు భవిష్యత్తులోనూ పరిష్కారం చూపలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏదిఏమైనా పార్టు బీ దరఖాస్తులు పరిష్కరించకుండా జాప్యం చేస్తే సమస్యలు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది.

చనిపోయినా రావాల్సిందే..

అవును.. ఇది నిజం. చనిపోయిన వ్యక్తి రావాల్సిందే. ధరణి పోర్టల్ ద్వారా సమస్య పరిష్కరించుకోవాలంటే పట్టాదారుడు హాజరు కావాల్సిందే. వేలి ముద్ర వేయాల్సిందే. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో చిన్న చిన్న వివాదాలు, సాంకేతిక లోపాల కారణంగా లక్షలాది మందికి పట్టాదారు పాసు పుస్తకాలు జారీ కాలేదు, భూముల వివరాలను ధరణి పోర్టల్ లో నమోదు చేయలేదు. దీంతో వారి భూ హక్కులు ప్రశ్నార్థకంగా మార్చారు. ఇప్పటికింకా రెవెన్యూ స్పెషల్ ట్రిబ్యునళ్ల ద్వారా ఆర్వోఆర్ కేసుల పరిష్కారానికే సమయమంతా వెచ్చిస్తున్నారు. గడువు ముగిసినా కేసులను పరిష్కరిస్తూ ఆర్డర్లయితే జారీ చేయలేదు. ఇక పార్టు బీ దరఖాస్తులను ముట్టుకోలేదు.

ఈ మూడేళ్లలో వివాదాస్పద భూముల పట్టాదారులు కొందరు దురదృష్టవశాత్తు చనిపోయారు. వారి వారసులకు హక్కులు కల్పించాలంటే చనిపోయిన వ్యక్తి వేలి ముద్రలు అనివార్యంగా మారాయి. తండ్రి పేరు ధరణిలో నమోదైతే తప్ప వారసులకు హక్కులు కల్పించలేదని, వారసులం తామేనని వచ్చినా తండ్రి పేరిట ఉన్న భూమి ధరణి పోర్టల్ లో నమోదు చేయకపోవడంతో సమస్య ఉత్పన్నం కానుందని ఓ ఆర్డీఓ వివరించారు. చనిపోయిన వ్యక్తి వేలి ముద్రలు (బయోమెట్రిక్) ఎలా తీసుకురావాలో ధరణి పోర్టల్ నిర్వహించే ఉన్నతాధికారులే చెప్పాలి. ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాన్ని చూపెట్టకపోతే వేలాది మంది హక్కులు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. సులువుగా అయ్యే పనికి హక్కుదారులు కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాల్సిన దుస్థితి నెలకొందని సమాచారం. ఈ విషయాన్ని కొందరు అధికారులు ప్రగతి భవన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారేమో సమస్యలను వినడమే తప్ప మార్గాలు మాత్రం చూపెట్టేది లేదు.

అదనపు విస్తీర్ణానికి బలయ్యేదెవరు?

2017 లో భూ రికార్డుల ప్రక్షాళన మొదటి నాలుగు నెలల్లోనే 80 శాతానికి పైగా పూర్తయ్యింది. అప్పుడు రికార్డులన్నీ త్వరగా డిజిటలైజేషన్ చేయాలన్న ఉత్సుకత కనిపించింది. దాంతో యథాతథంగా రికార్డుల నమోదు జరిగింది. తర్వాత ఖాస్రా పహాణి విస్తీర్ణాలకు సరిపోవాలన్న షరతులు విధించారు. అంతకు ముందు పూర్తయిన రికార్డుల ప్రక్షాళన దాని ప్రకారం జరగలేదు. పహాణీల ఆధారంగానే రికార్డులను పూర్తి చేశారు. ఈ క్రమంలో ప్రతి రెవెన్యూ గ్రామంలో 15 నుంచి 20 శాతం సర్వే నంబర్ల పూర్తి విస్తీర్ణం, ఖాస్రా పహాణిలో నమోదైన విస్తీర్ణం కంటే అదనంగా నమోదైనట్లు ఓ డిప్యూటీ కలెక్టర్ చెప్పారు. పట్టాదారు పాసు పుస్తకంలో పేర్కొన్న భూమి కంటే క్షేత్రంలో తక్కువగా ఉంటుంది. ఐతే క్షేత్రంలో తనకు ఉన్న భూమిని పూర్తిగా అమ్మేసినా లేని భూములకు మళ్లీ హక్కుదారుడిగా రికార్డుల్లో కొనసాగే అవకాశం ఉంది. తన భూమిని చూపించాలంటూ అధికారులపై ఒత్తిడి చేస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. పైగా అక్రమంగా సదరు భూములను ఎవరికైనా యథేచ్ఛగా విక్రయించే సాంకేతిక నైపుణ్యం ధరణి పోర్టల్ లో ఉంది. దాంతో వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పార్టు బీలో కొత్త కోణం..

* మేజర్ కుటుంబ సభ్యులకు తెలియకుండా వారసత్వపు భూములను, ఆస్తులను విక్రయిస్తే ఎట్లా? ధరణి పోర్టల్ రాకముందే ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కాన్సెంట్ పట్టాదారుడి సంతకాలు చేయించుకునే వారు. కనీసం సాక్షి సంతకాలుగానైనా వారసులతో చేయించుకునే వారు. ధరణి పోర్టల్ ద్వారా వారసత్వపు భూములను ఎవరైనా కొనుగోలు చేస్తే మేజర్లుగా ఉండే కుటుంబ సభ్యుల కాన్సెంట్ తీసుకునే వ్యవస్థ లేదు. కనీసం వారితో సంతకాలు చేయించుకునే ఆప్షన్ కూడా లేదు. వారసత్వంగా వచ్చిన భూమిని తమకు తెలియకుండా అమ్మారంటూ కోర్టుకెక్కితే రిజిస్ట్రేషన్లు ప్రశ్నార్థకంగా మారుతుంది.

* పట్టాదారుడి కుటుంబ సభ్యులు కొందరు వేర్వేరు ప్రాంతాల్లో ఉండొచ్చు. వారసులు నలుగురైతే ముగ్గురే వచ్చి పౌతి చేయమని అడిగితే తప్పులు గుర్తించే వ్యవస్థ లేదు. ముగ్గురికే భాగ పంపకాలు చేయాలి. ఆ తర్వాత దూర ప్రాంతాల్లోని వారు వచ్చి అధికారులను ప్రశ్నించినా న్యాయం చేసేందుకు అవకాశం లేదు.

ఇలాంటి అనేక సమస్యలు ఉన్నట్లు ధరణి పోర్టల్ పనితీరుపై అధ్యయనం చేస్తున్న ఉన్నతాధికారులకు తహసీల్దార్లు, ఆర్డీఓలు చెబుతున్నారు. కానీ పరిష్కారం ఎప్పటికి చూపిస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News