బోర్డర్ సెక్యూరిటీ టైట్.. శాటిలైట్లతో నిఘా
దిశ, వెబ్ డెస్క్: చైనా కుట్రపూరిత ఎత్తులకు పై ఎత్తులు వేయాలని భారత్ నిర్ణయించింది. అందులో భాగంగా హిమాలయ పర్వత సానువుల్లో డ్రాగన్‌పై పటిష్ఠ నిఘా పెట్టాలనుకుంటోంది. ఇందుకు ప్రత్యేకంగా 4 నుంచి 6 కొత్త ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు యోచిస్తోంది. 4000 కిలోమీటర్ల మేర సరిహద్దుల్లోని కొండలు, లోయల్లో చైనా సైనికులు ఒక్క అడుగు ముందుకు వేసినా తెలిసేలా యుద్ధతంత్రం చేపట్టాలన్నది సైన్యం ఉద్దేశంగా కనిపిస్తోంది. సరిహద్దుల్లోని భారత్‌కు చెందిన భూభాగాలను తమవే అని చైనా […]
దిశ, వెబ్ డెస్క్: చైనా కుట్రపూరిత ఎత్తులకు పై ఎత్తులు వేయాలని భారత్ నిర్ణయించింది. అందులో భాగంగా హిమాలయ పర్వత సానువుల్లో డ్రాగన్‌పై పటిష్ఠ నిఘా పెట్టాలనుకుంటోంది. ఇందుకు ప్రత్యేకంగా 4 నుంచి 6 కొత్త ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించేందుకు యోచిస్తోంది. 4000 కిలోమీటర్ల మేర సరిహద్దుల్లోని కొండలు, లోయల్లో చైనా సైనికులు ఒక్క అడుగు ముందుకు వేసినా తెలిసేలా యుద్ధతంత్రం చేపట్టాలన్నది సైన్యం ఉద్దేశంగా కనిపిస్తోంది.
సరిహద్దుల్లోని భారత్‌కు చెందిన భూభాగాలను తమవే అని చైనా వాదిస్తున్న విషయం తెలిసిందే.. పదేపదే ఆ దేశ సైనికులు భారత్ వైపు వస్తుంటారు. కొన్నాళ్ల కిందట జిన్‌జియాంగ్ ప్రాంతంలో చైనా దాదాపు 40వేల మంది సైనికులు, భారీ స్థాయిలో ఆయుధాలు, యుద్ధ సామగ్రిని మోహరించింది. అక్కడి నుంచి భారత్‌కు చెందిన కొన్ని ప్రాంతాల్లో శిబిరాలు వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇలాంటి ఘటనలు ముందే తెలియాలంటే ఉపగ్రహ నిఘా అవసరమని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
‘భారత, శత్రుదేశ సరిహద్దు ప్రాంతాల్లోని లోయల్లో చైనా సైనికుల కదలికలు మరింత విస్పష్టంగా తెలియాలంటే మనకు కచ్చితంగా 4 నుంచి 6 ఉపగ్రహాలు అవసరం. వీటికి హై రిజల్యూషన్ సెన్సార్లు, కెమెరాలు ఉండాలి. చీమ చిటుక్కుమన్నా మనకు తెలియాలి.. అని సైనిక వర్గాలు కోరినట్లు తెలిసంది. జూన్ నెలలో గల్వాన్ లోయలో డ్రాగన్ సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో సరిహద్దుల్లో ఉద్రికత్తలు పెరిగాయి. దాదాపుగా యుద్ధఛాయలు కనిపించాయి. ప్రస్తుతం సైనిక, దౌత్యపరంగా చర్చలు కొనసాగుతున్నప్పటికీ పాంగాంగ్ సరస్సు, గోగ్రా, ఫింగర్ ఫోర్ ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి పంపించేందుకు చైనా సంసిద్ధత వ్యక్తం చేసినట్లు కనిపించడం లేదు.