నేర్చుకుంటున్నారు సరే.. అమలు చేస్తున్నారా?

దిశ, వెబ్‌డెస్క్: ‘రేయ్.. ఫోన్ పక్కన పడేసి పుస్తకం తీయ్’ అని ఒకప్పుడు అమ్మ అనేది. ఇప్పుడేమో ‘రేయ్… క్లాస్‌కు టైమైంది, ఫోన్ తీయ్’ అంటోంది. ఒకప్పుడేమో తలనొస్తుంది అని చెప్పినా, కారణం ఫోనే అని చెప్పిన అమ్మ.. ఇప్పుడు తలనొస్తుంది అంటే కాఫీతో పాటు ఫోన్ కూడా ఇస్తుంది. దీన్ని బట్టి చూస్తే పిల్లల స్క్రీన్ టైమ్ దారుణంగా పెరిగినట్లు అర్థం చేసుకోవచ్చు. స్క్రీన్ టైమ్ అంటే ఇక్కడ కేవలం స్మార్ట్ ఫోన్‌ను మాత్రమే కాదు […]

Update: 2020-09-28 01:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ‘రేయ్.. ఫోన్ పక్కన పడేసి పుస్తకం తీయ్’ అని ఒకప్పుడు అమ్మ అనేది. ఇప్పుడేమో ‘రేయ్… క్లాస్‌కు టైమైంది, ఫోన్ తీయ్’ అంటోంది. ఒకప్పుడేమో తలనొస్తుంది అని చెప్పినా, కారణం ఫోనే అని చెప్పిన అమ్మ.. ఇప్పుడు తలనొస్తుంది అంటే కాఫీతో పాటు ఫోన్ కూడా ఇస్తుంది. దీన్ని బట్టి చూస్తే పిల్లల స్క్రీన్ టైమ్ దారుణంగా పెరిగినట్లు అర్థం చేసుకోవచ్చు. స్క్రీన్ టైమ్ అంటే ఇక్కడ కేవలం స్మార్ట్ ఫోన్‌ను మాత్రమే కాదు టీవీ, ల్యాప్‌టాప్, ప్లేస్టేషన్, కంప్యూటర్ ఇలా అన్ని తెరలను పరిగణించాలి. ఇప్పటి పిల్లలందరూ స్మార్ట్ ఫోన్ కూడా తమ తల్లిదండ్రుల శరీరంలో భాగం అనుకుంటున్నారు. అందుకే ఏడాది దాటకముందే దాని లాక్ తీయడం కూడా నేర్చేసుకుంటున్నారు. రెండు ఫోన్లు ఒకేలా ఉన్నా తల్లిది ఏ ఫోన్, తండ్రిది ఏ ఫోన్ అని గుర్తించగలుగుతున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో అయితే పిల్లలకు స్క్రీన్ తప్ప బయటి ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియడం లేదు.

అటు ఆఫీసు పనిని, ఇటు ఇంటి పనిని సమన్వయం చేసుకోలేని తల్లిదండ్రులు, వారి పిల్లలకు ఒక ఫోన్ ఇచ్చేసి పక్కన కూర్చోబెడుతున్నారు. దీంతో రెండు మూడేళ్ల వయస్సులోనే పిల్లలు స్మార్ట్‌ఫోన్ తెరలకు బానిసలు అవుతున్నారు. అయితే ఇందులో తల్లిదండ్రుల తప్పు లేదు. అవసరం అలాంటిది. స్మార్ట్‌ఫోన్ వాడటం వల్ల పిల్లలకు స్వయంగా పాఠాలు నేర్పించే పని తగ్గుతోంది. కావాల్సిన పాఠాలన్నీ అందులోనే ఉండటం ఒక ప్రయోజనకర విషయం. అయితే ఆ పాఠాలు ఒక పరిమితిని విధించడం వల్ల పిల్లల భవిష్యత్తును ఇంట్లో నుండే తీర్చిదిద్దవచ్చు. కానీ ఇక్కడొక ప్రధాన సమస్య ఉంది. పిల్లలు స్మార్ట్‌ఫోన్ ద్వారా మంచి పాఠాలు నేర్చుకుంటూ జ్ఞానం సంపాదిస్తున్నారు కరక్టే.. కానీ ఆ జ్ఞానం వల్ల నిజంగా ఉపయోగముంటుందా?

ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ముందు అసలు పిల్లలు ఎలా తెలివిగల వాళ్లుగా మారుతారనే విషయం మీద స్పష్టత ఉండాలి. పిల్లలు అనే కాదు ప్రతి మానవుడు తెలివిగా మారడానికి పాటించాల్సిన విధానం ఏంటంటే ముందు థియరీ నేర్చుకుని, ఆ తర్వాత ప్రాక్టికల్ చేయాలి. కేవలం థియరీ మీదనే పట్టు ఉండటం జ్ఞానం అనిపించుకోదు. దాన్ని ప్రాక్టికల్‌గా ఎలా అమలు చేస్తారన్నదే అసలైన జ్ఞానం. అందుకే ఒక తరగతిలో పిల్లలందరూ నేర్చుకునేది ఒకటే పాఠం అయినప్పటికీ ఫస్ట్ ర్యాంకర్ ఒక్కడే ఉంటాడు. ఎందుకంటే ఆ నేర్చుకున్న పాఠాన్ని ఆ ఒక్కడే పరీక్షలో బాగా అమలు చేయగలిగాడు కాబట్టి. కానీ కొన్ని సార్లు ఇదే ఫస్ట్ ర్యాంకర్ జీవితంలో ఘోరంగా విఫలమవ్వొచ్చు, ఎందుకంటే నేర్చుకున్న అంశాన్ని పరీక్షలో అమలు చేసినంత సులభంగా ఆ ఫస్ట్ ర్యాంకర్ జీవితంలో అమలు చేయలేయపోయాడు కాబట్టి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. నేర్చుకున్న ప్రతి అంశాన్ని సరిగ్గా అమలు చేయడమే సరైన జ్ఞానం. మరి ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌లో పాఠాలు నేర్చుకుంటున్న పిల్లలు నేర్చుకున్న జ్ఞానాన్ని అమలు చేయగలుగుతున్నారా?

కచ్చితంగా లేదు. వారు ఇవాళ నేర్చుకుంటున్నారు, రేపు మళ్లీ కొత్తది నేర్చుకుంటున్నారు తప్ప, అమలు చేయడానికి అవకాశం దొరకడం లేదు. దీంతో పిల్లల్లో ఊహాజ్ఞానం తగ్గుతోంది. ఊహించే జ్ఞానం ఎదగనప్పుడు మానసిక అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. ఉదాహరణకు మామిడి పండు గురించి పిల్లలు యూట్యూబ్‌లో నేర్చుకున్నారనుకుందాం. ఆ వీడియోలో మామిడి పండు ఎలా ఉంటుందో చూడగలుగుతారు, దాన్ని వేర్వేరు భాషల్లో ఏమంటారో వినగలుగుతారు కానీ దాని రుచి ఎలా ఉంటుంది, వాసన ఎలా ఉంటుంది, దాని స్పర్శ ఎలా ఉంటుంది, అది ఎంత బరువు ఉంటుంది అనేవి నేర్చుకోలేరు. ఇక్కడ కళ్లు, చెవుల జ్ఞానానికి మాత్రమే పని ఉంటుంది తప్ప వాసన, స్పర్శ, రుచి జ్ఞానాలకు పని ఉండదు. దీని వల్ల పిల్లలు ఎప్పుడైనా పుల్లగా, తియ్యగా ఉండే రెండు మామిడి కాయలు తిన్నారనుకోండి, అప్పుడు వారు నేర్చుకున్నదానికి అమలు చేసిన దానికి వైవిధ్యత కనిపిస్తుంది. ఇలా నేర్చుకోవడం వల్ల మామిడి పండు పేరు చెప్పినపుడు పిల్లలు ఆకారాన్ని ఊహించుకోగలరు తప్ప, రుచిని ఊహించుకోలేరు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి?

పరిస్థితులు అలా తయారయ్యాయి కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోవచ్చు. కానీ తల్లిదండ్రులు కొంచెం చొరవ తీసుకుంటే పిల్లల ఊహాజ్ఞానాన్ని పెంపొందించవచ్చు. ఇందుకు ప్రత్యేకంగా చేయాల్సింది ఏముండదు. ప్రతిరోజు వారితో ఒక గంటసేపు సమయం గడిపితే చాలు. ఆ గంట సమయంలో వారు ఆరోజు ఫోన్‌లో ఏమేం నేర్చుకున్నారో, ఫోన్ ఏ రకంగా ఉపయోగించారో, ఎంతసేపు ఉపయోగించారో తెలుసుకోవాలి. వారు నేర్చుకున్న దానికి ప్రాక్టికల్ ఉదాహరణలు ఏవైనా ఉంటే వాటిని భౌతికంగా వారికి చూపించాలి. గట్టి ఉదాహరణ ఉన్నపుడే వారిలో ఆ నేర్చుకున్న అంశం బలంగా పాతుకుపోతుంది. వారి మంచి విషయాన్ని నేర్చుకుంటే ప్రోత్సహించి, చెడు విషయాన్ని నేర్చుకుంటే దాని వల్ల కలిగే నష్టాల ఉదాహరణలను మాన్యువల్‌గా క్రియేట్ చేసి వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అవసరమైతే నటిస్తూ చెప్పినా సరే.. అంతిమంగా పిల్లలు నేర్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈరోజుల్లో బయట తిరిగే సౌకర్యం లేదు కాబట్టి సామాజిక జ్ఞానం ఉండకపోవచ్చు. ఆ జ్ఞానం కోసం పుస్తకాలు చదివే అలవాటును నేర్పిస్తే ఇంకా మంచిది. అందుకే అన్నారేమో పిల్లలను పెంచడం ఒక కళ అని!

Tags:    

Similar News