వారం రోజులుగా ఆరువేల మార్క్ దాటుతున్న కరోనా కేసులు
దిశ, న్యూస్‌బ్యూరో : దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. వారం రోజులుగా ప్రతీరోజు ఆరు వేల కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 6566 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,58,333కి చేరింది. ఒక్కరోజే 191 మంది కరోనాతో మరణించగా వ్యాధితో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4531కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 67,692 మంది కోలుకోగా యాక్టివ్ […]
దిశ, న్యూస్‌బ్యూరో :
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది. వారం రోజులుగా ప్రతీరోజు ఆరు వేల కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా కొత్తగా 6566 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,58,333కి చేరింది. ఒక్కరోజే 191 మంది కరోనాతో మరణించగా వ్యాధితో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4531కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 67,692 మంది కోలుకోగా యాక్టివ్ కేసులు 86,110 ఉన్నాయి. ఢిల్లీలో ఒకే రోజున వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రత ప్రమాదకర స్థాయిలోనే కొనసాగుతోంది.
దేశంలోనే ఇప్పటివరకు ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో మంగళవారం ఒక్కరోజే 2,598 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 59,546కి చేరింది. రాష్ట్రంలో గడిచిన 12 రోజులుగా 2వేలకు పైనే కొత్త కేసులు రికార్డవుతున్నాయి. రాజధాని ముంబైలోని ధారవి మురికివాడలో 36 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 1,675కు చేరింది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ మురికి వాడలో కరోనాతో ఇప్పటివరకు 64 మంది మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
తమిళనాడులో ఒక్కరోజే 827 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 19372కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే 12 మంది మరణించడంతో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 145కి చేరింది. రాజధాని చెన్నైలోనే 12వేలకుపైన కేసులు నమోదవడం నగర వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఇక దేశరాజధాని ఢిల్లీలో ఒక్కరోజులో ఇప్పటివరకు అత్యధికంగా 1024 కేసులు నమోదుకాగా ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 16281కి చేరింది. ఢిల్లీలో కరోనాతో ఇప్పటివరకు 303 మంది ప్రాణాలు కోల్పోయారు. గురువారం ఢిల్లీలో నమోదైన కేసుల్లో 195 కేసులు కేవలం ప్రతిష్టాత్మక ఎయిమ్స్ సంస్థ సిబ్బందివే కావడం గమనార్హం. గుజరాత్‌లో ఒక్కరోజే 367 కొత్త కేసులు నమోదవగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య15,572కి చేరింది. ఇప్పటివరకు ఇక్కడ వ్యాధి సోకి మొత్తం 960 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 54 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 2,841కి చేరింది. ఇక్కడ ఇప్పటివరకు కరోనాతో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 824 యాక్టివ్ కేసులున్నాయి.