ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు.. అధికారుల హస్తం..!
దిశ, తెలంగాణ బ్యూరో: రూ. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో దర్జాగా కబ్బా చేస్తున్నారు. ఎంచక్కా అమ్మేసుకుంటూ కోట్లు గడిస్తున్నారు. ఆ భూములను కాపాడాల్సిన రెవెన్యూ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం పర్వతాపూర్‌లోని సాలార్జంగ్ కంచెలో 38.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని కాపాడేందుకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమ నిర్మాణాల జోరు పెరిగింది. ఆఖరికి కాలనీల్లో వెలిసిన […]
దిశ, తెలంగాణ బ్యూరో: రూ. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో దర్జాగా కబ్బా చేస్తున్నారు. ఎంచక్కా అమ్మేసుకుంటూ కోట్లు గడిస్తున్నారు. ఆ భూములను కాపాడాల్సిన రెవెన్యూ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం పర్వతాపూర్‌లోని సాలార్జంగ్ కంచెలో 38.35 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాన్ని కాపాడేందుకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అక్రమ నిర్మాణాల జోరు పెరిగింది.
ఆఖరికి కాలనీల్లో వెలిసిన వెంచర్లలోని పార్కు స్థలాలను కూడా అమ్మేశారు. సాలార్జంగ్ కంచెలోని 38.35 ఎకరాలు సీలింగ్ భూమి ఉంది. అదే సర్వే నం.10, 11 లో 32 ఎకరాలు, మరో సర్వే నంబరు పార్టులో 6.10 ఎకరాలు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం రూ.కోట్ల విలువజేసే భూమిని కాపాడే ప్రయత్నాలు చేయలేదు. ఫెన్సింగ్ వేయలేదు. కనీసం హద్దులు గుర్తించకుండా వదిలేశారు. దీంతో కబ్జాదారులకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిర్మాణాలు త్వరగా చుసుకోవాలట..
సాలార్జంగ్ కంచెలోని వివాదాస్పద భూముల్లో జోరుగా క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేయగానే త్వరగా నిర్మాణం చేసుకోవాలని కొందరు అధికారులు సూచిస్తూ వారికి అండగా నిలబడుతున్నారని సమాచారం. ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తహసీల్దార్ కు సీలింగ్ భూమి ఉందని తెలిసినా, అన్యాక్రాంతమవుతుందని గుర్తించినా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. డిప్యూటీ కలెక్టర్ కు ఫోన్ చేస్తే తహసీల్దార్ కు ఫిర్యాదు చేయమని సలహాలు ఇస్తున్నారని తెలంగాణ రియల్టర్ల సంఘం మండిపడింది.
అందరికీ ముడుపులు
పర్వతాపూర్ లో రూ.కోట్ల విలువజేసే సీలింగ్ భూములు కబ్జాకు గురవుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కూడా నోరు మెదపకపోవడం పట్ల పలు అనుమానాలు కలుగుతున్నాయి. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంతో భాగస్వాములుగా నిలిచినట్లు సమాచారం. అందుకే వారెవరూ ఈ భూములను కాపాడేందుకు ముందుకు రావడం లేదంటున్నారు. నగర శివార్లలో అత్యంత ఖరీదైన భూమిని కాపాడడంలో రెవెన్యూ యంత్రాంగం విఫలమైనట్లు తెలుస్తోంది. ఎన్నోసార్లు ప్రహరీ, ఫెన్సింగ్ ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలని సూచించినా పెడచెవిన పెట్టారని, అందుకే ఆ భూమి అదృశ్యమవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
కంచె ఎందుకు వేయరు?:
ఘట్ కేసర్ మండలం పీర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్జంగ్ కంచె భూములకు హద్దులు గుర్తించి, ఫెన్సింగ్, ప్రహరీ నిర్మించి ఉంటే అన్యాక్రాంతమయ్యేది కాదు. హద్దురాళ్లు పాతేందుకు రెవెన్యూ అధికారులు ముందుకు రావడం లేదు. ఇక్కడి ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల నాయకులు కూడా రూ.కోట్లు విలువజేసే ప్రభుత్వ భూమిని రక్షించేందుకు ముందుకు రావడం లేదు. సీఎం కేసీఆర్, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశాం. – నారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్, అధ్యక్షుడు, తెలంగాణ రియల్టర్ల సంఘం