ఈటల రాజీనామా చేస్తే.. బరిలో కెప్టెన్ ఫ్యామిలీ..?
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఈటల రాజేందర్ ఎపిసోడ్ తరువాత రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజేందర్ రాజీనామా చేస్తారా లేదా అన్న అంశం అటుంచితే అవకాశం వస్తే బరిలో నిలిచేందుకు చాలా మంది ఆశావహులు రంగంలోకి దిగుతున్నారు. ఇందులో కెప్టెన్ ఫ్యామిలీ ముందు వరసలో నిలుస్తోంది. బుధవారం కెప్టెన్ లక్ష్మీకాంతరావు మీడియాతో మాట్లాడుతూ… చేసిన వ్యాఖ్యలు ఆ ఫ్యామిలీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. మీడియా అడిగిన ప్రశ్నకు ఓ పిట్టకథ చెప్పిన […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: ఈటల రాజేందర్ ఎపిసోడ్ తరువాత రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. రాజేందర్ రాజీనామా చేస్తారా లేదా అన్న అంశం అటుంచితే అవకాశం వస్తే బరిలో నిలిచేందుకు చాలా మంది ఆశావహులు రంగంలోకి దిగుతున్నారు. ఇందులో కెప్టెన్ ఫ్యామిలీ ముందు వరసలో నిలుస్తోంది. బుధవారం కెప్టెన్ లక్ష్మీకాంతరావు మీడియాతో మాట్లాడుతూ… చేసిన వ్యాఖ్యలు ఆ ఫ్యామిలీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. మీడియా అడిగిన ప్రశ్నకు ఓ పిట్టకథ చెప్పిన కెప్టెన్.. తన మనసులోని భావాన్ని వ్యక్త పరిచారు. అవకాశం ఇస్తే పోటీ చేస్తామని కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.
కెప్టెన్ ఫ్యామిలీలో ఎవరో..?
ఉప ఎన్నికలు అనివార్యమైతే కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఫ్యామిలీ నుండి బరిలో నిలిచేందుకు పోటీ ఎక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆయన భార్య సరోజనీ దేవి, కెప్టెన్ అన్న వొడితెల రాజేశ్వర్‌రావు మనవడు ప్రణవ్‌బాబుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గతంలో ఎంపీపీగా పనిచేసిన అనుభవం కూడా సరోజనీదేవీకి ఉండడంతో ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ రాజకీయాలను తనకు అనుకూలంగా మల్చుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అయితే కెప్టెన్ ఫ్యామిలీలో మొదటి నుండి రాజకీయాల్లో ఉన్న వొడితల రాజేశ్వర్‌రావు పలుమార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పీవి నరసింహరావు హయాంలో రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఆయన వారసుడిగా ప్రణవ్‌బాబుకు అవకాశం కల్పిస్తే ఆయన వారసులకు ప్రాధాన్యత కల్పించినట్టు అవుతుందని అనుకుంటున్నారు.
ప్రణవ్‌బాబుకు కూడా రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఉంది. ఆయన పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించారు. కేటీఆర్‌తో కూడా ఆయనకు వ్యక్తిగత పరిచయాలు ఉండడంతో అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కాగా రాజ్యసభ సభ్యునిగా కెప్టెన్, ఆయన తనయుడు సతీష్ బాబు హుస్నాబాద్ ఎమ్మల్యేగా ఉన్నారు. దీంతో అదే కుటుంబానికి అవకాశం ఇస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుని ఈటల తన ప్రచారస్త్రంగా మల్చుకుంటే వ్యతిరేకతను మూటగట్టుకునే ప్రమాదం లేకపోలేదని కూడా భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కుటుంబ పాలన అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తున్న క్రమంలో మరో ఫ్యామిలీకి అవకాశం కల్పించి మరింత అవకాశం ఇవ్వడం సముచితం కాదనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నట్టు సమాచారం.
ఇతర పార్టీలే దిక్కా..?
హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ తరువాత స్థానం భర్తీ చేసే నాయకుడు లేకపోవడం అధిష్టానానికి కొంత ఇబ్బందిగానే మారింది. ఇప్పటి వరకు హుజురాబాద్ అంటే ఈటల, ఈటల అంటే హుజురాబాద్ అన్న పరిస్థితి నెలకొనడం వల్ల పార్టీలో అంతే బలమైన నాయకుడు తయారు కాలేకపోయారన్నది పార్టీ వర్గాల వాదన. దీంతో ఈటలను ఢీ కొట్టే నాయకుడిని వేరే పార్టీల నుండే తీసుకొచ్చుకోవాల్సిన పరిస్థితే ఏర్పడిందని చెప్పకతప్పదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసిన కౌశిక్‌రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నప్పటికీ ఆయన టీఆర్ఎస్ లో చేరుతాడా లేదా అన్నది మీమాంసగానే మారింది. ఇటీవల ’దిశ‘తో మాట్లాడిన కౌశిక్ రెడ్డి తాను టీఆర్ఎస్‌లో చేరేది లేదని కాంగ్రెస్ పార్టీ నుండే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
అయితే ఇప్పటికీ ఆయనను ఒప్పించేందుకు హైదరాబాద్ సమీపంలోని ఓ ఎమ్మెల్యే ద్వారా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఆయనకు అత్యంత సన్నిహితుడైన ఆ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం. కానీ కౌశిక్ రెడ్డినే తనకు అవకాశం ఇస్తే టీఆర్ఎస్ నుండి పోటీ చేస్తానన్న సంకేతాలు పంపిచినట్టుగా ప్రచారం జరుగుతోంది. అదే ఎమ్మెల్యే ద్వారా ఆయన ఓ వాయిస్ మెసెజ్ పంపిస్తే ఆ మెసెజ్ ముఖ్యమంత్రి వరకు చేరిందని తెలుస్తోంది. ఒక వేళ ఇదే నిజమైనా సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అంతుచిక్కకుండా పోయింది. మరోవైపున ఇక్కడి నుండి రెండు సార్లు ప్రాతినిథ్యం వహించిన ఇనుగాల పెద్దరెడ్డి కూడా బీజేపీ నుండి టీఆర్ఎస్ లోకి చేరుతారని కూడా అంటున్నారు. టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఆయనను పోటీలో దింపితే ఈటలకు ధీటైన అభ్యర్థి అవుతాడా అన్న విషయంపై అధినేత ఆరా తీస్తున్నట్టు సమాచారం.