కంపెనీల లాభాలకు గండి!
దిశ, సెంట్రల్ డెస్క్: గతేడాది చివరివరకూ మందగమనంతో దేశ ఆర్థికవ్యవస్థకు గాయాలు తప్పలేదు, ఈ ఏడాది కరోనా భయపెట్టేస్తోంది. ఇంకా పలుసమస్యలతో ఏటికి ఎదురీదుతున్నట్టుగా గడిచిన కాలంలో భారత కంపెనీల నికర లాభాలు తగ్గుముఖం పట్టాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికంలో భారత కంపెనీల నికర లాభాలు అంతకుముందు 2018-19 ఆర్థిక సంవత్సరం కంటే 22 శాతం తగ్గాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ(ఇక్రా) అంచనా వేసింది. అంతేకాదు, లాక్‌డౌన్ కారణంగా జూన్ త్రైమాసికానికి ఈ […]
దిశ, సెంట్రల్ డెస్క్: గతేడాది చివరివరకూ మందగమనంతో దేశ ఆర్థికవ్యవస్థకు గాయాలు తప్పలేదు, ఈ ఏడాది కరోనా భయపెట్టేస్తోంది. ఇంకా పలుసమస్యలతో ఏటికి ఎదురీదుతున్నట్టుగా గడిచిన కాలంలో భారత కంపెనీల నికర లాభాలు తగ్గుముఖం పట్టాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికంలో భారత కంపెనీల నికర లాభాలు అంతకుముందు 2018-19 ఆర్థిక సంవత్సరం కంటే 22 శాతం తగ్గాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ(ఇక్రా) అంచనా వేసింది. అంతేకాదు, లాక్‌డౌన్ కారణంగా జూన్ త్రైమాసికానికి ఈ ముప్పు తప్పేలా లేదని తెలిపింది. ప్రస్తుత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ఆర్థికవ్యవస్థలు కుప్పకూలాయి. నష్టాలను అధిగమించే పరిస్థితులు లేని క్రమంలో అనేక కంపెనీలు ఉద్యోగాలలో కోతలను, వేతనాల్లో తగ్గింపులను అనుసరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగాన్ని మినహాయించి మిగిలిన అన్ని రంగాల్లోని మొత్తం 184 కంపెనీల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఇక్రా ఈ నివేదికను సిద్ధం చేసింది. దీని ప్రకారం..చివరి త్రైమాసికంలో కంపెనీల సగటు లాభాలు 22 శాతం క్షీణించినట్టు తేలింది. 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 12 శాతం తగ్గినట్టు స్పష్టం చేసింది. ఇక, విపరీతంగా పెరిగిపోతున్న కరోనా కేసులను నివారించేందుకు లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో జూన్ త్రైమాసికంలో కూడా ప్రతికూల ప్రభావం తప్పేలా లేదని ఇక్రా అభిప్రాయపడింది. అలాగే, కరోనా భయాలు నెలకొనడం వల్లనే పెట్టుబడిదారులు ఈక్విటీల నుంచి వెనక్కి వెళ్తున్నట్టు వివరించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఆదాయ క్షీణత ఇంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2.9 శాతం క్షీణించిందని, అంతేకాకుండా నిర్వహణ లాభాల మార్జిన్ 16.8 శాతానికి పరిమితమైనట్టు ఇక్రా వెల్లడించింది.
వస్తు అనుసంధాన రంగాల్లో క్షీణత…
వినియోగదారు డిమాండ్ తగ్గిపోవడం, కమొడిటీ అనుసంధాన రంగాలపై స్పష్టమైన ప్రతికూలతలు చివరి త్రైమాసికంలో భారతీయ కంపెనీల పనితీరుపై ప్రభావం వేశాయని పేర్కొంది. పన్నుకు ముందు లాభాల మార్జిన్లు 7.1 శాతం క్షీణించినట్టు ఇక్రా తెలిపింది. వీటిపై జూన్ త్రైమాసికానికి మరింత స్పష్టత వస్తుందని పేర్కొంది. ఎఫ్ఎంసీజీ, వినియోగ వస్తువులు, వాహన రంగాల్లో విక్రయాలు క్షీణించడం, స్వల్పంగా మాత్రమే వృద్ధి నమోదవడం వినియోగదారుల సెంటిమెంట్ దెబ్బతినడానికి కారణమయ్యాయని ఇక్రా నివేదికలో పేర్కొంది. భారతీయ కంపెనీల పనితీరుపై వ్యాఖ్యానించిన ఇక్రా సెక్టార్ హెడ్ వైస్ ప్రెసిడెంట్ శంషార్ దేవాన్.. చివరిత్రైమాసికంలో వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడటానికి పలు కారణాలు ప్రభావం చూపిస్తున్నాయని, వస్తువు అనుసంధాన రంగాల్లో ఆదాయం 15 శాతం సంకోచానికి గురైందని, వినియోగదారు ఆధారిత రంగాలలో ఆదాయం 9 శాతం పడిపోయిందని చెప్పారు. గత త్రైమాసిక ప్రారంభ నెలల్లో కొంత పెరుగుదల ఉన్నప్పటికీ, వినియోగాధారిత రంగాల్లో అమ్మకాల పరిమాణాల్లో క్షీణత వల్ల వినియోగదారులు, ఆటో పరికరాల తయారీదారుల సెంటిమెంట్ దెబ్బతిన్నదని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి, స్థూల ఆర్థిక మందగమనంతో తగ్గిన వాల్యూమ్‌లతో పాటు, వస్తువు ధరలను తగ్గించడం వల్ల లోహాలు, మైనింగ్, ప్రధాన రంగాల ఆదాయ సంకోచానికి దారితీసిందని దేవాన్ వివరించారు. విమానయాన, టెలికాం, నిర్మాణం వంటి రంగాలు వడ్డీ వ్యయాలు వార్షిక ప్రాతిపదికన గణనీయంగా పెరిగాయి. అదే సమయంలో, ప్రతికూల నిర్వహణ కారణంగా వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయాలు కుదించబడ్డాయి. విద్యుత్, రియల్ ఎస్టేట్ వంటి ఒత్తిడితో కూడిన రంగాలలో వడ్డీ ఆదాయం రెండు రెట్ల కంటే తక్కువకు పడిపోయింది. ఇది తీవ్రమైన రుణ సమస్యలకు దారితీసే ప్రమాదముందని దేవాన్ పేర్కొన్నారు.
ఎంత చేసినా చిక్కులు తప్పవు…
భారత కంపెనీల ప్రాధాన్యత.. ద్రవ్యతను కొనసాగించడం, ఖర్చులను తగ్గించడం, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం వంటి విధానాలను అమలు చేసేలా ఉండాలని దేవాన్ అభిప్రాయపడ్డారు. వేతన తగ్గింపులు, ఉద్యోగుల హేతుబద్దీకరణ, లీజుల ద్వారా అద్దెల ఒప్పందాలను తిరిగి చర్చించడం వంటి విధానాలను కార్పొరెట్ కంపెనీలు అమలు చేస్తున్నాయి. ఇటువంటివి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కరోనా సంక్షోభం వల్ల ఏర్పడ్డ క్రెడిట్ చిక్కులు అనేక కంపెనీలకు ముఖ్యమైన సవాళ్లుగా ఉండనున్నట్టు దేవాన్ స్పష్టం చేశారు.