ఆసక్తికరంగా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా న్యూజీలాండ్ రికార్డు సృష్టించింది. కరోనా మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన 3 మ్యాచ్‌ల సిరీస్ రద్దు కావడంతో టాప్-2లో ఉన్న న్యూజీలాండ్ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. అయితే 2021 మార్చి లోపు ఈ సిరీస్ రీషెడ్యూల్ అయితే ఐసీసీ పాయింట్స్ టేబుల్‌లో మార్పు రావచ్చు. కానీ ప్రస్తుతానికైతే న్యూజీలాండ్ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. ఒక బెర్త్ […]
దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా న్యూజీలాండ్ రికార్డు సృష్టించింది. కరోనా మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన 3 మ్యాచ్‌ల సిరీస్ రద్దు కావడంతో టాప్-2లో ఉన్న న్యూజీలాండ్ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. అయితే 2021 మార్చి లోపు ఈ సిరీస్ రీషెడ్యూల్ అయితే ఐసీసీ పాయింట్స్ టేబుల్‌లో మార్పు రావచ్చు.
కానీ ప్రస్తుతానికైతే న్యూజీలాండ్ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది. ఒక బెర్త్ కివీస్‌కు ఖాయం కావడంతో రెండో బెర్త్ కోసం పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఇండియా అగ్రస్థానంలో ఉన్నా.. ఆ స్థానం కాపాడుకోవాలంటే ఇంగ్లాండ్‌తో జరుగనున్న సిరీస్ కీలకంగా మారనున్నది. ఆ సిరీస్‌లో భారత జట్టు విజయాల పైనే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ బెర్తు ఖరారు అవుతుంది.
2వ స్థానంలో ఉన్న జట్టు ఎలా అర్హత సాధించింది?
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ బెర్తులో ఇంకా ఒకటే మిగిలి ఉండటంతో పోటీ తీవ్రమైంది. ప్రస్తుతం ఆ బెర్తు కోసం అగ్రస్థానంలో ఉన్న ఇండియా, మూడో స్థానంలోని ఆస్ట్రేలియా మధ్య పోటీ నెలకొన్నది. అదెలా రెండో స్థానంలో ఉన్న జట్టు అర్హత సాధించి అగ్రస్థానంలో ఉన్న జట్టుకు బెర్త్ ఖాయం కాలేదని అందరికీ అనుమానం రావచ్చు. అసలు విషయం ఏంటంటే కరోనా కారణంగా ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ర్యాంకులను పాయింట్ల పరంగా కాకుండా విజయాల శాతంతో నిర్ణయిస్తున్నది.
న్యూజీలాండ్ జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఉన్న మ్యాచ్‌లన్నీ ఆడేసింది. ఇక ముందు ఆడే మ్యాచ్‌లు ఏవీ లేదు. దీంతో దాని విజయాల శాతం 70లో మార్పు ఏమీ ఉండదు. అయితే 71.67 శాతం విజయాలతో ఉన్న టీమ్ ఇండియా మరో నాలుగు టెస్టులు ఆడనున్నది. ఈ మ్యాచ్‌లలో ఓటమిపాలైతే విజయాల శాతం పడిపోతుంది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ రద్దుతో ఆస్ట్రేలియా జట్టు 69.16తో అలాగే ఉండిపోతుంది. కాబట్టి దానికి 2వ స్థానం దక్కే అవకాశం ఉన్నది.
ఇంగ్లాండ్ సిరీస్ కీలకం..
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఎలాంటి సమీకరణలు అవసరం లేకుండా టీమ్ ఇండియాకు మంచి అవకాశం ఉన్నది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ సిరీస్‌లో కనుక కనీసం 2-0, 2-1తో విజయం సాధిస్తే భారత జట్టు ఫైనల్స్‌కు అర్హత సాధించడం ఖాయం. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-0, 3-0, 3-1తో కనుక గెలిస్తే ఇక ఇండియా దరిదాపుల్లోనికి ఎవరూ రాలేదు. అయితే ఈ సిరీస్ ద్వారా ఇంగ్లాండ్ జట్టు కూడా అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం 68.2 శాతం విజయాలతో నాలుగో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు ఇండియాను 3-0, 3-1తో సిరీస్ గెలిస్తే ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నాయి. ఇక సిరీస్ 2-2తో డ్రా అయినా, 0-2, 1-2 తో ఇండియా ఓడిపోయినా ఆస్ట్రేలియా జట్టు ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంటుంది. ఇప్పుడు భారత జట్టు ముందు ఉన్న లక్ష్యం ఒకటే. సిరీస్‌లో కనీసం 2 మ్యాచ్‌లు గెలవాలి. అదే సమయంలో 2 మ్యాచ్‌లు ఓడిపోకుండా చూసుకోవాలి. స్వదేశంలోనే టీమ్ ఇండియా ఆడుతుండటంతో భారత జట్టుకే ఫైనల్స్ చేరే అవకాశాలు ఉన్నాయి.
టాప్ 4 జట్లు
1. ఇండియా (71.1 శాతం)
2. న్యూజీలాండ్ (70 శాతం)
3. ఆస్ట్రేలియా (69.2 శాతం)
4. ఇంగ్లాండ్ (68.2 శాతం)