ప్రపంచంలోనే అత్యంత నిఘా నగరాలల్లో హైదరాబాద్‌

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో ఏం చేసినా ఏం కాదు, నేను చేస్తున్న పని ఎవరికీ తెలియదు అనుకుంటే మీరు మోసపోయినట్టే నగరవాసులను ఎప్పుడూ నిఘా నేత్రం చూస్తూనే ఉంటుంది. హైదరాబాద్ నగరం నిఘా నీడలో ఉంది. ప్రపంచ స్థాయిలోనే నగరవ్యాప్తంగా అత్యధికంగా కెమెరాలను ఏర్పాటు చేసుకున్న నగరంగా ఇప్పటికే పలుమార్లు అవార్డులు దక్కించుకుంది. ఇలా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు ప్రస్తుతం జరుగుతున్న క్రైం కేసులను చేధించడంలో పోలీసులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. దీనికోసం నగరంలోని అన్ని […]

Update: 2021-08-25 14:27 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో ఏం చేసినా ఏం కాదు, నేను చేస్తున్న పని ఎవరికీ తెలియదు అనుకుంటే మీరు మోసపోయినట్టే నగరవాసులను ఎప్పుడూ నిఘా నేత్రం చూస్తూనే ఉంటుంది. హైదరాబాద్ నగరం నిఘా నీడలో ఉంది. ప్రపంచ స్థాయిలోనే నగరవ్యాప్తంగా అత్యధికంగా కెమెరాలను ఏర్పాటు చేసుకున్న నగరంగా ఇప్పటికే పలుమార్లు అవార్డులు దక్కించుకుంది. ఇలా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలు ప్రస్తుతం జరుగుతున్న క్రైం కేసులను చేధించడంలో పోలీసులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. దీనికోసం నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు నగరానికి పెట్టుబడులు రావాలన్నా నిఘా వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నగరాన్ని సేఫెస్ట్ సిటీగా మార్చేందుకు పోలీసుశాఖ సీసీ కెమెరాల ఏర్పాటు కోసం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. దీనికోసం నగరంలో ఉన్న మూడు కమిషనరేట్ల పరిధిలో 3.75 లక్షల కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే వీటిని ఏర్పాటు చేయడంలో నగరంలోని మల్టీనేషనల్ కంపెనీల సహకారం కూడా తీసుకుని భారీ నిఘా వ్యవస్థని పోలీసు శాఖ నెలకొల్పింది.

ప్రపంచంలోని 20 అత్యంత నిఘా వ్యవస్థ కలిగిన నగరాల్లో హైదరాబాద్‌కి చోటు దక్కింది. స్టాటిస్టికా సంస్థ ప్రపంచంలోని 150 మోస్ట్ పాపులేటెడ్ సిటీలలో సర్వే చేసింది. ఈ సందర్భంగా స్టాటిస్టికా నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రతి వెయ్యి మంది నివాసితులకు అత్యధిక సీసీ టీవీలు కలిగి ఉన్న నగరాల జాబితాలో రాష్ట్రంలోని హైదరాబాద్‌కు 12వ ర్యాంకు లభించింది. కాగా, హైదరాబాద్ వరుసగా రెండుసార్లు టాప్-20లో చోటు దక్కించుకోవడం విశేషం. అయితే గతేడాది నగరానికి 16వ ర్యాంకు వచ్చింది. నగరం నలుమూలల సీసీ టీవీలను ఏర్పాటు ప్రక్రియ నిత్యం జరుగుతుండటంతో మరిన్ని నెలకొల్పి 12వ స్థానంలోకి వచ్చింది.

స్టాటిస్టికా నివేదిక ప్రకారం హైదరాబాద్‌లో ప్రతి వెయ్యి మంది నివాసితులకు 36.52 కెమెరాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే ఈ జాబితాలో మొదటి స్థానంలో 117 సీసీ కెమెరాలతో చైనా దేశంలోని టైయావున్ నగరం ఉంది. ఇండియాలోని ఇండోర్ 64.4 కెమెరాలతో నాలుగవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా 33.73 కెమెరాలతో రాజధాని ఢిల్లీ 16వ స్థానంలో ఉంది. టాప్ 20 నగరాల్లో ఇండియా నుంచి మూడు నగరాలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

Tags:    

Similar News