టీఆర్ఎస్‌లో టెన్షన్.. హుజురాబాద్‌లో పార్టీమారుతున్న సీనియర్ నాయకులు
దిశ,హుజురాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతోంది. ఈ పార్టీలో ఉన్న నాయకుడు మరు నిమిషంలోనే మరో పార్టీ కండువా కప్పుకుంటున్నాడు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఈ పరిణామాలు మరింత వేగంగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హుజురాబాద్ మున్సిపల్ 20 వ వార్డు కౌన్సిలర్ గనిశెట్టి ఉమా మహేశ్వర్ గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన కాజీపేట అసహనానికి గురై […]
దిశ,హుజురాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతోంది. ఈ పార్టీలో ఉన్న నాయకుడు మరు నిమిషంలోనే మరో పార్టీ కండువా కప్పుకుంటున్నాడు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తరువాత ఈ పరిణామాలు మరింత వేగంగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా హుజురాబాద్ మున్సిపల్ 20 వ వార్డు కౌన్సిలర్ గనిశెట్టి ఉమా మహేశ్వర్ గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన కాజీపేట అసహనానికి గురై తన అనుచరులతో కలసి మరో పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్‌లు రంగంలోకి దిగి అతన్ని సముదాయించి టీఆర్ఎస్‌లోనే ఉండేందుకు ఒప్పిస్తున్నారు.
కాగా, బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గులాబీ కండువా కప్పి ఉమా మహేశ్వర్‌ను మంగళవారం టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకునే విషయాన్ని చెప్పకపోవడంతో కాజీపేట అలకకు కారణమైంది. వివేకానంద యూత్ అధ్యక్షుడిగా, యువజన సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా, హుజురాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా, కరీంనగర్ పార్లమెంట్ ఇన్చార్జిగా పని చేసిన కాజీపేటకు బీసీ కమిషన్ ఛైర్మెన్ వకుళాభరణం కృష్ణమోహన్ ముఖ్య అనుచరునిగా పేరుంది. అయితే రాజకీయ ఒత్తిళ్ల తో రెండున్నర ఏళ్ళ క్రితం ఈటల రాజేందర్ సమక్షంలో శ్రీనివాస్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుత పరిణామాల్లో మంత్రుల బుజ్జగింపులతో మనసు మార్చుకొని టీఆర్ఎస్ లోనే కొనసాగుతారా ? లేక బీజేపీలో చేరుతారా అనే చర్చ సాగుతుండగా కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ తనకు మంచి మిత్రుడు కావడం కొసమెరుపు.