హుజురాబాద్‌లో విచిత్రం.. ఇద్దరిదీ ఒకే వాయిస్.. మరి ఓటర్లు ఎటువైపు.?

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ వేదికగా సాగుతున్న ప్రచార హోరులో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల ప్రకటనల పర్వం కొనసాగుతూనే ఉంది. ఓటర్లను ప్రభావితం చేయగలిగే విధంగా సాగుతున్న మాటల తీరులో రెండు పార్టీల నినాదాలూ ఒకటే కావడం గమనార్హం. ధర్మం.. అధర్మం.. రాజీనామా తరువాత ఈటల రాజేందర్ ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడల్లా కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని, ధర్మానికి అధర్మానికి మధ్య యుద్దం జరుగబోతుందని వ్యాఖ్యానించారు. తాజాగా రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా […]

Update: 2021-09-25 22:10 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ వేదికగా సాగుతున్న ప్రచార హోరులో ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల ప్రకటనల పర్వం కొనసాగుతూనే ఉంది. ఓటర్లను ప్రభావితం చేయగలిగే విధంగా సాగుతున్న మాటల తీరులో రెండు పార్టీల నినాదాలూ ఒకటే కావడం గమనార్హం.

ధర్మం.. అధర్మం..

రాజీనామా తరువాత ఈటల రాజేందర్ ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నప్పుడల్లా కురుక్షేత్ర సంగ్రామం జరగనుందని, ధర్మానికి అధర్మానికి మధ్య యుద్దం జరుగబోతుందని వ్యాఖ్యానించారు. తాజాగా రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా ఇదే పల్లవిని ఎత్తుకున్నారు. హుజురాబాద్‌లో ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్దం సాగుతోందని అన్నారు. ఇరు పార్టీల నాయకులు కూడా ఒకే నినాదాన్ని ఎత్తుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయన్న ప్రచారం విస్తృతంగా సాగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీలు హుజురాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాము ధర్మం వైపు ఉన్నామంటే లేదు తామే ఉన్నామని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఆయా పార్టీల నాయకులు.

ప్రజలు ఎటు వైపో..?

ఇది ఇలా ఉంటే రెండు పార్టీల నాయకుల నినాదాలు కూడా ఒకటే కావడంతో హుజురాబాద్ ఓటర్లు ఎవరిని అక్కున చేర్చుకుంటారోనన్నదే అంతు చిక్కకుండా తయారైంది. ఇరు పార్టీల నాయకుల ప్రసంగాలను వింటున్న సామాన్య ఓటర్లు ఎవరిని అందలం ఎక్కిస్తారోనన్నది మాత్రం సస్పెన్స్. నాలుగున్నర నెలలుగా సాగుతున్న ప్రచార హోరుతో రెండు పార్టీల నాయకులను నిశితంగా పరిశీలిస్తున్న స్థానికులు చివరి క్షణంలో ఎవరికి ఓట్లు వేస్తారన్న అంశం అలా ఉంచితే, ఇక్కడి నుండి గెల్చిన వారు ధర్మాత్ములని, ఓడిపోయిన వారు అధర్మం తమ పంచన ఉందని ఒప్పుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

రోటీన్ డైలాగ్స్..

పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకూ ధర్మం.. అధర్మం గురించి మాట్లాడిన నాయకులు ఫలితాల తరువాత చేసే వ్యాఖ్యలు కూడా విచిత్రంగా ఉంటాయి. ఓటరు మహాశయులను తమకు అనుకూలంగా మల్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసే ఆయా పార్టీలు ఫలితాలు తమకు అనుకూలంగా రానట్టయితే ప్రజలను మభ్య పెట్టారన్న రీతిలో కామెంట్స్ చేస్తుంటారు. ప్రజలు తమను అక్కున చేర్చుకోకపోవడానికి కారణాలు ఏంటీ అన్న లోపాలను పక్కన పెట్టేసి గెల్చిన వారు ఓటర్లను ప్రభావితం చేశారన్న ప్రకటనలు కూడా చేయడం సాధారణం.

ఫలితాలకు ముందు వరకు దేవుళ్లుగా కొలవబడ్డ ఓటర్లును టార్గెట్ చేస్తూ నేరుగా మాట్లాడకున్నా ప్రత్యర్థి పార్టీలను నిందిస్తూ చేసే వ్యాఖ్యల వెనక మర్మం మాత్రం ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు మాత్రం ధర్మం, అధర్మం అన్న నినాదాలు హుజురాబాద్ ప్రజల చెవుల్లో తిరుగుతూనే ఉంటున్నాయి. అయితే చివరకు ఓడిన వారు తాము అధర్మం వైపు నిలబడటం వల్లే విఫలం చెందామని ఈ ఎన్నికల ఫలితాల తరువాత అయినా ఒప్పుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. ధర్మం తమ ప్రత్యర్థి వైపు ఉందని ప్రజల ముందు ఒప్పుకుంటారా లేక, కౌంటర్ అటాక్ చేస్తారోనన్నది ముందు ముందు కాలమే చెప్తుంది.

Tags:    

Similar News