గందరగోళంగా విద్య.. ఆన్‌లైన్ తరగతులు విజ్ఞానాన్ని పెంచేనా..?

దిశ, తెలంగాణ బ్యూరో: ఆన్ లైన్ తరగతుల ద్వారా విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని సన్నాహకాలు చేపడుతున్న ప్రభుత్వం గతేడాది ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ ఫలితాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆన్‌లైన్ తరగతులు కేవలం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. టెక్నాలజీని వినియోగించి విద్యార్థులకు పాఠాలు బోధించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుంది. టీవీల ద్వారా బోధిస్తున్న పాఠాలు విద్యార్థులకు ఏమాత్రం బోధపడటం లేదు. దీంతో విద్యార్థులు విద్యాప్రమాణాలను పూర్తిగా కోల్పోతున్నారు. విద్యార్థుల భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని […]

Update: 2021-06-11 15:41 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆన్ లైన్ తరగతుల ద్వారా విద్యాసంవత్సరాన్ని ప్రారంభించాలని సన్నాహకాలు చేపడుతున్న ప్రభుత్వం గతేడాది ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ ఫలితాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. ఆన్‌లైన్ తరగతులు కేవలం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. టెక్నాలజీని వినియోగించి విద్యార్థులకు పాఠాలు బోధించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుంది. టీవీల ద్వారా బోధిస్తున్న పాఠాలు విద్యార్థులకు ఏమాత్రం బోధపడటం లేదు. దీంతో విద్యార్థులు విద్యాప్రమాణాలను పూర్తిగా కోల్పోతున్నారు. విద్యార్థుల భవిష్యత్తులను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు చేపట్టాలని మేథావి వర్గాలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఫీజుల వసూళ్లకే ఆన్‌లైన్ తరగతులు

ప్రభుత్వం ఎంపిక చేసుకున్న ఆన్‌లైన్ తరగతులు కేవలం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల వసూళ్లకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. గతేడాది ప్రభుత్వం ఆన్ లైన్ తరగతులకు అనుమతులివ్వడంతో కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులు వసూలు చేసేందుకు రెచ్చిపోయాయి. కరోనా విపత్కర సమయంలో కూడ ఫీజులు చెల్లిస్తేనే విద్యార్థులను ఆన్‌లైన్ తరగతులకు అనుమతిస్తామని మానసికంగా క్షోభకు గురిచేశారు. ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ ప్రారంభిస్తే తిరిగి ఇలాంటి పరిస్థితులే పునరావృతం కానున్నాయి.

టీవీల ద్వారా బోధపడని పాఠాలు

ఆన్ లైన్ తరగతులకు హాజరుకాలేని విద్యార్థుల కోసం ప్రభుత్వం టీవీ ద్వారా పాఠాలను బోధించే ఏర్పాట్లను చేపట్టింది, టీ సాట్ చానెల్ ద్వారా నిర్వహించిన ఈ పాఠాలు చిన్నారుల్లో ఎలాంటి విద్యాప్రమాణాలను పెంచలేకపోయింది. టీవీలో నిర్వహించే తరగతులు కొత్తగా అనిపించడం, పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఎలాంటి సంభాషణలు జరగకపోవడం, చురుకుగా ఉండే విద్యార్థులకు, చురుకుగా లేని విద్యార్థులకు ఒకే ప్రామాణాలతో తరగతులు నిర్వహించడం ద్వారా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయాయి.

విద్యాప్రమాణాలను కోల్పోతున్న విద్యార్థులు

కరోనా ప్రబలినప్పటి నుంచి విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోంది. గతేడాది జనవరి నుంచి పాఠశాలల నిర్వహణను నిలిపివేయడంతో విద్యార్థులు విద్యాప్రమాణాలను పూర్తిగా కోల్పోతున్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదాలున్నాయి. విద్యార్థులకు సరైన రీతిలో పాఠాలను బోధించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.

ప్రతి విద్యార్థికి ట్యాబ్‌లు అందించాలి

ఆన్ లైన్ తరగతులను నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ఈ మేరకు విద్యార్థులకు సదుపాయాలు కల్పించాలి. స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయలేని పేద విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా ట్యాబ్‌లను అందించాలి. ఇందుకు కావల్సిన ఇంటర్ నెట్ సదుపాయాన్ని కూడా అందించి ప్రతి విద్యార్థికి న్యాయం చేయాలి. ప్రభుత్వం ఎలాంటి సదుపాయాలు కల్పించడకుండా ఆన్ లైన్ తరగతులను ప్రారంభిస్తే విద్యార్థులు నష్టపోతారు.
– ప్రవీణ్ రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు

క్లాస్‌లకు ఫంక్షన్ హాల్స్, టెంట్లను వినియోగించాలి

విద్యార్థులు పాఠశాలకు హాజరుకాకపోవడం వలన విద్యా ప్రమాణాలను పూర్తిగా కోల్పోతున్నారు. ఈ పరిణామాలు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. పాఠశాల గ్రౌండ్లలో టెంట్లను ఏర్పాటు చేసి విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టి పాఠాలు బోధించాలి. సరైన స్థలం అందుబాటులో లేని ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లను, కమ్యూనిటీ హాళ్లను ఎంపిక చేసుకొని తరగతులు నిర్వహించాలి.
-రవీందర్, టీపీటీఎఫ్ సభ్యుడు

Tags:    

Similar News