ఇంటి పనొళ్లకు ఇళ్లు గడుస్తలే !
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనాతో సహజీవనం తప్పదని ప్రభుత్వాలు చెప్తూ ఉంటే ఇది ఉన్నంతకాలం ఉపాధి కష్టమేనని ఇండ్లల్లో పనిచేసే ‘డొమెస్టిక్ వర్కర్స్’ వాపోతున్నారు. కరోనా వైరస్ కంటే వేగంగా ప్రజల్లో భయాలు, అపోహలు, ఆందోళనలు రావడంతో ఇండ్లలో నిన్నమొన్నటిదాకా అంట్లు తోమిన, ఇల్లు ఊడ్చిన, బట్టలు ఉతికిన డొమెస్టిక్ వర్కర్స్ ఉపాధి ఊడిపోయింది. ఇంతకాలం వీరిపై ఆధారపడిన కుటుంబాలు ఇప్పుడు స్వంతంగా పనులు చేసుకుంటున్నాయి. వైరస్ పీడ వదిలేంత వరకు వీరికి ఉపాధి దొరకడం గగనమే. మహారాష్ట్ర, […]
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనాతో సహజీవనం తప్పదని ప్రభుత్వాలు చెప్తూ ఉంటే ఇది ఉన్నంతకాలం ఉపాధి కష్టమేనని ఇండ్లల్లో పనిచేసే ‘డొమెస్టిక్ వర్కర్స్’ వాపోతున్నారు. కరోనా వైరస్ కంటే వేగంగా ప్రజల్లో భయాలు, అపోహలు, ఆందోళనలు రావడంతో ఇండ్లలో నిన్నమొన్నటిదాకా అంట్లు తోమిన, ఇల్లు ఊడ్చిన, బట్టలు ఉతికిన డొమెస్టిక్ వర్కర్స్ ఉపాధి ఊడిపోయింది. ఇంతకాలం వీరిపై ఆధారపడిన కుటుంబాలు ఇప్పుడు స్వంతంగా పనులు చేసుకుంటున్నాయి. వైరస్ పీడ వదిలేంత వరకు వీరికి ఉపాధి దొరకడం గగనమే. మహారాష్ట్ర, ఢిల్లీ లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా ప్రభుత్వాలే అడ్వయిజరీల పేరుతో సర్క్యులర్లను జారీ చేశాయి. పదుల సంఖ్యలో ఇళ్ళు ఉండే బహుళ అంతస్తుల అపార్టుమెంట్ల, గేటెడ్ కమ్యూనిటీల వెల్ఫేర్ అసోసియేషన్లు ఏకంగా పనివారిని రావద్దంటూ ఆంక్షలు విధించాయి. కరోనా వైరస్ ప్రభుత్వాలకు ఒక రకమైన ఇబ్బందులు తెస్తే రెక్కల కష్టాన్ని నమ్ముకున్న డొమెస్టిక్ వర్కర్లుగా గుర్తించబడే మహిళలకు ముద్ద లేకుండా చేసింది.
దేశవ్యాప్తంగా సుమారు 22లక్షల మంది డొమెస్టిక్ వర్కర్స్ ఉంటారని నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ అలయెన్స్ (ఎన్‌డిడబ్ల్యుఏ) అనే సంస్థ ప్రకటించింది. అయితే ఇది కేవలం రిజిస్టర్ చేసుకున్నవారి సంఖ్య మాత్రమే. దీంతో సంబంధం లేకుండా పట్టణాల్లో, నగరాల్లో వ్యక్తులుగా ఇండ్లల్లో పనిచేసేవారు దీనికి సమాన సంఖ్యలో ఉంటారు. ఇలాంటి పనులు చేసేవారిలే దాదాపు 92% మంది మహిళలేనని ఆ సంస్థ పేర్కొంది. మార్చి నెల ప్రథమార్థం వరకు వీరికి ఎలాంటి ఢోకా లేకుండా ప్రశాంతంగా పనిచేసుకున్నారని, కానీ మార్చి చివరి నాటికి ప్రధాన నగరాల్లో ఉపాధి పోయేలా చేసిందని, అప్పటికే సుమారు 52% మంది కార్మికులకు పని ఊడిపోయిందని పేర్కొంది. ఏప్రిల్ మొదటివారంకల్లా దేశం మొత్తంమీద సుమారు 68% మందికి పని పోయిందని తెలిపింది. లాక్‌డౌన్ ముగిసినా మళ్ళీ పని దొరుకుతుందన్న గ్యారంటీ లేదనే అభిప్రాయాన్ని సుమారు 66% మంది మహిళా కార్మికులు వ్యక్తం చేసినట్లు ఉదహరించింది.
ఎకనమిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ అనే సంస్థ అధ్యయనంలో ఇళ్ళను శుభ్రం చేసే పనిలో సుమారు మూడున్నర లక్షల మంది, చిన్న పిల్లల బాగోగులు చూసుకునే పనిలో సుమారు రెండున్నర లక్షల మంది, ఎప్పటికీ కుటుంబంలో ఒకరిగా అక్కడే ఉంటూ పిల్లల, వృద్ధుల బాగోగులు చూసుకునే మహిళలు మరో మూడు లక్షల మంది ఉన్నట్లు పేర్కొంది. ఇక స్థానికంగా పుట్టుకొచ్చే ఏజెన్సీల ద్వారా ఇళ్ళలో పనిచేసే ఉపాధి పొందుతున్నవారి సంఖ్య సుమారు 13 లక్షలు ఉంటుందని పేర్కొంది. ఇందులో ఎక్కువగా 23నుంచి 50ఏళ్ల వయసువారే సుమారు 50శాతం మంది ఉంటారని తెలిపింది. ఎప్పటికీ ఆ ఇళ్ళల్లోనే ఉంటూ కేవలం ఆ ఇంటి కోసం మాత్రమే పనిచేస్తున్న మహిళలకు కరోనా వల్ల ఉపాధి ప్రమాదం ఏమీ లేదని, ఒకే రోజున నాలుగైదు ఇళ్ళల్లో పనిచేసుకునే మహిళలకు మాత్రం మొత్తానికే ఉపాధి లేకుండా చేసిందని ప్రస్తుత లాక్‌డౌన్ గురించి ఎన్‌డిడబ్ల్యుఏ వ్యాఖ్యానించింది.
ఒకే ఇంటికి పరిమితం కావాలంటున్నారు: మల్లిక
“నగరాల్లో ఇంటి పని చేసే మహిళలకు కరోనాతో ఒక్కో రకమైన అనుభవం ఎదురవుతోంది. నేను ప్రతీ రోజు ఐదు ఇళ్ళల్లో పనిచేస్తాను. ఒక్కో ఇంటిలో గంటన్నర పని ఉంటుంది. నెలకు రూ.800 చొప్పున వస్తుంది. ఒక్క ఇంటితో కుటుంబం గడవదు కాబట్టి నాలుగైదు ఇళ్ళల్లో పనిచేయక తప్పదు. ఇప్పుడు కరోనా భయంతో ‘మా ఒక్క ఇంట్లో మాత్రమే పనిచేయాలి’ అనే కండిషన్ పెడుతున్నారు. వెయ్యి రూపాయలతో నెలంతా బతకగలమా? మార్చి నెలలో పనిచేసిన 20 రోజులకు జీతం వచ్చింది. రేషను కార్డుతో బియ్యం, రూ. 1500 సాయం వచ్చింది. దాంతో ఎలాగోలా ఏప్రిల్ నెల గట్టెక్కింది” అని నల్లకుంట పద్మాకాలనీలో పనిచేస్తున్న మల్లిక అనే మహిళా కార్మికురాలు వాపోయింది.
అప్పులు పెరుగుతున్నాయ్
“మాది యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక పల్లెటూరు. గ్రామాల్లో పనులు లేకపోవడంతో బతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చాను. నా భర్త, నేను పనిచేస్తే వచ్చే ఆదాయం నెలకు రూ. 15వేలు. ఇంటి కిరాయి, పిల్లల ఫీజులు పోను మిగిలిన ఏడెనిమిది వేలతో కుటుంబాన్ని నెట్టుకురావాలి. మార్చిలో సగం జీతమే రావడంతో చీటీ డబ్బులు కట్టలేదు. ఏప్రిల్ నెల పస్తులతోనే సరిపోయింది. ఇంటి కిరాయి కూడా కట్టలేదు. నేను పనిచేసే ఒక ఇంటి దగ్గర చేబదులు తీసుకున్నాను. మళ్ళీ కట్టాల్సిందే. ప్రస్తుతానికైతే పని చేయడం లేదు. కరోనా వస్తుందేమోననే భయంతో ఆ ఇళ్ళవారే నన్ను పనికి రావద్దన్నారు” అని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఇంటిపని కార్మికురాలు అరుణ వాపోయింది.
ఆకలితో చచ్చేలా ఉన్నాం
“నా రెక్కల కష్టంతోనే ఇద్దరి బిడ్డలను సాకుతున్న. రోజుకు పది ఇండ్లలో పనిచేస్తే వచ్చే ఆదాయం రూ. 8 వేలు. కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. ‘ఇంకో ఇంట్లో పనిచేస్తే మా ఇంటికి రావద్దు’ అంటూ ఆంక్షలు వచ్చాయి. లాక్‌డౌన్‌తో ఒక్క ఇంట్లో పనిచేసే అవకాశం ఉన్నా పోలీసులు ప్రతీరోజూ ఇబ్బంది పెట్టడంతో అక్కడ కూడా మానేయాల్సి వచ్చింది. చేతిలో డబ్బుల్లేవు. ఎట్ల బతకాలో అర్థమైతలేదు. కరోనా రోగంతో చచ్చుడేమోగానీ ఆకలితో చచ్చేలా ఉన్నాం” అని కొండాపూర్‌లో పనిచేస్తున్న ఇంటి పని కార్మికురాలు రేణుక ఆవేదన వ్యక్తం చేసింది.