తేనెటీగలు ఎక్కడ?

వానాకాలం ప్రారంభంలో వేసిన విత్తనాలు.. ఇప్పుడు మోకాలి ఎత్తు మొక్కలుగా మారాయి. ఆ మొక్కలకు ఇప్పుడిప్పుడే పూలు పూస్తున్నాయి. ఆ పువ్వులు చూసి దిగుబడి ఎక్కువే వస్తుందని రైతు సంతోషపడతాడు. కానీ ఆ దిగుబడి రావాలంటే ముందు పువ్వూ పువ్వూ కలవాలి. అలా కలిపే సీతాకోక చిలుకలు, తేనెటీగలు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఈ సీజన్‌లో ఉదయం పది గంటలకల్లా తుమ్మెదలు, తేనెటీగలు రివ్వున ఎగురుతూ చెట్ల మీద తిరిగేవి. కానీ ఇప్పుడు అవి […]

Update: 2020-08-12 02:52 GMT

వానాకాలం ప్రారంభంలో వేసిన విత్తనాలు.. ఇప్పుడు మోకాలి ఎత్తు మొక్కలుగా మారాయి. ఆ మొక్కలకు ఇప్పుడిప్పుడే పూలు పూస్తున్నాయి. ఆ పువ్వులు చూసి దిగుబడి ఎక్కువే వస్తుందని రైతు సంతోషపడతాడు. కానీ ఆ దిగుబడి రావాలంటే ముందు పువ్వూ పువ్వూ కలవాలి. అలా కలిపే సీతాకోక చిలుకలు, తేనెటీగలు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. గతంలో ఈ సీజన్‌లో ఉదయం పది గంటలకల్లా తుమ్మెదలు, తేనెటీగలు రివ్వున ఎగురుతూ చెట్ల మీద తిరిగేవి. కానీ ఇప్పుడు అవి చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మరి కారణం ఏంటి?

‘రోబో 2.0’ సినిమా చూసిన వాళ్లందరికీ పక్షులు అంతరించి పోవడానికి కారణం సెల్‌ఫోన్ సిగ్నల్స్ అని తెలుసు. ఇక్కడ తేనెటీగల విషయంలోనూ అదే జరుగుతోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఎంతో దూరం ప్రయాణించి పువ్వుల్లో మకరందాన్ని సేకరించి మళ్లీ అదే దారిలో ఒక చోటికి వచ్చి తేనెపట్టు పెట్టే తేనెటీగలు, ఇప్పుడు దారి తప్పుతున్నాయి. సెల్‌ఫోన్ సిగ్నళ్ల ప్రభావంతో వీటి మెదడు మీద ప్రభావం కలిగి దారి తప్పి చనిపోతున్నాయి. ఈ సిగ్నళ్లకు తోడు కలుపు మందులు, క్రిమి సంహారకాలు కూడా వాటి గుడ్లను నాశనం చేస్తున్నాయి. కాబట్టి వీటి ఎదుగుదలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది.

ఈ సెల్‌ఫోన్ సిగ్నళ్లతో పాటు గాలి కాలుష్యం వల్ల కూడా తేనెటీగల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని ఇటీవల ‘కొవెంట్రీ యూనివర్సిటీ’ వారు చేసిన ఒక పరిశోధనలో తేలింది. వాహనాల నుంచి వెలువడే పొగ కారణంగా తేనెటీగల వాసన జ్ఞానం మీద తీవ్ర ప్రభావం పడుతోంది. కాబట్టి పూలలో పరాగ సంపర్కం తగ్గిపోయి పండ్ల దిగుబడి గణనీయంగా తగ్గుతోంది. కాబట్టి గాలికాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయడం ద్వారా తేనెటీగల సంఖ్య పెంచే అవకాశం ఉంది. అందుకే అవసరం ఉన్నా లేకున్నా ఖాళీ స్థలాల్లో పూల చెట్లు పెంచడం, తేనెటీగల గుడ్లకు ఇబ్బంది కలిగించకుండా ఉండటం వంటి పనులు చేయాలి. కేవలం గ్రామాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా మిద్దెతోటలు, ఫార్మింగ్ చేయడం వల్ల గాలికాలుష్యాన్ని నివారించే అవకాశం కొంతైనా ఉంటుంది. ఒక్క తేనెటీగ లేకపోతే ప్రపంచానికి ఆహారకొరత ఏర్పడుతుందని ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్పారు. కాబట్టి వాటిని కాపాడటంలో మనవంతు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News