హుస్సేన్ సాగర్… ఇక విహార కేంద్రం
దిశ, తెలంగాణ బ్యూరో: హుస్సేన్ సాగర్.. అంటే ఒకప్పుడు నగరానికి తాగునీరందించే జలాశయం. ఇప్పుడది శుద్ధికి నోచుకోక కాలుష్యం బారిన పడి మురికి కూపంగా మారింది. కాలుష్య నివారణ సంగతేమోగానీ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను కుమ్మరిస్తోంది. హుస్సేన్ సాగర్‌లోకి నిత్యం వచ్చిచేరే మురుగునీటిని మళ్ళించడానికి ప్రణాళికలు చేపట్టినా ఫలితాలు ఆశించిన మేర రాకపోవడంతో హెచ్ఎండీఏ ఇప్పుడు సుందరకీరణకు నిధులను భారీస్థాయిలో వెచ్చించనుంది. తాజాగా సుందరీకరణ కోసం రూ.వందల కోట్లతో ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం […]
దిశ, తెలంగాణ బ్యూరో: హుస్సేన్ సాగర్.. అంటే ఒకప్పుడు నగరానికి తాగునీరందించే జలాశయం. ఇప్పుడది శుద్ధికి నోచుకోక కాలుష్యం బారిన పడి మురికి కూపంగా మారింది. కాలుష్య నివారణ సంగతేమోగానీ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను కుమ్మరిస్తోంది. హుస్సేన్ సాగర్‌లోకి నిత్యం వచ్చిచేరే మురుగునీటిని మళ్ళించడానికి ప్రణాళికలు చేపట్టినా ఫలితాలు ఆశించిన మేర రాకపోవడంతో హెచ్ఎండీఏ ఇప్పుడు సుందరకీరణకు నిధులను భారీస్థాయిలో వెచ్చించనుంది. తాజాగా సుందరీకరణ కోసం రూ.వందల కోట్లతో ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. హుస్సేన్ సాగర్ క్యాచ్‌మెంట్ ఏరియా ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రాం (హెచ్‌సీఐపీ) కోసం ఇప్పటివరకు సుమారు రూ.370 కోట్లు వెచ్చించినా సాధించిన ఫలితాలు మాత్రం అంతంతే. కెనడా సాంకేతిక పరిజ్ఞానం, ఆక్సీకరణ ప్రయత్నాలు కాలుష్యాన్ని నిర్మూలించలేక పోయాయి, నీటిలో స్వచ్ఛతను పెంచలేకపోయాయి.
ఇప్పుడు ఈ జలాశయం చుట్టూ విహార కేంద్రంగా మార్చేందుకు హెచ్ఎండీఏ ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు అధికారులు వెల్లడిస్తున్నారు.. ఇటీవలనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా నమూనాలను అథారిటీ పరిశీలించినట్టు సమాచారం. ప్రత్యేకంగా ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా సాగర్‌కు మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను, నమూనాలను తయారు చేయిస్తోంది. నీటిలోపలా, నీటిపైనా నడకదారులు, రోప్ వే, ఫుడ్ కోర్టులతో ట్యాంక్‌బండ్ చుట్టూ కొత్త సొగసులను తీర్చిదిద్దాలనుకుంటోంది. ట్యాంక్‌బండ్ సుందరీకరణ మొదటి దశ పనుల కోసం టెండర్ల ద్వారా రూ.17 కోట్లను ఖర్చు చేయబోతున్నది. రెండో దశలో ఆధునిక వసతుల ప్రణాళికలను అథారిటీ రూపొందిస్తున్నది.
నీటిలో, నీటిపైనా నడక దారులు
సింగపూర్ తరహాలో నీటి లోపల నడక దారులను ఏర్పాటు చేసే ప్రతిపాదనపై అధికారులు చర్చిస్తున్నారు. నీటిపైన వుడ్ బ్రిడ్జి (చెక్క వంతెన) నిర్మాణానికి అథారిటీ సన్నాహాలు చేస్తోంది. అంబేద్కర్ స్మారక స్థూపానికి చేరువగా ఉండే ప్రాంతం నుంచి వివేకానంద విగ్రహం రోటరీ క్లబ్ వరకు ట్యాంక్‌బండ్‌కు సమాంతరంగా నీటిపై నడిచే అనుభూతి కలిగేలా ఈ బ్రిడ్జి నిర్మాణం కానుంది. బ్రిడ్జిపై అంతస్థులో సందర్శకులు సాగర్ నీటిపైనే నడిచేట్టుగా చెక్కతో కట్టి దాని కింది అంతస్థులో మాత్రం ఆహార కేంద్రాలు, షాపింగ్ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
కేబుల్ కార్
సంజీవయ్య పార్కు నుంచి బుద్ధుని విగ్రహం వరకు కేబుల్ కార్ లేదా రోప్ వేను అందుబాటులోకి తీసుకురావాలని కూడా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నెక్లెస్ రోడ్ వెంట కూడా కేబుల్ కార్ లేదా రోప్ వే ఏర్పాటు చేసి సంజీవయ్య పార్కులోని జాతీయ జెండా, లేక్ వ్యూ ఫ్రంట్ పార్కు, జలవిహార్, పీపుల్స్ ప్లాజా, ఎన్‌టీఆర్ గార్డెన్, లుంబినీపార్కు, సచివాలయం, అంబేద్కర్ స్మారక భవనం ఇలా హుస్సేన్ సాగర్ చుట్టూరా ఉన్న ప్రాంతాలను పర్యాటకులు తిలకించేలా చేయనుంది. కేబుల్ కార్‌ను సంజీవయ్య పార్కు నుంచి బుద్దుని విగ్రహం వరకు వచ్చి వెనక్కి వెళ్ళేలా ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు. ఇందుకు సుమారు రూ.1000 కోట్లు ఖర్చు కావచ్చని అంచనా. నిధుల కొరతనుదృష్టిలో పెట్టుకుని పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి పద్ధతి)లో అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు.