ప్రభుత్వం దోషులుగా ముద్రవేస్తే.. ప్రజలు పట్టం కట్టారు
దిశ, వెబ్‌డెస్క్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ, ఇక్కడ జరిగిన ఎన్నికల ఫలితాలు హిస్టరీని రిపీట్ చేశాయి. ప్రభుత్వం దృష్టిలో చట్టవ్యతిరేకులుగా ముద్ర వేసుకున్న వారిని ప్రజలు మాత్రం ప్రజాప్రతినిధులుగా పట్టం కట్టారు. జైలులో ఉండగానే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. సమయం, సందర్భం వేరైనా ప్రజలు మాత్రం శాసన నిర్మాతలని తీర్పునిచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో అతడో సంచలనం.. ఇందిరా గాంధీ సమయంలో విధించిన ఎమర్జెన్సీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. […]
దిశ, వెబ్‌డెస్క్: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ, ఇక్కడ జరిగిన ఎన్నికల ఫలితాలు హిస్టరీని రిపీట్ చేశాయి. ప్రభుత్వం దృష్టిలో చట్టవ్యతిరేకులుగా ముద్ర వేసుకున్న వారిని ప్రజలు మాత్రం ప్రజాప్రతినిధులుగా పట్టం కట్టారు. జైలులో ఉండగానే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. సమయం, సందర్భం వేరైనా ప్రజలు మాత్రం శాసన నిర్మాతలని తీర్పునిచ్చారు.
ఎమర్జెన్సీ సమయంలో అతడో సంచలనం..
ఇందిరా గాంధీ సమయంలో విధించిన ఎమర్జెన్సీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఇదే సమయంలో 1977 లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లోని ముజఫర్‌పూర్ వీధుల్లో గోడలపై అతికించిన ఒక పోస్టర్ రాజకీయ దుమారం లేపింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుపాలై, అక్కడి నుంచే ఎన్నికల బరిలోకి దిగిన జనతాదళ్ పార్టీ నేత జార్జ్ ఫెర్నాండెస్ పోస్టర్ సంచలనం సృష్టించింది. జైలు గోడల నడుమ సంకెళ్లతో ఉన్న ఆ ఒక్క ఫొటోతోనే ఎలాంటి ప్రచారం లేకుండా భారీ మెజారిటీతో ఫెర్నాండెస్ గెలిచారు.
ఒక్క లేఖతోనే ప్రకంపనలు
అచ్చంగా ఇలాంటి సంఘటనే అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రిపీట్ అయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘‘సీఏఏ-ఎన్‌ఆర్‌సీ’’కి కూడా దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతరూపం దాల్చాయి. ముఖ్యంగా అస్సాంలో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ప్రతిపక్షాలు కేంద్రంపై తమ గొంతుకను వినిపించాయి. ఇందులో అస్సాం రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ ఒకరు. ఈ రెండు బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు పాలైన రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ జైలు నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించి హిస్టరీని రిపీట్ చేశారు.
అస్సాంలోని శిబ్‌సాగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ప్రచారంలో పాల్గొనకుండానే బీజేపీ అభ్యర్థిపై 11,875 ఓట్ల తేడాతో గెలుపొందడం విశేషం. జైలు గోడల మధ్య ఫెర్నాండెస్ చిత్రం అప్పట్లో రాజకీయ సంచలనం సృష్టిస్తే.. జైలు గోడల నుంచి గోగోయ్ రాసిన లేఖ ప్రచార ఆయుధం అయింది. రాజకీయ దుమారం రేపుతూ ప్రజల్లోకి చేరింది. ఈ పరిణామాలతో అతడు జైలులో ఉండగానే ఎమ్మెల్యే అయ్యాడు అంటే ఆ ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇలా ఉంటే ప్రభుత్వం ఈ ఇద్దరిని చట్ట వ్యతిరేకులని ముద్రవేసి జైలులో బంధిస్తే.. ప్రజలు వీరిని ప్రజాప్రతినిధులుగా తీర్పునివ్వడం గమనార్హం.