సచివాలయంలో హైడ్రామా.. ఉద్యోగుల పదోన్నతులపై ఏం జరుగుతోంది..?

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం మెడకు ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారం చుట్టుకుంటోంది. సచివాలయంలో పదోన్నతులు కల్పించాల్సి రావడంతో సూపర్​న్యూమరీ పోస్టులను సృష్టించారు. సాంకేతికంగా దీనిపై చాలా ఇబ్బందులు ఉంటాయని ఉద్యోగవర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇటీవల కొంతమంది ఉద్యోగుల ప్రమోషన్లపై నోటీసులు ఇచ్చారు. ఆర్ఓఆర్​ప్రకారం పదోన్నతులు వచ్చాయని, ప్రస్తుతం సుప్రీం కోర్టు ఆదేశాలతో దాదాపు 25 మంది పదోన్నతుల నుంచి రివర్సన్​రావాల్సి ఉంటుందని, దానిపై సమాధానం చెప్పాలంటూ నోటీసులిచ్చారు. కానీ ఓవైపు ప్రభుత్వం దళిత వర్గాల […]

Update: 2021-08-28 18:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం మెడకు ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారం చుట్టుకుంటోంది. సచివాలయంలో పదోన్నతులు కల్పించాల్సి రావడంతో సూపర్​న్యూమరీ పోస్టులను సృష్టించారు. సాంకేతికంగా దీనిపై చాలా ఇబ్బందులు ఉంటాయని ఉద్యోగవర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇటీవల కొంతమంది ఉద్యోగుల ప్రమోషన్లపై నోటీసులు ఇచ్చారు. ఆర్ఓఆర్​ప్రకారం పదోన్నతులు వచ్చాయని, ప్రస్తుతం సుప్రీం కోర్టు ఆదేశాలతో దాదాపు 25 మంది పదోన్నతుల నుంచి రివర్సన్​రావాల్సి ఉంటుందని, దానిపై సమాధానం చెప్పాలంటూ నోటీసులిచ్చారు. కానీ ఓవైపు ప్రభుత్వం దళిత వర్గాల సంక్షేమం అంటూ దళిత బంధు తీసుకురావడం, ఆ వర్గానికి చెందిన ఉన్నతాధికార్లకు కీలకపోస్టింగ్‌లు ఇస్తుండటంతో రివర్సన్లపై వెనక్కి తగ్గారు. దీనిపై తేల్చడం లేదంటూ ఇటీవల కొంతమంది ఉద్యోగులు సీఎస్​ చాంబర్‌ను ముట్టడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఐదుగురికి మాత్రం సూపర్​న్యూమరీ పోస్టులను సృష్టించి పదోన్నతులు ఇచ్చారు. సోమవారం మరో 48 మందికి పదోన్నతులు ఇవ్వనున్నారు. దీనిపై మిగిలిన శాఖల్లో ఉద్యోగులు దృష్టి పెట్టారు. దీన్ని సాకుగా చూపిస్తూ అన్ని డిపార్ట్‌మెంట్ల నుంచి ప్రమోషన్ల కోసం తిరుగుబాటు చేయాలని భావిస్తున్నారు.

ఈ నెల 31తో ప్యానల్ ఇయర్ ​ముగింపు..

సచివాలయ ఉద్యోగుల పదోన్నతులకు రెండేండ్ల నుంచి బ్రేక్​పడింది. రూల్స్​ఆఫ్ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టులో కేసు ఉండటంతో పాటు పలు అంశాల నేపథ్యంలో ప్రమోషన్లు ఆపేశారు. అయితే ఆర్ఓఆర్​రూపంలో ఒక వర్గానికి చెందిన వారికి మాత్రం ఏడాదిలోనే పదోన్నతులు వచ్చాయి. దీంతో కొంతమంది సీనియర్లుగా ఉన్నా.. ఆ వర్గానికి చెందిన వారికి ప్రమోషన్​రావడంతో కిందకు వెళ్లాల్సి వచ్చింది. దీనిపై వివాదాలు సాగుతూనే ఉన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఆదేశాలివ్వడంతో దాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. దీంతో సర్దుబాటు ప్రక్రియను మొదలుపెట్టారు. దీనిలో భాగంగా కొద్దిరోజుల క్రితం దాదాపు 25 మందికి నోటీసులు ఇచ్చి, 15 రోజుల్లో రిప్లై ఇవ్వాలని సూచించారు. కొంతమంది సమాధానం ఇచ్చారు. అయితే దీనిపై తేల్చకుండా పదోన్నతులను పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలోనే సచివాలయ ఉద్యోగులు సీఎస్​చాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ నెల 31తో ప్యానెల్​ఇయర్​ముగుస్తుండటంతో పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులోగా ఇవ్వకుంటే మళ్లీ ఏడాది నష్టపోయినట్టే.

ఇతర శాఖల్లో అదే..

సచివాలయ ఉద్యోగులకు పదోన్నతుల జీవోలు రాగానే దీనిపై ఇతర శాఖల ఉద్యోగులు పట్టుబట్టనున్నారు. ఇప్పటికే చాలా శాఖల్లో ఆర్ఓఆర్‌ను అనుసరిస్తూ పదోన్నతులు కల్పించారు. దీంతో కిందిస్థాయి నుంచి ఒకేసారి రెండు, మూడు ప్రమోషన్లు వచ్చాయి. దీనిపై గతంలో వివాదాలకు దిగినా.. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఉండటంతో ఏం చేయలేని పరిస్థితి. తాజాగా సచివాలయ ఉద్యోగుల అంశంలో కొన్ని మార్పులు తీసుకుంటూ మిగిలిన వర్గాలకు చెందిన ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తున్నారు. అయితే పాతవారిని కదిలించకుండా కొత్తగా సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టిస్తున్నారు. ఐదుగురికి ఇప్పటికే ఈ పోస్టులు ఇచ్చారు. మరో 48 మందికి సోమవారం ప్రమోషన్‌లు రానున్నాయి. దీనిపై ఉత్తర్వులు రాగానే.. ఆయా శాఖల్లో కూడా ఇదే పద్ధతిలో ప్రమోషన్లు ఇవ్వాలంటూ తిరుగుబాటు చేయనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పుతున్నారు. దీంతో ఇప్పుడు సచివాలయ ఉద్యోగుల పదోన్నుతుల జీవోలపై ఉద్యోగ సంఘాల నేతలు ఎదురుచూస్తున్నారు.

మీరు ఎలా ఆందోళన చేస్తారు..?

శనివారం పలువురు సచివాలయ ఉద్యోగులకు మెమో జారీ చేశారు. ప్రమోషన్ల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ ఈనెల 26న సీఎస్‌ చాంబర్‌ ఎదుట సచివాలయ ఉద్యోగుల ఆందోళన దిగారు. ఆందోళనలో పాల్గొన్న పలువురు ఉద్యోగులకు సీఎస్‌ సోమేష్‌కుమార్ మెమో జారీ చేశారు. రెండేళ్లు గడిచినా పదోన్నతులు కల్పించకపోవడంతో సచివాలయంలోని అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు(ఏఎస్‌వో), సెక్షన్‌ ఆఫీసర్లు(ఎస్‌వో) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం ఎదుటే మెరుపు ధర్నాకు దిగారు. సాయంత్రం వరకు విధులు నిర్వహించి, 4 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా ఆందోళన చేపట్టారు. ఈ నెల 31తో ప్యానల్‌ ఇయర్‌ ముగుస్తుండడం, మరో మూడు రోజులే పని దినాలు ఉండడం, పదోన్నతుల ఫైలు ముందుకు కదలకపోవడంతో వారి ఆవేదన కట్టలు తెంచుకుంది. ఒకేసారి 50 మందికి పైగా అప్పటికప్పుడు పోగై ధర్నా చేపట్టారు. తమకు పదోన్నతులు కల్పించాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీనిపై సీఎస్​ ఆయా శాఖాధికారుల నుంచి మెమోలు జారీ చేశారు.

Tags:    

Similar News