నోటీసులు ఇవ్వకుండా తీర్పులు ఎందుకిస్తున్నారో చెప్పండి..!

దిశ, తెలంగాణ బ్యూరో : దశాబ్దాలుగా పేరుకుపోయిన భూ వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన రెవెన్యూ ప్రత్యేక ట్రిబ్యునళ్ల పనితీరుపై అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయకుండా, వాదనలు వినకుండానే తుది తీర్పులు వెలువరించేందుకు ప్రయత్నిస్తుందంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. సహజ న్యాయసూత్రాలు పాటించకుండా తీర్పులు ఎట్లా ఇస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. త్వరితగతిన కేసుల సంఖ్యను జీరో చేసేందుకు చూపిన చొరవ నిబంధనలను పాటించడంలో కలెక్టర్లు ఆచరణలో చూపలేదన్న ఆక్షేపణలు ఉన్నాయి. […]

Update: 2021-03-06 09:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : దశాబ్దాలుగా పేరుకుపోయిన భూ వివాదాలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన రెవెన్యూ ప్రత్యేక ట్రిబ్యునళ్ల పనితీరుపై అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేయకుండా, వాదనలు వినకుండానే తుది తీర్పులు వెలువరించేందుకు ప్రయత్నిస్తుందంటూ బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. సహజ న్యాయసూత్రాలు పాటించకుండా తీర్పులు ఎట్లా ఇస్తారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. త్వరితగతిన కేసుల సంఖ్యను జీరో చేసేందుకు చూపిన చొరవ నిబంధనలను పాటించడంలో కలెక్టర్లు ఆచరణలో చూపలేదన్న ఆక్షేపణలు ఉన్నాయి.

ఈ క్రమంలో హైకోర్టు ఇటీవల జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులతో ప్రభుత్వం కొత్త తరహా వివాదానికి తెర తీయబోతున్నట్లు సమాచారం. గతంలోనే ఇరుపార్టీలకు నోటీసులు జారీ చేశామని, వాదనలు విన్నామని మరోసారి అవసరమేం లేదని హైకోర్టుకు నివేదించేందుకు కేసుల వారీగా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది. అందుకే గత ప్రొసిడింగ్స్ ను, కేసు నడిచిన తీరును ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, కేసు బదిలీ చేసినప్పుడు మళ్లీ మొదటి నుంచి షురూ చేయాలనే సూత్రాన్ని పెడచెవిన పెడుతున్నారని రెవెన్యూ చట్టాల నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పాత కోర్టుల్లో తేలడం లేదని, ఏకపక్షంగా అవినీతి, అక్రమాలకు తావిచ్చారన్న ఆరోపణలతోనే ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు. అలాంటి నేపథ్యంలో కేసుల పరిష్కారంలో అప్పటి విషయాలను పరిగణలోకి తీసుకోవడం వల్ల ప్రభుత్వం ఆశించిన లక్ష్యం ఎలా నెరవేరుతుందన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

సమాచార పత్రాలు..

తెలంగాణ భూ హక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల చట్టం, 2020 లోని స్పెషల్ ట్రిబ్యునళ్లపై హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం వివరాలను సేకరిస్తోంది. ట్రిబ్యునళ్ల ద్వారా ఆర్వోఆర్ కేసుల పరిష్కారానికి ఇరుపార్టీల వాదనను వినాల్సిందేనని సూచించింది. దీంతో ప్రభుత్వం ప్రతి కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తోంది. ఈ నెల 8వ తేదీలోపు అన్ని వివరాలను అందించాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. ఐతే స్పెషల్ ట్రిబ్యునల్, ఆర్వోఆర్ కేసు సమాచార పత్రంలో పేర్కొన్న అంశాలు పలు అనుమానాలకు తావిస్తోంది.

గతంలోనే విన్నాం..

కొత్తగా సేకరించే వివరాలు సందేహాలకు కారణమైంది. పాత ఆర్వోఆర్ కోర్టుల్లో వాదనలు వినేశామని, మళ్లీ వినాల్సిన అవసరం లేదన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలోనే ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు పార్టీలకు నోటీసులు జారీ చేశామని, వాదనలు విన్నామని హైకోర్టుకు నివేదించేందుకే ఈ సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారని రెవెన్యూ అధికారుల నుంచి అందిన సమాచారం. నిజానికి ఏదైనా కేసు ఒక చోటు నుంచి మరో చోటుకి బదిలీ అయినప్పుడు, న్యాయమూర్తులు బదిలీ అయినా కేసు పూర్వాపరాలను వింటారు. మళ్లీ ఇరుపార్టీలకు నోటీసులు జారీ చేస్తారని, వారి వాదనలను వింటారని రెవెన్యూ చట్టాల నిపుణులు, నల్సార్ యూనివర్సిటీ ప్రొ.ఎం.సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు. పాత ఆర్వోఆర్ కోర్టుల్లో విన్నప్పటికీ ట్రిబ్యునళ్లు కూడా నోటీసులు జారీ చేయాల్సిందేనని, వాదనలు వినాల్సిందేనన్నారు. కానీ ప్రభుత్వం గతంలోని ప్రొసీడింగ్స్ ను కొనసాగించడం సరికాదంటున్నారు.

నోటీసులు రాకుండానే తీర్పు

తెలంగాణ రైట్స్ ఇన్ ల్యాండ్, పట్టాదారు పాసుబుక్స్ యాక్ట్ 1971 లో పెండింగులోని అన్ని కేసులను పరిష్కరించేందుకు కొత్త ఆర్వోఆర్ యాక్ట్ ద్వారా స్పెషల్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు. పాత కేసులన్నింటినీ డిస్పోజ్ చేసేందుకు ప్రతి జిల్లాలోనూ ఇది ఏర్పాటైంది. పాత ఆర్వోఆర్ చట్టం కింద జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓ రెవెన్యూ కోర్టుల వద్ద పెండింగులో ఉన్న కేసులను మాత్రమే ట్రిబ్యునల్ పరిష్కరిస్తుంది. ఇతర కేసులు, కొత్త కేసులేవీ వీటి పరిధిలోకి రావు. కేవలం రికార్డుల ఆధారంగానే కేసులను పరిష్కరించబోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే నోటీసులు రాకుండానే తీర్పులు వెలువడే అవకాశాలున్నాయి.

వేగంగా చేశామనడానికే..

రాష్ట్రంలో భూ సంబంధ కేసుల సంఖ్య జీరో అని లెక్కలు చెప్పేందుకు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఎలాగైనా కేసులు పెండింగులో లేకుండా చూడాలన్న కాంక్షను బలవంతంగా అధికారులపై రుద్దుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితిని విధించి చేతులు దులిపేసుకునే ప్రక్రియను చేపట్టిందని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో లెక్క తేల్చిన కేసుల్లో చాలా వరకు మళ్లీ సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

కొందరు మేలుకొలుపు

ప్రత్యేక ట్రిబ్యునళ్ల ఆవిర్భావం, మార్గదర్శకాలు జారీ కాగానే కొందరు బాధితులు మేల్కొన్నారు. నోటీసులు జారీ చేస్తారో, చేయరోనని ముందుగానే అనుమానించారు. అందుకే వారి కేసులకు సంబంధించిన వాదనల గురించి ముందుగానే కలెక్టర్లకు అర్జీలు పెట్టుకున్నారు. ఇంకొందరేమో వారి కేసులకు సంబంధించిన వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించారు. కొన్ని జిల్లాల్లో న్యాయవాదులే కేసులకు చెందిన లిఖితపూర్వక వాదనలు అంటూ డాక్యుమెంట్లు సమర్పించారు. చాలా జిల్లాల్లో న్యాయవాదులిచ్చే డాక్యుమెంట్లు, రిటర్న్ డాక్యుమెంట్లు తీసుకోవాలని మార్గదర్శకాల్లో ఎక్కడా లేదని తిరస్కరించిన ఉదంతాలూ ఉన్నాయి. కేసుల వాదనల తేదీలు, సమాచారం ఇవ్వకపోయినా క్లయింట్ల తరపున కొందరు న్యాయవాదులు లిఖితపూర్వకంగా వాదనలు రాసిచ్చారు. వాటిని పరిగణనలోకి తీసుకున్నారో, పరిశీలించారో మాత్రం అంతుచిక్కడం లేదు. తీర్పుల కాపీలు ఇరుపార్టీలకు అందితేనే ఆ విషయంలో క్లారిటీ వస్తుంది.

Tags:    

Similar News