పోడు భూములపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయంపై ఆధారపడుతూ జీవిస్తున్న ఆదివాసీ ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చెరుకు సుధాకర్ సంయుక్తంగా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పేర్కొన్నారు. అటవీ ప్రాంతాలు, వాటిపై ఆధారపడి బతుకుతున్న గిరిజన ఆవాసాల […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో పోడు వ్యవసాయంపై ఆధారపడుతూ జీవిస్తున్న ఆదివాసీ ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చెరుకు సుధాకర్ సంయుక్తంగా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పేర్కొన్నారు. అటవీ ప్రాంతాలు, వాటిపై ఆధారపడి బతుకుతున్న గిరిజన ఆవాసాల అంశం రాజ్యాంగంలోని షెడ్యూలు-5లో ఉన్నాయని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమన్నారు. జీవించే హక్కును నిరాకరించడం, గతంలో సుప్రీంకోర్టు వేర్వేరు సందర్భాల్లో వెలువరించిన తీర్పులకు విరుద్ధమని పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేశారు.
పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న ఆదివాసీ రైతులకు పట్టాలు (ఆర్‌ఓఎఫ్ఆర్) జారీ చేయడానికి బదులుగా వారిని అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంరించుకునే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చిక్కుడు ప్రభాకర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం ఒరిస్సా మైనింగ్ కార్పొరేషన్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖల మధ్య జరిగిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఆదివాసీల జీవించే హక్కును పరిరక్షించాలని, వారిని బలవంతంగా ఆవాసాల నుంచి తరలించవద్దని తీర్పు నొక్కి చెప్పిందని చిక్కుడు ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌సీ శర్మ నేతృత్వంలోని బెంచ్ గురువారం విచారించి ప్రభుత్వానికి నోటీసులు జారీచేసినట్లు తెలిపారు.