సాయం.. మాయం..

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలు, నిరాశ్రయులు ఎక్కడికక్కడే ఇరుక్కుపోయారు. వీరికి సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. స్వచ్ఛంద సంస్థలు కూడా చేయూతనిచ్చాయి. దాతలివ్వదలిచిన నిత్యావసర వస్తువులను జీహెచ్ఎంసీ అధికారులకు అప్పగిస్తే వారే అభాగ్యులకు పంపిణీ చేస్తారని ప్రజాప్రతినిధులు వెల్లడించారు. అనుమతి లేకుండా ఎవరూ పంపిణీ చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పలువురు దాతలు నిత్యావసర వస్తువులు తీసుకొచ్చి అధికారులకు ఇవ్వగా వాటిని బాధితులకు అందించకుండా […]

Update: 2020-05-13 09:24 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా వలస కూలీలు, నిరాశ్రయులు ఎక్కడికక్కడే ఇరుక్కుపోయారు. వీరికి సాయం అందించేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. స్వచ్ఛంద సంస్థలు కూడా చేయూతనిచ్చాయి. దాతలివ్వదలిచిన నిత్యావసర వస్తువులను జీహెచ్ఎంసీ అధికారులకు అప్పగిస్తే వారే అభాగ్యులకు పంపిణీ చేస్తారని ప్రజాప్రతినిధులు వెల్లడించారు. అనుమతి లేకుండా ఎవరూ పంపిణీ చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పలువురు దాతలు నిత్యావసర వస్తువులు తీసుకొచ్చి అధికారులకు ఇవ్వగా వాటిని బాధితులకు అందించకుండా పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

‘మా సోదరుడితో కలిసి దాదాపు రూ.20 వేలతో వెయ్యి సబ్బులు కోనుగోలు చేశాం. మనిషికి రెండు చొప్పున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోని ఆశ్రయం పొందుతున్న వారికి ఇవ్వాలని అక్కడి అధికారులకు ఉదయం అప్పగించాం. అదే రోజూ సాయంత్రం వెళ్లి అడిగితే అందరికీ ఇచ్చేశామని ఒకరు చెప్పారు. మరొకరు ఎవరో ఉన్నతాధికారులు తీసుకెళ్లారని చెప్పారు. పేర్లు చెప్పమంటే ఎవరూ చెప్పరు. ఆ సమయంలో గ్రౌండ్‌లో సుమారు 230 మంది ఆశ్రయం పొందుతున్నారు. సగం పంచినా.. 500 సబ్బులు అయిపోతాయి.. మిగిలినవి ఉండాలి కదా’ అంటున్నారు లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు, అభాగ్యుల కోసం క్షేత్రస్థాయిలో వివిధ రూపాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్న హైదరాబాద్ టెకీ డేగ హరీశ్. లాక్‌డౌన్‌లో ఇబ్బందులు పడుతున్న కార్మికులు, పేదలు, వలస కార్మికులు, అనాథలను ఆదుకునేందుకు అనేక సామాజిక సంఘాలు, మానవతావాదులు, దాతలు జీహెచ్ఎంసీ తరపున అందిస్తున్న సాయం ఇలా మధ్యలోనే మాయమైపోతోంది. ఎవరూ ఏ సాయం చేయాలన్నా తమ ద్వారానే చేయాలని, లేదంటే కేసులు నమోదు చేస్తామని జీహెచ్‌ఎంసీ హెచ్చరించడంతో చాలామంది దాతలు సాయం చేయడం ఆపేశారు. ఎలాగైతే ఏంటీ అవసరమైన వారికి సాయమందుతుంది కదా అని కొందరు దాతలు జీహెచ్ఎంసీ‌ అధికారులకే వస్తువులను అందించారు.

అధికారుల మాయాజాలం

తాత్కాలిక షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్నవారి కోసం పంపించిన ఉడక బెట్టిన గుడ్లు కూడా మాయమయ్యాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఎన్జీఓ పేరుతో ఓ వ్యక్తి హల్‌చల్ చేస్తున్నారు. అతడు చెప్పిందే వేదంలా తయారైందక్కడ. యూసీడీకి చెందిన అధికారులు, సదరు వ్యక్తి.. దాతలు ఇచ్చిన వస్తువులను దారి మళ్లిస్తున్నారని సమాచారం. నిల్వ చేసిన శానిటైజర్లు, ఇతర వస్తువులను రాత్రి పూట కార్లలో తరలిస్తుండటం పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు తరలించేందుకు తీసుకెళ్తున్నామని అధికారులు చెబుతున్నా.. ఎన్జీఓకు చెందిన వ్యక్తి, బల్దియా అధికారికి అనుచరులుగా ఉన్న కొందరు వ్యక్తులే వీటి తరలింపులో కీలకంగా ఉండటం గమనార్హం. ఈ విషయంపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. సంబంధిత డీపీవో స్పందించలేదు. ఇప్పటికీ జీహెచ్ఎంసీ ఎంత మంది నుంచి విరాళాలు, ఇతర రూపాల్లో వస్తువులు సేకరించింది? ఎంతమందికి ఏ పద్ధతుల్లో సాయమందించింది? అనే వివరాలు స్పష్టంగా అధికారుల వద్ద లేకపోవడం గమనార్హం.

అధికారులు వివరాలను వెల్లడించారు – శ్రీనివాస్, సామాజిక కార్యకర్త, గోల్కొండ క్రాస్ రోడ్

దిల్ రాజు వంటి ప్రముఖులతో పాటు అనేకమంది వివిధ పద్ధతుల్లో జీహెచ్ఎంసీకి అండగా నిలిచారు. వస్తువుల్లో కొన్ని దుర్వినియోగం అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. జీహెచ్ఎంసీకి విరాళాల రూపంలో ఏమేమి అందాయి? వాటిని ఎంతమందికి ఇచ్చారు? అనే వివరాలను ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. సామాజిక దృక్పథంతో చేస్తున్న సాయం సద్వినియోగమవుతుందన్న నమ్మకం కూడా దాతల్లో ఉండాలి. అప్పుడే సాయం చేసేందుకు మరింత మంది ముందుకు వస్తారు.

Tags:    

Similar News