ఆ విషయంలో ప్రభుత్వం విఫలం.. కన్నీరు పెడుతున్న రైతులు
దిశ, తెలంగాణ బ్యూరో: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. అయితే పంటనష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. నష్టం లెక్కలు తేల్చవద్దని అధికారులకు మౌకికంగా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. దీంతో రైతులకు ఈ ఏడాది అతి భారీ వర్షాలకు కన్నీరే మిగులుతుంది. పంటనష్టాన్ని అంచనావేసి ఎకరాకు రూ.25వేలు చెల్లించాలని రైతుసంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. అయితే పంటనష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. నష్టం లెక్కలు తేల్చవద్దని అధికారులకు మౌకికంగా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. దీంతో రైతులకు ఈ ఏడాది అతి భారీ వర్షాలకు కన్నీరే మిగులుతుంది. పంటనష్టాన్ని అంచనావేసి ఎకరాకు రూ.25వేలు చెల్లించాలని రైతుసంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
2.5లక్షల ఎకరాల్లో పంటనష్టం:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు శాపంగా మారాయి. ఎదుగుదల స్థితిలో ఉన్న పంటలను దెబ్బతీసేలా వర్షాలు కురవడంతో రైతాంగం కన్నీరు పెడుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.5లక్షల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. సాధారణ వర్షపాతానికి మించి వర్షాలు పడడంతో వరదల వల్ల, చెరువులు, కుంటలకు గండ్లు పడి పంటలు నీటమునిగాయి. చెరువుల కింద సాగువుతున్న వరి పంటలోకి పూర్తిగా ఇసుక చేరుకుంది. మొగ్గ స్థితిలో ఉన్న పత్తిపంట అధిక వర్షాలతో దెబ్బతిన్నది. వీటితో పాటు మొక్కజొన్న, పెసర, కూరగాయలు, నూనె గింజల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరల పంటలు వేసే పరిస్థితి కూడా దాటిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
అధికారికంగా అంచనా వేయని ప్రభుత్వం:
రైతాంగం నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంట నష్టాలను అంచనా వేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటి వరకు ఎంత పంట నష్టం వాటిల్లిందనే లెక్కలను అధికారులు చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వం నుంచి మౌకిక ఆదేశాలు రావడంతో అధికారులు పంటనష్టాన్ని అంచనా వేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పరిహారాన్ని రాకుండా రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుంటుందని విమర్శలు వస్తున్నాయి. రైతుల శ్రేయస్సుకు పెద్దపీఠ వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. ఇప్పటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు దెబ్బతిన్న పంటలను పరిశీలించకపోవడంపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.
రూ.25వేల పరిహారం చెల్లించాలని డిమాండ్లు:
భారీ వర్షాలకు నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25వేలు చెల్లించాలని రైతుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి పంటలు వేసుకునే సమయం దాటిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది వానాకాలం పంటను పూర్తిగా కోల్పోవడంతో పరిహారాన్ని పెంచి చెల్లించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. పెరిగిన ధరలను తట్టుకొని అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు తలత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కనీసం పంటనష్టం అంచనాలు కూడా వేయడం లేదు:
సాగర్, తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రథాన కార్యదర్శి
గ్రామాల్లో కనీసం పంటనష్టం అంచనాలు వేసేందుకు కూడా అధికారులు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నందునే వ్యవసాయాధికారులు పంటనష్టాలను లెక్కించడం లేదని తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన విధిని తాను చేపట్టి కేంద్రానికి నివేదికలు పంపిస్తేనే నష్టపరిహారం వచ్చే ఆస్కారముంది. కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు రావాల్సిన వాటికంటే అధికంగా పంట నష్టపరిహారాలను కేంద్ర నుంచి పొందారు. 15వ ఫైనాన్స్ కమీషన్ లో రాష్ట్రానికి రావాల్సిన నష్టపరిహార నిధులను పొందడంలో ప్రభుత్వం విఫలమవుతుంది.