భైంసాలో 144 సెక్షన్.. అసలేంజరుగుతోంది..?

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్/ముధోల్/క్రైం‌ బ్యూరో : నిర్మల్ జిల్లా భైంసాలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు హోం మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలతో చర్యలు చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఘటనలో గాయాలపాలైన వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నామన్నారు. బైంసాలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి చర్యలు తీసుకున్నట్టు వివరించారు. బైంసా పట్టణంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు […]

Update: 2021-03-08 14:04 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్/ముధోల్/క్రైం‌ బ్యూరో : నిర్మల్ జిల్లా భైంసాలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు హోం మంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలతో చర్యలు చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఘటనలో గాయాలపాలైన వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నామన్నారు. బైంసాలో సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి చర్యలు తీసుకున్నట్టు వివరించారు. బైంసా పట్టణంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితులపై కలెక్టర్, ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి ఆరా తీశారు.

ఘటనపై సమీక్షిస్తాం : నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి

బైంసాలో జరిగిన అల్లర్లపై సీరియస్‌గా సమీక్షిస్తామని నార్త్ జోన్ ఐజీ వై.నాగిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మోటారు సైకిల్ ప్రమాదం ఘటనలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చోటుచేసుకుందని తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే డీఎస్పీ, సీఐ నేతృత్వంలో 500 మంది అదనపు బలగాలతో పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చామన్నారు. ఘటనలో ఆరుగురు సామాన్యులు, ముగ్గురు పోలీసులు గాయాల పాలయ్యారని వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులను అరెస్టు చేస్తామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను ప్రజలు నమ్మవద్దన్నారు.

భైంసా పట్టణంలో 144 సెక్షన్ అమలు చేసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు నిర్మల్ ఎస్పీ విష్ణు వారియరు వెల్లడించారు. మీడియాతో సోమవారం మాట్లాడిన ఆయన.. 40 మంది అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నట్టు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఘటనలపై ఏదైనా సమాచారం ప్రజల వద్ద ఉంటే పోలీసులకు తెలపాలని కోరారు.

ఇరువర్గాలు సమయమనం పాటించాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. స్పెషల్ బెటాలియన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. సమస్యలుంటే శాంతియుతంగా చర్చించుకోవాలని సూచించారు.

పరిస్థితి అదుపులో ఉందని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. మీడియాతో సోమవారం మాట్లాడిన ఆయన ఇప్పటికే 40 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. సీసీ ఫుటేజీలను నాలుగు ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పరిశీలిస్తున్నాయని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను ప్రజలు నమ్మొద్దని కోరారు.

పరిస్థితులు చక్కబడే వరకు కొన్ని ప్రాంతాలలో 144 సెక్షన్ కొనసాగుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారుఖీ వెల్లడించారు. నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయల అమ్మే వారికి మినహాయింపు ఉంటుందన్నారు. సీపీ సత్యనారాయణ, జిల్లా ఇన్ చార్జి ఎస్పీ విష్ణు వారియర్ పరిస్థితిని సమీక్షించారు.

ఎంపీ అర్వింద్ హౌస్ అరెస్ట్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో బైంసా వెళ్తానని ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సోమవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి బైంసాకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో అర్వింద్‌ను పోలీసులు బంజారాహిల్స్ లో అడ్డుకున్నారు. అనంతరం ఆయన నివాసానికే తరలించారు. బైంసాలో పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లొదని సూచించారు.

Tags:    

Similar News