వారికి క్వారంటైన్ తప్పదా!
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలందరూ విధిగా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని, అత్యవసర వైద్య సేవల్లాంటి అవసరాలు మినహా ఇంటికే పరిమితం కావాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో దాదాపు 80% మేర ఎలాంటి లక్షణాలు లేనివారేనని, దాదాపు పది రోజుల పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందున ఎవరి నుంచి ఎవరికి వైరస్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలందరూ విధిగా వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని, అత్యవసర వైద్య సేవల్లాంటి అవసరాలు మినహా ఇంటికే పరిమితం కావాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సూచించారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో దాదాపు 80% మేర ఎలాంటి లక్షణాలు లేనివారేనని, దాదాపు పది రోజుల పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందున ఎవరి నుంచి ఎవరికి వైరస్ వ్యాపించి ఉంటుందో చెప్పలేమన్నారు.
ప్రచారం కోసం వివిధ జిల్లాల నుంచి వచ్చినవారంతా స్వచ్ఛందంగా ఈ నిబంధన పాటించాలని సూచించారు. ఒకవేళ ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు లాబ్‌లో పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఎన్నికల కోసం అన్ని పార్టీలకు చెందినవారు వివిధ జిల్లాల నుంచి నగరానికి వచ్చి ర్యాలీలు, రోడ్‌షో, బహిరంగ సభలు లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారని, చాలామంది మాస్కు ధరించలేదని, కొవిడ్ నిబంధనలను పాటించలేదని గుర్తుచేశారు. నగరంలోని కరోనా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో బుధవారం డాక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. పై విషయాలను పేర్కొన్నారు.
కరోనా సెకండ్ వేవ్ మొత్తం దేశాన్ని భయపెడుతోందని, తెలంగాణ కూడా అందుకు మినహాయింపు కాదని డాక్టర్ శ్రీనివాసరావు గుర్తుచేశారు. వాతావరణ పరిస్థితులు కూడా సెకండ్ వేవ్‌కు అనుకూలంగా మారిందన్నారు. ఎన్నికల ప్రచారంతో పాటు ఇది పెళ్ళిళ్ళ సీజన్ కావడంతో జనం మధ్య గడిపే సందర్భాలు ఉంటున్నాయని, స్వీయ జాగ్రత్తలు పాటించకపోతే వైరస్ బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకునే ప్రజల అవసరాల కోసం ఇప్పుడు పనిచేస్తున్న సుమారు 1090 కరోనా టెస్టింగ్ కేంద్రాలకు అదనంగా మరో యాభై (నగరంలో పాతిక, రంగారెడ్డి జిల్లాలో పాతిక) కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
జగిత్యాల సంఘటన పునరావృతం కావొద్దు..
రాష్ట్రంలో పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో చాలా జిల్లాల్లో వందలాది మంది ప్రజలు హాజరవుతూ ఉన్నారని, జగిత్యాల జిల్లాలో ఈ కారణంగానే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. మాస్కు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, కనీస పరిశుభ్రతా చర్యలు తీసుకోవడంలాంటి నిబంధనలను పాటించకపోతే వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని గుర్తుచేశారు. మన రాష్ట్రంలో మరో రెండు నెలల పాటు చలి వాతావరణం కొనసాగనున్నందున అప్పటివరకూ ఒకింత జాగ్రత్తగా ఉండడమే ప్రతి ఒక్కరికీ అవసరమన్నారు.
వ్యాక్సిన్ ప్రభావం తొమ్మిది నెలలే..
కరోనాకు వ్యాక్సిన్ వస్తోందని నిత్యం రకరకాల వార్తలు వింటూ ఉన్నామని, ప్రజలకు అది ఒకింత ఉపశమనమే అయినా, అందరికీ అందుబాటులోకి రావడానికి సమయం పట్టవచ్చని డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒకసారి వ్యాక్సిన్ డోసు వేసుకున్న తర్వాత మూడు వారాల అనంతరం మరో డోస్ ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తర్వాత తొమ్మిది నెలల పాటు వీటి ప్రభావం ఉంటుందన్నారు. దేశంలోని ప్రజలందరికీ టీకాలు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వమే తేల్చి చెప్పిందన్నారు. మన రాష్ట్రం విషయంలో కనీసంగా 70 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్ వచ్చినా అది ఎంత వరకు సురక్షతం, సమర్ధవంతం అనేది తేలాల్సి ఉందని, దానిపై స్పష్టత వచ్చేంతవరకు ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవడమే ఉత్తమమన్నారు.