గుత్తాకు మరోసారి ఛాన్స్..? సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం?
దిశ, తెలంగాణ బ్యూరో: మండలి చైర్మన్ గా మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాశ్ నియామకం కానున్నారు. జనవరి 4 వరకు ప్రొటెం చైర్మన్ పదవికాలం ఉండటంతో అంతకు ముందే మండలిని ఒకరోజు నిర్వహించి అదే రోజే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ను ఎన్నుకోనున్నారు. ఎప్పుడు నిర్వహించేది మాత్రం తేదీ ఖరారు కాలేదు. ఈ ఏడాది జూన్3న ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవికాలం ముగిసింది. అందులో చైర్మన్ గుత్తా […]
దిశ, తెలంగాణ బ్యూరో: మండలి చైర్మన్ గా మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాశ్ నియామకం కానున్నారు. జనవరి 4 వరకు ప్రొటెం చైర్మన్ పదవికాలం ఉండటంతో అంతకు ముందే మండలిని ఒకరోజు నిర్వహించి అదే రోజే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ను ఎన్నుకోనున్నారు. ఎప్పుడు నిర్వహించేది మాత్రం తేదీ ఖరారు కాలేదు.
ఈ ఏడాది జూన్3న ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీల పదవికాలం ముగిసింది. అందులో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఉన్నారు. అయితే సమావేశాలను సజావుగా సాగేందుకు ప్రొటెం చైర్మన్ గా భూపాల్ రెడ్డి నియామకం అయ్యారు. ఆయన పదవికాలం సైతం వచ్చే ఏడాది జనవరి 4న ముగుస్తుండటంతో నూతన చైర్మన్, డిప్యూటీ చైర్మన్ నియామకం అనివార్యమైంది. ఇప్పటికే ఎవరిని నియామించాలని పార్టీ ముఖ్యులతో సీఎం కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. అంతేగాకుండా పేర్లను కూడా రెడీ చేశారు. మండలి చైర్మన్ గా మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డికి అవకాశం కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాశ్ నియామకం కానున్నారు.
జనవరి 4 లోపే మండలి చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమవుతుంది. మండలిని ఒకరోజు నిర్వహించి ఉదయం చైర్మన్, డిప్యూటీ చైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం వరకు ఎన్నుకొని సాయంత్రం వరకు ప్రమాణ స్వీకారం సైతం చేయించేందుకు సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఊహించని విధంగా..
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి సీఎం కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాశ్ పేరును నామినేషన్ల చివరిరోజు ఉదయమే ప్రకటించడంతో పాటు నామినేషన్ వేయించారు. ఎంపీగా పదవీకాలం మరో రెండేళ్లు ఉన్నప్పటికీ ముందస్తుగా రాజీనామా చేయించి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేశారు. అందరూ మంత్రిగా అవకాశం కల్పిస్తారని భావించారు. కానీ మండలి డిప్యూటీ చైర్మన్ గా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే కొత్తగా సీఎం కేసీఆర్ మరెవరినైనా తెరమీదకు తెస్తారా? లేకుంటే వీరితోనే ప్రమాణ స్వీకారం చేయిస్తారా? అనే దానిపై ప్రచారం జోరందుకుంది.