జీఎస్టీ శ్లాబ్‌లలో మార్పుల కోసం ఈ నెల 27న సమావేశం!
దిశ, వెబ్‌డెస్క్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లోని రేట్లను సవరించేందుకు మంత్రుల బృందం ఈ నెల 27(శనివారం) సమావేశం కానున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జీఎస్టీ శ్లాబ్‌లలో మార్పులు చేసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ చర్చలో ప్రధానంగా ప్రస్తుతం ఉన్న 5 శాతం పన్ను శ్లాబ్‌ను 7 శాతానికి, 18 శాతం శ్లాబ్‌ను 20 శాతానికి పెంచాలని ఫిట్‌మెంట్ కమిటీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. 12, 18 శాతం పన్ను శ్లాబ్‌లను 17 […]
దిశ, వెబ్‌డెస్క్: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)లోని రేట్లను సవరించేందుకు మంత్రుల బృందం ఈ నెల 27(శనివారం) సమావేశం కానున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. జీఎస్టీ శ్లాబ్‌లలో మార్పులు చేసేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ చర్చలో ప్రధానంగా ప్రస్తుతం ఉన్న 5 శాతం పన్ను శ్లాబ్‌ను 7 శాతానికి, 18 శాతం శ్లాబ్‌ను 20 శాతానికి పెంచాలని ఫిట్‌మెంట్ కమిటీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. 12, 18 శాతం పన్ను శ్లాబ్‌లను 17 శాతం శ్లాబ్‌లోకి విలీనం చేసే అవకాశాలున్నాయి. అలాగే, బంగారం, వెండి లాంటి విలువైన లోహాలపై జీఎస్టీ 3 శాతం నుంచి 5 శాతానికి పెంచాలని ఫిట్‌మెంట్ కమిటీ ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదనలు ఇంకా చర్చల దశలోనే ఉన్నాయని, అధికారికంగా ఈ వారాంతం జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశం అనంతరం మంత్రుల బృందం రూపొందించే నివేదిక జీఎస్టీ కౌన్సిల్ పరిశీలనకు వెళ్లనుంది. ఆ తర్వాత డిసెంబర్‌లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వీటిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. గత కొన్ని నెలలుగా జీఎస్టీ వసూళ్లు పెరుగుతున్న నేపథ్యంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ప్రాధాన్యతగా మారింది. ఇటీవలే కేంద్ర రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ మాట్లాడుతూ.. అక్టోబర్‌లో రూ. 1.30 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయం సానుకూలంగా ఉందని, రానున్న నెలల్లో ఇవి మరింత పెరుగుతాయనే అంచనాలున్నాయని వెల్లడించారు.