కూలీలుగా గ్రూపు-2 అధికారులు..
దిశ, న్యూస్ బ్యూరో : కొలువుల్లేక రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు పడుతున్న బాధ వర్ణణాతీతంగా ఉన్నది. సర్కారు కొలువులకు నోటిఫికేషన్లు జారీ చేస్తలేదంటూ ఆందోళన చెందుతున్నారు. అలాగనీ పొందిన ఉద్యోగానికి కూడా భరోసా లేదని ఉద్యోగార్ధులు ఆందోళనలో ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తోంది. ఏండ్ల కేండ్లు కష్టపడి చదివి గ్రూపు-2 పోస్టింగ్ పొందినా ఫలితం దక్కడం లేదు. ఐదేండ్ల పోరు తర్వాత శిక్షణ పొందినప్పటికీ సర్వీసుల్లోకి అవకాశం కల్పించడం లేదు. ఐదేండ్ల క్రితం నోటిఫికేషన్ జారీ చేసిన […]
దిశ, న్యూస్ బ్యూరో : కొలువుల్లేక రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు పడుతున్న బాధ వర్ణణాతీతంగా ఉన్నది. సర్కారు కొలువులకు నోటిఫికేషన్లు జారీ చేస్తలేదంటూ ఆందోళన చెందుతున్నారు. అలాగనీ పొందిన ఉద్యోగానికి కూడా భరోసా లేదని ఉద్యోగార్ధులు ఆందోళనలో ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తోంది. ఏండ్ల కేండ్లు కష్టపడి చదివి గ్రూపు-2 పోస్టింగ్ పొందినా ఫలితం దక్కడం లేదు. ఐదేండ్ల పోరు తర్వాత శిక్షణ పొందినప్పటికీ సర్వీసుల్లోకి అవకాశం కల్పించడం లేదు. ఐదేండ్ల క్రితం నోటిఫికేషన్ జారీ చేసిన కొలువులకే దిక్కు లేకుండా పోయింది. నైపుణ్యంతో పరీక్ష పాసై, ఇంటర్వ్యూలో విజయం సాధించారు. లాక్ డౌన్, కరోనా వైరస్ బూచీని చూపిస్తూ కాలయాపన చేస్తున్నారు. ఏ కొలువు లేకుండా ఊర్లకు పోతే ఇజ్జత్ పోతుందని ఉద్యోగార్ధులు వాపోతున్నారు. గెజిటెడ్ అధికారులంటిరి కదా.. ఇప్పుడేమో ఇంట్లనే కూర్చుంటున్నారంటూ అవమానిస్తున్నారని, నెలల తరబడి ఎదురుచూపులతోనే కాలం వెళ్లదీస్తున్నామంటున్నారు. కుటుంబాలను పోషించలేక సతమతమవుతున్నారు. నోటిఫికేషన్ నం. 20/2015 & 17/2016 ద్వారా డిప్యూటీ తహశీల్దార్లుగా, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లుగా ఎంపికైన గ్రూపు-2 అధికారుల ఆవేదన ఇది. మంత్రి కేటీఆర్, చీఫ్ సెక్రటరీలను కలిసినా, ఎన్నిసార్లు వినతి పత్రాలను సమర్పించినా ఫలితం దక్కడం లేదని ఆరోపిస్తున్నారు. 259 డిప్యూటీ తహశీల్దార్, 289 ఎక్సైజ్ సబ్ ఇన్సె్పెక్టర్ పోస్టులకు ఎంపికైన 548 మంది ఐదు నెలలుగా పోస్టింగు, జీతాల కోసం తపిస్తున్నారు. రాష్ట్రంలో జిల్లాల వారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న రిపోర్టుల ఆధారంగానే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇప్పుడేమో మళ్లీ అదే రిపోర్టు ఇంకా రాలేదంటూ ఉన్నతాధికారులు దాటవేత ధోరణిని అవలంభిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొలువులకు రాజీనామాలు..
గ్రూపు-2 పోస్టు.. గెజిటెడ్ పోస్టు అంటూ చేస్తోన్న కొలువులకు రాజీనామా చేశారు. వీరిలో 100 మందికి పైగా ప్రభుత్వ టీచర్లు, పదుల సంఖ్యలో పంచాయతీ సెక్రటీరీలు, వీఆర్వోలు ఉన్నారు. ఇస్రో శాస్త్రవేత్తగా పని చేస్తోన్న వ్యక్తి కూడా డిప్యూటీ తహశీల్దార్ పోస్టుకు ఎంపికయ్యారు. రైల్వే ఉద్యోగి కూడా తన కొలువును కోల్పోయారు. ఎంపీడీఓ పోస్టులకు రాజీనామా చేసిన వారు కూడా ఉన్నారు. చేపట్టిన కొలువుల కంటే డిప్యూటీ తహశీల్దార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టు బాగుంటుందని పోరాడారు. 2015లో నోటిఫికేషషన్, 2016లో పరీక్ష.. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులు. ఇవన్నీ ఎదుర్కొని క్లియర్ అయ్యే వరకు నాలుగేండ్లు పట్టింది. కోర్టుల్లో కేసులు గెలిచేందుకు కొలువులు గెలిచినోళ్లే సొంత ఖర్చులతో న్యాయవాదులను నియమించుకున్నట్లు చెప్పారు. రెవెన్యూ ఉద్యోగులకు ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 వరకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు సర్వేపై శిక్షణ ఇచ్చారు. ఆ పై అందరినీ ఇంటికి పంపారు. కరోనా వైరస్, లాక్ డౌన్ నేపధ్యంలో పోస్టింగులను నెల రోజుల్లో ఇస్తామని నమ్మించి ఇండ్లకు పంపారు. ఆనాటి నుంచి ఎదురుచూపుల్లోనే గడుపుతున్నారు. ఏప్రిల్ 29న చీఫ్ సెక్రటరీ పేషీలోనూ వినతి పత్రాన్ని సమర్పించారు. రెండు సార్లు మంత్రి కేటీఆర్ ను కలిసి తమ గోడును విన్నవించుకుంటే వెంటనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పలుమార్లు సీసీఎల్ఏ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు తమను పట్టించుకోవడం లేదని ఉద్యోగాలకు అర్హత సాధించిన వారు ‘దిశ’కు వివరించారు.
కూలీనాళీయే దిక్కు..
గెజిటెడ్ అధికారిగా నియామకమైనా ఐదు నెలలుగా జీతాలు లేకపోవడంతో గ్రామాల్లో కూలీనాళీ పనులకు వెళ్తున్నట్లు గతంలో పంచాయత్ సెక్రటరీగా పని చేసిన వ్యక్తి చెప్పారు. రూ.50 వేలు, రూ.80 వేలు జీతం పొందే కొలువును వదులుకొని గెజిటెడ్ పోస్టుకు వస్తే ఎదురుచూపులతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. మరోవైపు ఇంటి కిరాయిలు కట్టలేక ఇబ్బందులకు గురవుతున్నట్లు గతంలో స్కూల్ అసిస్టెంట్ గా పని చేసిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకొందరేమో ఊర్లల్లో ఏ పని దొరికితే అది చేయడానికి వెనుకడుగు వేయడం లేదు. తాజాగా తమకు పోస్టింగులు ఇప్పించాలంటూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ ను కలిసి వారి గోడును విన్నవించుకున్నారు. వెంటనే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ స్పందించి పోస్టింగులు ఇప్పించాలని వేడుకుంటున్నారు.