బల్దియా.. పీలియా

దిశ, తెలంగాణ బ్యూరో: బల్దియా ఎన్నికలు కాస్ట్లీగా మారాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి రూ. ఐదు లక్షలకు మించి ఖర్చు చేయరాదు. ప్రధాన పార్టీల అభ్యర్థులెవ్వరు కూడా నిబంధనలకు లోబడి ఖర్చు చేసిన దాఖలాలు లేవు. 15 రోజులుగా బీరువాలు ఖాళీ చేసుకున్నారు. కూడబెట్టిన సొమ్మంతా ఆవిరైంది. ఎన్నికల సంఘానికి సమర్పించే బిల్లులు మాత్రం రూ. ఐదు లక్షల లోపే ఉంటాయి. డబ్బులు లేనివారు పోటీ చేసే […]

Update: 2020-11-30 22:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బల్దియా ఎన్నికలు కాస్ట్లీగా మారాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి రూ. ఐదు లక్షలకు మించి ఖర్చు చేయరాదు. ప్రధాన పార్టీల అభ్యర్థులెవ్వరు కూడా నిబంధనలకు లోబడి ఖర్చు చేసిన దాఖలాలు లేవు. 15 రోజులుగా బీరువాలు ఖాళీ చేసుకున్నారు. కూడబెట్టిన సొమ్మంతా ఆవిరైంది. ఎన్నికల సంఘానికి సమర్పించే బిల్లులు మాత్రం రూ. ఐదు లక్షల లోపే ఉంటాయి. డబ్బులు లేనివారు పోటీ చేసే అవకాశం లేదని తేలిపోయింది. నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి వంటి గుణాలకు తావు లేదు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. సభలు, సమావేశాలతో తీరిక లేకుండా గడిపారు. ఫలితంగా ఎన్నికల ఖర్చు పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంపన్నులు మాత్రమే ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితులు దాపురించాయి. సామాన్యులెవరూ పోటీ గురించి ఆలోచించే అవకాశం లేదు. వివిధ పార్టీల హామీల వ్యయం రూ.లక్ష కోట్లకు పైగానే ఉంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, మజ్లిస్ మధ్య పోటీ జోరుగా సాగింది. ఎన్నికల ఖర్చు కూడా అనూహ్యంగా పెరిగింది. అభ్యర్ధులు గెలుపు కోసం సంపాదనంతా ఖర్చు పెట్టేందుకు వెనుకడుగు వేయలేదు. ప్రచారంలో హంగూ, ఆర్భాటం కనిపించింది. సాధారణంగానే దక్షిణాది ప్రాంతంలో ఎన్నికల ఖర్చు అధికమన్న ప్రచారం ఉంది. ఇప్పుడు కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేసి రికార్డు సృష్టించారు. ఎన్నికల షెడ్యూల్ త్వరగా రావడం, ప్రచారానికి ఎక్కువ రోజులు ఇవ్వకపోవడం ఒకందుకు మంచిదైంది. మరికొన్ని రోజులుంటే రెట్టింపు ఖర్చు అయ్యేదన్న అభిప్రాయం కూడా ఉంది.

నగరమంతా

నగర శివారు ప్రాంతాలలో ఖర్చు అధికంగా ఉంటుందని అనేవారు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఖర్చు ఒకే మాదిరిగా కనిపించింది. ప్రతి డివిజన్ లోనూ పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టారు. ఓట్లను కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రచారం మొదలైననాటి నుంచి లక్షల రూపాయలు ఆవిరయ్యాయి. రోజూ వేలాది మందికి టిఫిన్, భోజనాలు పెట్టారు. ఈ ఖర్చు లెక్కిస్తే ఎన్నికల సంఘం నిర్దేశించిన గరిష్ట మొత్తానికి పదింతలు ఉంటుందని అంచనా. అభ్యర్ధి ఇంటి నుంచి కాలు బయట పెట్టింది మొదలు ఖర్చు కూడా స్టార్ట్. వెంట నడిచే కార్యకర్తల ప్రతి ఖర్చు ఆయనదే. ఎక్కడికి వెళ్లినా పదుల సంఖ్యలో వెంట నడవాల్సిందే. ఉదయం నుంచి రాత్రి ఇంటికి చేరుకునే వరకు ప్రతి అడుగుకు డబ్బులే. కుటుంబ సభ్యుల ప్రచారానికి కూడా కార్యకర్తలను నియమించారు. విశ్వాసపాత్రులైన కార్యకర్తలకూ ప్రచారంలో భాగస్వామ్యాన్ని కల్పించారు. వారికి కొంత మందిని అప్పగించారు. ఇక డప్పులు, వాయిద్యాలు, నృత్య బృందాలు, కళాకారులకు పెద్ద మొత్తంలోనే ఖర్చయ్యింది. కాలనీలు, బస్తీలలో మైకుల మోత మోగించే ఆటోలకు కూడా బాగానే వెచ్చించారు.

దావత్‌ల కోసం

కొన్ని పార్టీలు అభ్యర్ధులను గెలిపించుకునేందుకు డివిజన్ కో ఇన్ చార్జీని నియమించాయి. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ఉన్నారు. వారి అనూయాయులూ నగరంలో తిష్ఠ వేశారు. వారే డబ్బు పంపిణీ చేస్తూ దొరికిపోయిన ఉదంతాలు ఉన్నాయి. వారి కోసం రెస్టారెంట్లను, లాడ్జిలను బుక్ చేశారు. రాత్రి దావత్ కోసం బార్లలోనూ ఖాతాలు పెట్టారు. వీళ్ల కోసం అభ్యర్ధులు పెట్టిన ఖర్చు కూడా రూ.లక్షల్లోనే ఉందని అంటున్నారు. ఆది, సోమవారాలలో మందు పంపిణీ కూడా భారీగానే కొనసాగింది. దానికి సాక్ష్యం నవంబరు నెలలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో విక్రయించిన మద్యం లెక్కలే. అక్టోబరు కంటే నవంబరు నెలలో మూడింతల అమ్మకం ఉంటుందని ప్రచారం. పార్టీ జెండాలకే రూ.లక్షల్లో ఖర్చు పెట్టారు. కరపత్రాలు, డోర్ పోస్టర్లకు కూడా అదే స్థాయిలో ఖర్చు చేశారు. వాటిని ఐదు వేలో, పది వేలో ప్రింట్ చేసినట్లుగా చూపించడం పరిపాటి. ఏ బస్తీ, ఏ కాలనీలోకి వెళ్లి తలుపు, గేటు చూసినా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. అన్నీ కలర్ ఫుల్ కరపత్రాలు, పోస్టర్లు కనిపించాయి. అభ్యర్ధి సాదాసీదా ప్రచారం చేస్తే మద్దతు లేదన్న దుష్ప్రచారం చేస్తారన్న భయం నెలకొంది. అందుకే ఆర్భాటానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. వెంట వందలాది మంది కార్యకర్తలు ఉండేటట్లు చూసుకున్న డివిజన్లే అధికం.

అంతా ధనవంతులే

బల్దియా ఎన్నికలలో పోటీ చేసినవారంతా ధనవంతులే. పేదలు కనిపించలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు ఎక్కువగా ఉన్నారు. ఇంకొందరు వ్యాపార, వాణిజ్యవర్గాలకు చెందినవారే. పాత నగరంలో కూడా పోటీ చేసిన అభ్యర్ధులకూ పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. వారికి ప్రతి నెలా రూ.లక్షల్లో కిరాయిలు వస్తాయని ప్రచారం. ఎన్నికల ప్రచారంలో రూ.కోట్లు ఖర్చు చేసినా ఇబ్బందులేం ఉండవు. ఓటమి పాలైన మరో ఏడాదిలోనే సమీకరించుకోగల సమర్ధులే అధికంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అలాంటి సంపాదన ఉన్నోళ్లే పోటీలో నిలిచారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ రూ.కోట్లు కుమ్మరించారు. దీనికంతటికీ కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూముల ధరలు అమాంతంగా పెరగడమేనంటున్నారు. వాటి ద్వారానే సంపాదించిన మొత్తాన్ని ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు.

Tags:    

Similar News