పట్టభద్రుల ఓటు నమోదు.. గడువు పొడిగింపు

దిశ, తెలంగాణ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, ఓటు నమోదు చేసుకోని అర్హులకు ఈసీ మరో అవకాశం కల్పించింది. అర్హులైనవారి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోడానికి డిసెంబరు 31వ తేదీ వరకు గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 6వ తేదీకల్లా పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. కానీ గడువును పొడిగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వచ్చే నెల 31వ […]

Update: 2020-11-06 07:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి, ఓటు నమోదు చేసుకోని అర్హులకు ఈసీ మరో అవకాశం కల్పించింది. అర్హులైనవారి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోడానికి డిసెంబరు 31వ తేదీ వరకు గడువును ఎన్నికల సంఘం పొడిగించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం నవంబరు 6వ తేదీకల్లా పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంది. కానీ గడువును పొడిగించాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వచ్చే నెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఇందుకోసం మళ్ళీ తాజా నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నట్టు వివరించింది. అయితే ఈ తాజా నోటిఫికేషన్ డిసెంబరు 1 నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.

పట్టభద్రులు ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకోడానికి తొలుత గడువును పొడిగించడానికి ఎన్నికల సంఘం ససేమిరా అని తెగేసి చెప్పింది. కానీ పిటిషనర్లు మాత్రం వరదలు, వర్షాలు తదితర కారణాలతో చాలా మంది అర్హులైన గ్రాడ్యుయేట్లు పేర్లను నమోదు చేసుకోలేకపోయారని, గడువును పొడిగించాలని కోరారు. దీనిపై హైకోర్టులో గురువారం విచారణ జరిగిన సందర్భంగా గడువు పొడిగించడానికి ఎన్నికల సంఘం నిరాకరించింది. ప్రజలు చచ్చిపోతున్నా షెడ్యూలు మార్చలేరా అంటూ డివిజన్ బెంచ్ ఘాటుగానే వ్యాఖ్యానించింది. దీంతో ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను అడిగిన తర్వాత తుది నిర్ణయం చెప్తామని న్యాయవాది ఒక రోజు గడువు కోరారు. అదే సమయంలో డిసెంబరు 31 వరకు పొడిగించడానికి ఉన్న అభ్యంతరమేంటో తెలియజేయాలని సూచించారు.

దాని ప్రకారం.. శుక్రవారం ఇదే పిటిషన్‌పై మళ్ళీ విచారణ జరిగింది. తొలుత ఇచ్చిన షెడ్యూలు ప్రకారం ఫాం-18 ద్వారా పేర్లను నమోదు చేసుకున్నారని, కానీ పొడిగిస్తున్నందున కొత్తగా మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి ఫాం – 6,7 దరఖాస్తుల ద్వారా అప్లై చేసుకోవచ్చని కోర్టుకు వివరించారు. డిసెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు ఈ నోటిఫికేషన్ చెల్లుబాటవుతుందని, నవంబరు 6 నుంచి 30వ తేదీ వరకు నమోదు ప్రక్రియ ఉండదని, అప్పటికల్లా ముసాయిదా జాబితా తయారవుతుందని కోర్టుకు న్యాయవాది వివరించారు. హైకోర్టు ప్రతిపాదన ప్రకారమే డిసెంబరు 31వ తేదీ వరకు పొడిగించాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ముసాయిదా జాబితాలో ఏవైనా తప్పొప్పులు ఉంటే సవరించుకోడానికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు.

Tags:    

Similar News