ప్రభుత్వాఫీసుల్లో కొత్త చిక్కులు.. భయపడుతున్న ఉద్యోగులు!

దిశ, న్యూస్ బ్యూరో : లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో ప్రభుత్వ ఆఫీసుల్లో 100% ఉద్యోగులు హాజరుకావాల్సిందేనని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఎంప్లాయిస్ అంతా సచివాలయానికి వచ్చి పనిచేస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో అందరిలో భయం పట్టుకుంది. శానిటైజేషన్ పేరుతో రెండు, మూడ్రోజుల పాటు అధికారులు పలు బ్లాకులకు సెలవు ప్రకటించారు. ప్రైమరీ కాంటాక్టులతో ఆ బ్లాకులోని ఉద్యోగులను హోం క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు యధావిధిగా జరగాలని భావించిన ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను […]

Update: 2020-06-13 00:51 GMT

దిశ, న్యూస్ బ్యూరో :
లాక్‌డౌన్ ఆంక్షలు సడలించడంతో ప్రభుత్వ ఆఫీసుల్లో 100% ఉద్యోగులు హాజరుకావాల్సిందేనని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఎంప్లాయిస్ అంతా సచివాలయానికి వచ్చి పనిచేస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో అందరిలో భయం పట్టుకుంది. శానిటైజేషన్ పేరుతో రెండు, మూడ్రోజుల పాటు అధికారులు పలు బ్లాకులకు సెలవు ప్రకటించారు. ప్రైమరీ కాంటాక్టులతో ఆ బ్లాకులోని ఉద్యోగులను హోం క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు యధావిధిగా జరగాలని భావించిన ప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో ఊహించని కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. పదుల సంఖ్యలో ఉద్యోగులు ఇండ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. వారం, పదిరోజుల వ్యవధిలో బేగంపేట్‌లోని మెట్రో రైల్ భవన్‌లో ఉన్న సీఎంఓ కార్యాలయం, ఆ తర్వాత తాత్కాలిక సచివాలయంలోని ఆర్థిక శాఖ పనిచేసే బ్లాకులు, జీహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్‌లోని హెల్త్ సెక్షన్, ఇప్పుడు మేయర్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు పాజిటివ్​గా రావడంతో ఆఫీసులన్నీ తాత్కాలికంగా మూతపడక తప్పలేదు.

గచ్చిబౌలి టిమ్స్ సూపరింటెండెంట్‌కు..

గచ్చిబౌలిలోని కరోనా స్పెషల్ ఆస్పత్రిగా ఉన్న టిమ్స్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న కొండాపూర్ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇంకా ఆస్పత్రిలో కరోనా పేషెంట్ల అడ్మిషన్లే జరగలేదుగానీ ఒక నర్సుకూ పాజిటివ్ వచ్చింది. ఉస్మానియా ఆస్పత్రికి చెందిన ఈ నర్సులు గత రెండు వారాలుగా టిమ్స్‌లో పనిచేస్తున్నారు. రెండ్రోజుల కిందట పాజిటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఇక పోలీసు స్టేషన్లలో సైతం పదుల సంఖ్యలో పోలీసులకు, అధికారులకు పాజిటివ్ రావడంతో చాలా మందిని హోం క్వారంటైన్‌కు తరలించాల్సి వచ్చింది. ఆ మేరకు విధుల్లో కొరత ఏర్పడింది. దక్షిణ మధ్య రైల్వేలోని ఒక మహిళా ఉన్నతాధికారికి పాజిటివ్ వచ్చింది. దాంతో సోమవారం వరకూ ఆ బ్లాకులో పనిచేసే ఉద్యోగులందరినీ ఇండ్లకే పరిమితం కావాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇలా ఒక్కో ఆఫీసులో పాజిటివ్ కేసులు వస్తుండటంతో సంబంధిత సెక్షన్‌లోని ఉద్యోగులందరినీ రోజుల తరబడి క్వారంటైన్‌లో పెట్టాల్సి వస్తోంది.

ఆఫీసు వర్క్స్‌కు అంతరాయం..

ఇంతకాలం లాక్‌డౌన్ కారణంగా పరిమిత సంఖ్యలో మాత్రమే ఉద్యోగులతో పనిచేసిన ఆఫీసులు మెజారిటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించాయి. కానీ, ఆంక్షలను ఎత్తివేసి సడలింపులు ఇవ్వడంతో వంద శాతం ఉద్యోగులు విధులకు హాజరుకావాల్సి వచ్చింది. అయితే, పాజిటివ్ కేసులు మళ్లీ నమోదవుతుండటంతో ఆఫీసు పనులకు అంతరాయం ఏర్పడుతోంది. మేయర్‌కు నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాల్సి వచ్చింది. జిల్లాల స్థాయిలో కూడా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక మంత్రి వ్యక్తిగత సహాయకుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. జిల్లా కలెక్టర్ కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిన్నచిన్న పొరపాట్లతో కరోనా ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం, ఫలితంగా ఐసొలేషన్ లేదా క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాల్సి వస్తోంది. ఇది సిబ్బందిలో ఆందోళనలకు కారణమవుతోంది.

Tags:    

Similar News