ప్రభుత్వాలకు అతీతంగా ఎన్‌ఈపీ
న్యూఢిల్లీ: నూతన విద్యా విధానం ఒక ప్రభుత్వానికి సంబంధించినది కాదని, యావత్ దేశానికి చెందినదని ప్రధాని మోడీ అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు అతీతంగా అమలవ్వాలని చెప్పారు. దేశ లక్ష్యాలను సాధించడంలో విద్యా విధానం, విద్యా వ్యవస్థలది ప్రముఖమైన పాత్ర ఉంటుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పాలికలు అన్నింటిపైనా విద్యావ్యవస్థ బాధ్యత ఉంటుందని, ఈ వ్యవస్థలో జోక్యం శ్రుతిమించొద్దని, స్వల్పంగా ఉండాలని అన్నారు. నూతన విద్యా విధానంపై విస్తృతస్థాయిలో చర్చలు జరగాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, […]
న్యూఢిల్లీ: నూతన విద్యా విధానం ఒక ప్రభుత్వానికి సంబంధించినది కాదని, యావత్ దేశానికి చెందినదని ప్రధాని మోడీ అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలకు అతీతంగా అమలవ్వాలని చెప్పారు. దేశ లక్ష్యాలను సాధించడంలో విద్యా విధానం, విద్యా వ్యవస్థలది ప్రముఖమైన పాత్ర ఉంటుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పాలికలు అన్నింటిపైనా విద్యావ్యవస్థ బాధ్యత ఉంటుందని, ఈ వ్యవస్థలో జోక్యం శ్రుతిమించొద్దని, స్వల్పంగా ఉండాలని అన్నారు.
నూతన విద్యా విధానంపై విస్తృతస్థాయిలో చర్చలు జరగాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో ఎన్‌ఈపీపై అవగాహన కల్పించాలని సూచించారు. నూతన విద్యా విధానంపై రాష్ట్రపతి భవన్ నిర్వహించిన ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ మాట్లాడారు. ఎన్‌ఈపీ ముసాయిదా రూపకల్పనకు జరిపినట్టుగానే అమలు కోసమూ విరివిగా సంప్రదింపులు చేపట్టాలని అన్నారు. అన్ని పక్షాల మద్దతుతోనే ఎన్‌ఈపీ అమలు విజయవంతం అవుతోందని అన్నారు. కాబట్టి, గవర్నర్‌లు ఈ నెల 25వ తేదీ వరకు ఆన్‌లైన్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
‘మేధో’ ఎగుమతికి అడ్డుకట్ట
ఆత్మ నిర్భర్ భారత్ కోసం యువత నైపుణ్యాలు కలిగి ఉండటం కీలకమని, తక్కువ వయసులో వొకేషనల్ విద్య, ప్రాక్టికల్ బోధనలతో ఉపాధికి వారు సంసిద్ధులవుతారని చెప్పారు. తద్వారా ప్రపంచ జాబ్ మార్కెట్‌లోనూ భారత్ వాటా పెరుగుతుందని వివరించారు. నూతన విద్యా విధానం మేధోపరమైన ఎగుమతిని అడ్డుకుంటుందని తెలిపారు. ఈ విధానంలో ప్రపంచ మేటి యూనివర్సిటీలు భారత్‌లో క్యాంపస్‌లు తెరవడానికి వీలు కల్పిస్తుందని, తద్వారా దేశ విద్యార్థులు చదువు కోసం విదేశాలకు వెళ్లబోరని అన్నారు. అలాగే, ఆ యూనివర్సిటీలకు దీటుగా దేశీయ వర్సిటీలు ఎదుగుతాయని చెప్పారు.