కేంద్రం కీలక ప్రకటన.. త్వరలో స్పుత్నిక్-వీ ఫ్రీ
న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర వినియోగం కింద అనుమతులు పొందిన మూడో కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీని ఉచితంగా అందించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ప్రైవేటు సెంటర్లలోనే లభ్యమవుతున్న ఈ వ్యాక్సిన్ త్వరలోనే ప్రభుత్వ టీకా కేంద్రాల్లోనూ అందుబాటులోకి రానుందని కేంద్రం ఏర్పాటు చేసిన కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్ పర్సన్ ఎన్‌కే అరోరా మంగళవారం వెల్లడించారు. రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను -18 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుందని తెలిపిన ఆయన అందుకోసం పోలియో వ్యాక్సిన్లను […]
న్యూఢిల్లీ: దేశంలో అత్యవసర వినియోగం కింద అనుమతులు పొందిన మూడో కొవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్-వీని ఉచితంగా అందించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ప్రైవేటు సెంటర్లలోనే లభ్యమవుతున్న ఈ వ్యాక్సిన్ త్వరలోనే ప్రభుత్వ టీకా కేంద్రాల్లోనూ అందుబాటులోకి రానుందని కేంద్రం ఏర్పాటు చేసిన కొవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్ పర్సన్ ఎన్‌కే అరోరా మంగళవారం వెల్లడించారు. రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ను -18 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుందని తెలిపిన ఆయన అందుకోసం పోలియో వ్యాక్సిన్లను నిల్వ ఉంచే కోల్డ్ చైన్ ఫెసిలిటీని వినియోగించనున్నట్టు చెప్పారు. ఫలితంగా దేశంలోని మారుమూల గ్రామాల్లోకీ స్పుత్నిక్-వీని తీసుకెళ్లొచ్చన్నారు. అలాగే, దేశంలో ఇప్పటివరకు 35కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని, ఈ నెలాఖరు కల్లా మరో 12 నుంచి 16 కోట్ల డోసులను అందజేస్తామని చెప్పారు.
ఇప్పటివరకు పంపిణీ చేసిన టీకాల్లో కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు కీలకపాత్ర పోషించాయని అరోరా తెలిపారు. వాటి ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుండటమేగాక, అదనంగా స్పుత్నిక్-వీ, మోడెర్నా, జైడస్ కాడిలాలూ తోడవనున్నాయని అన్నారు. వీటి రాకతో డైలీ వ్యాక్సినేషన్ ఊపందుకుంటుందని స్పష్టంచేశారు. ప్రస్తుతం రోజువారీ టీకా పంపిణీ 50లక్షల డోసులుగా ఉండగా, అదనపు టీకాల చేరికతో ఈ సంఖ్య 80లక్షల నుంచి కోటీ డోసుల వరకు చేరొచ్చని అంచనా వేశారు. ఐసీఎంఆర్ అంచనా ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో థర్డ్ వేవ్ రావొచ్చని, అయితే, దేశంలోని 18+ వారందరికీ(సుమారు 93కోట్ల మంది) టీకా వేయాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎనిమిది నెలల్లో చేరుకుంటామని దీమా వ్యక్తం చేశారు.