కేంద్ర సంక్షేమ పథకాలకు కోత?

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ మూలంగా విధించిన లాక్‌డౌన్ కాలంలో అసలే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు త్వరలో ఊహించని దెబ్బ తగలబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఈసారి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉండనుంది. కొన్ని పథకాలు అమలు అమలుకావడమే గగనం అనే పరిస్థితి నెలకొనింది. యుపీఏ హయాంలో 66 పథకాలు ఉంటే మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 29కు పడిపోయింది. ఇందులో 26 పథకాలకు కేంద్రం […]

Update: 2020-06-01 04:48 GMT

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ మూలంగా విధించిన లాక్‌డౌన్ కాలంలో అసలే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు త్వరలో ఊహించని దెబ్బ తగలబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో నడుస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకాలకు ఈసారి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉండనుంది. కొన్ని పథకాలు అమలు అమలుకావడమే గగనం అనే పరిస్థితి నెలకొనింది. యుపీఏ హయాంలో 66 పథకాలు ఉంటే మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 29కు పడిపోయింది. ఇందులో 26 పథకాలకు కేంద్రం 60% మేర నిధులు కేటాయిస్తే మిగిలిన 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రాల ఆర్థిక వనరులు పడిపోవడంతో ఏ మేరకు ఈ వాటాను ఇవ్వగలుగుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రాలు నిధులు ఇవ్వకుండా కేవలం కేంద్రం ఇచ్చిన నిధులతోనే సరిపెట్టడానికి వీల్లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గట్టిగా పట్టుబడుతోంది. దీంతో ఆ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.

కేంద్ర ప్రభుత్వం తరపున మొత్తం 29 సంక్షేమ పథకాలు అమలవుతున్నా అందులో ఐదు మాత్రమే పూర్తిస్థాయిలో కేంద్రం సమకూర్చే నిధులతో నడిచేవి. మిగిలిన 24 పథకాలు రాష్ట్రాలు 40%వాటాను జతచేయాల్సిందే. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమం లాంటి నాలుగు పథకాలతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ అమలుచేస్తున్న జాతీయ సహాయతా పథకం మాత్రమే పూర్తిగా కేంద్రం నిధులతో నడిచేవి. గ్రామీణ ఉపాధి హామీ పథకం సహా అన్నింటికీ కేంద్రం ఇచ్చే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్‌గా రాష్ట్రాలు కూడా జతచేయాల్సిందే. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 25% రాష్ట్రాలు ఇస్తే మిగిలినవాటికి 40% చొప్పున ఇవ్వాలి. ప్రధానమంత్రి కృషి సింఛాయి యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, జాతీయ విద్యా మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్, రూర్బన్ మిషన్, స్వాస్త్య బీమా యోజన, మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్… ఇలా అన్నింటికీ రాష్ట్రాలు 40% నిధులు ఇవ్వాలి. ఈశాన్య రాష్ట్రాలు మాత్రం 10% ఇస్తే సరిపోతుంది.

రాష్ట్రాలు నిధులు ఇవ్వకుంటే కేంద్రం కూడా ఇవ్వదు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో క్షేత్రస్థాయిలో ఈ పథకాలను అమలుచేసేది రాష్ట్ర ప్రభుత్వాలే. ప్రతీ ఏటా సగటున సుమారు రూ. 3.40 లక్షల కోట్లను కేంద్రం తన బడ్జెట్‌లో కేటాయిస్తూ ఉంది. ప్రతీ బడ్జెట్‌లో ఎంతో కొంత ఎక్కువ కేటాయింపులు చేస్తున్నట్లు లెక్కల్లో కనిపిస్తున్నా రకరకాల కారణాలతో ఆ స్థాయిలో అమలు జరగడంలేదు. ఈసారి కరోనా లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రాల ఆదాయ వనరులు దాదాపు 80% తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో ఆ పథకాల అమలుకు 40% మేర నిధులను కేటాయించడం కత్తిమీద సాములాగే ఉంటుంది. తెలంగాణ విషయాన్నే తీసుకుంటే ప్రతీ నెలా సగటున రూ. 12 వేల కోట్లు సమకూరాల్సి ఉన్నప్పటికీ కేంద్రం నుంచి వచ్చే డివొల్యూషన్ పన్నుల వాటాతో కలుపుకుని కేవలం రూ. 3,100 కోట్లు మాత్రమే సమకూరాయి. వీటిని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లు, ఆసరా పింఛను, పలు సంక్షేమ పథకాలు లాంటివాటికి ఖర్చు చేయాలి. కానీ ఆ అవసరాలకే సరిపోక ఉద్యోగుల జీతాల్లో కోత విధించక తప్పలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు 40% వాటాను జతచేయడం ఇబ్బందికరమే అవుతుంది.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోని ఎక్స్‌పెండిచర్ విభాగం ఉన్నతాధికారి ఒకరు ఇటీవల జాతీయ మీడియాతో మాట్లాడుతూ, కేవలం కేంద్రం మంజూరు చేసిన నిధులతోనే ఈ ప్రాయోజిత పథకాలను అమలుచేస్తామని రాష్ట్రాలు షరతు విధించినట్లయితే దానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ పథకాల అమలుతో ఆశించిన లక్ష్యం నెరవేరాలంటే కేవలం కేంద్ర నిధులు మాత్రమే సరిపోవని, రాష్ట్రాలు కూడా వాటి వాటాగా విధిగా ఇవ్వాల్సిందేనని, అప్పుడే వాటికి సార్థకత ఉంటుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ రాష్ట్రాలు ఇస్తామని ఒప్పుకున్న తర్వాత 40% మేర వాటా జత చేయకపోతే మరుసటి నెల నిధుల విడుదల ఉండదని స్పష్టం చేశారు. తొలి విడత నిధుల విడుదలకు సంబంధించిన వినియోగ ధృవీకరణ పత్రాలను సమర్పించిన తర్వాతనే రెండో వాయిదా విడుదల ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో ప్రతీ మూడు నెలలకు ఒకసారి కేంద్రం నిధులను విడుదల చేసే ఆనవాయితీ ఉన్నప్పటికీ ఈసారి మాత్రం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారడంతో వాటి వాటాను వేసే అవకాశం ఉండకపోవచ్చని అంచనాకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం తొలి విడత కేవలం నెలరోజులకు సరిపోయేంత స్థాయిలో నిధులను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

కేంద్రం కోత అనివార్యం?

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్న నేపథ్యంలో కేంద్రం కూడా ఈ పథకాల అమలుకు తాత్కాలికంగా బ్రేక్ వేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు వీటికి కేటాయించే నిధులు కూడా గణనీయంగా తగ్గిపోనున్నాయి. ఎఫ్ఆర్‌బీఎం కింద అప్పులు తీసుకోడానికి రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం వాటి నుంచి ఈ పథకాలకు వాటాను సమకూర్చాలనే సలహా ఇవ్వబోతున్నట్లు సమాచారం. మహారాష్ట్ర ప్రభుత్వం ఈసారి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకంటే కేంద్ర ప్రాయోజిత పథకాలనే సీరియస్‌గా అమలుచేయాలనుకుంటున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రస్తావించడాన్ని కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్రాలు స్వంతంగా రూపొందించుకున్న పథకాలకు 100% నిధులను సమకూర్చలేని పరిస్థితుల్లో కేవలం 40% మాత్రమే చేర్చి కేంద్ర పథకాలపైనే ఆశలు పెట్టుకుంది. మరికొన్ని రాష్ట్రాలు కూడా పూర్తిగా కేంద్రం ఇచ్చే నిధులతోనే అమలుచేసి రాష్ట్రాల వాటాను కొంతకాలం నిలిపివేయాలనుకుంటున్నట్లు కూడా కేంద్రానికి సమాచారం అందింది. అందువల్లనే కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్‌పెండిచర్ కార్యదర్వి అంత ఘాటుగా స్పందించాల్సి వచ్చింది.

ఈ పథకాలన్నీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదల అవసరాల కోసమే అయినా రాష్ట్రాల దగ్గర డబ్బుల్లేక అవి ఇవ్వలేమంటున్నాయి. కేంద్ర ప్రభుత్వమేమో పూర్తిగా తమ నిధులతోనే అమలుచేస్తామంటే కుదరదంటోంది. చివరికి ఈ దుష్పరిణామాలను పేద ప్రజలే అనుభవించాల్సి వస్తోంది. ఇప్పటికే పొట్ట చేతపట్టుకుని పట్టణాల్లో ఉపాధికోసం వెళ్ళిన కోట్లాది మంది పేద కార్మికులు కరోనా భయంతో సొంతూళ్ళకు చేరుకున్నారు. ఇప్పుడు పని చేయడానికి ఉపాధి లేక, చేతిలో డబ్బుల్లేక, ఈ పథకాలు అమలుకాక మరింత పేదరికంలోకి, ఆకలి బాధల్లోకి వెళ్తారనేది నిర్వివాదాంశం.

Tags:    

Similar News