ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోరా?
దిశ, న్యూస్ బ్యూరో: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణలో ఆరోగ్య రంగంపై చేసే ఖర్చు ఏమాత్రం పెరగలేదు. సొంత రాష్ట్రంలోనూ తెలంగాణ ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. నిధుల కేటాయింపు లేక ఈ రంగం వెనుకబడుతోంది. ప్రస్తుత కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చికిత్స అందించడం కష్టంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంంగా ఏర్పడిన తర్వాత 2014 నుంచీ ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖపై పెట్టిన ఖర్చును పరిశీలిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు […]
దిశ, న్యూస్ బ్యూరో: ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణలో ఆరోగ్య రంగంపై చేసే ఖర్చు ఏమాత్రం పెరగలేదు. సొంత రాష్ట్రంలోనూ తెలంగాణ ప్రజలు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. నిధుల కేటాయింపు లేక ఈ రంగం వెనుకబడుతోంది. ప్రస్తుత కరోనా కష్టకాలంలోనూ ప్రజలకు సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో చికిత్స అందించడం కష్టంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంంగా ఏర్పడిన తర్వాత 2014 నుంచీ ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖపై పెట్టిన ఖర్చును పరిశీలిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు వెల్లడవుతాయి.
తొమ్మిది లక్షల కోట్ల రూపాయల జీఎస్‌డీపీ కలిగినా, ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ అని చెప్పుకుంటున్నా ఏటా ప్రజారోగ్యంపై పెట్టే ఖర్చు జీఎస్‌డీపీలో ఒక్క శాతం కూడా దాటడం లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్న బడ్జెట్ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ లాంటి పలు స్కీములు, డాక్టర్లు, ఇతర సిబ్బంది జీతాలు, ఆస్పత్రుల నిర్వహణ, మందుల కొనుగోలు తదితర ప్రాథమిక అవసరాల కోసం, నిర్వహణ వ్యయానికి మాత్రమే నిధులు కేటాయించింది. అంతేకానీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త ఆస్పత్రుల నిర్మాణం, ఉన్నవాటిలో అధునాతన సౌకర్యాలు కల్పించడం లాంటి వాటిపై వ్యయం చేయడానికి ప్రభుత్వం ఈ ఆరేళ్లలో చెప్పుకోదగ్గ స్థాయిలో నిధులేవీ కేటాయించలేదు.
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత
ఆరేళ్లలో తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ) సమారు 3 రెట్లు పెరిగింది. రాష్ట్రం ఏర్పడ్డ తొలి ఆర్థిక సంవత్సరం (2014-15)లో జీఎస్‌డీపీ రూ.4 లక్షల కోట్లు ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020-21) రూ.11 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచీ జీఎస్‌డీపీ పెరుగుతూనే ఉంది. కానీ ప్రజారోగ్యం మీద పెట్టే ఖర్చు మాత్రం జీఎస్‌డీపీతో పోల్చుకుంటే తగ్గుతూ వస్తోంది. 2014-15లో రాష్ట్ర జీఎస్‌డీపీ అక్షరాల రూ.4 లక్షల కోట్లు. కానీ ఆ ఆర్థిక సంవత్సరంలో వైద్యారోగ్య శాఖపై ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.2,478 కోట్లు. అంటే కేవలం జీఎస్డీపీలో 0.62 శాతం మాత్రమేనని ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి.
ఈ ఆరేండ్లలో గరిష్ఠంగా 2016-17లో జీఎస్డీపీలో 0.76 శాతం అంటే రూ.4,869 కోట్లు ప్రజారోగ్యంపై ఖర్చు చేయగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.11 లక్షల కోట్ల జీడీపీకిగాను వైద్యారోగ్యశాఖపై పెట్టే ఖర్చు రూ.5,666 కోట్లు. ఆరేండ్లతో పోలిస్తే ఈ ఏడాది చేసిన కేటాయింపులే అతి తక్కువ. కేవలం 0.51 శాతం మాత్రమే కేటాయింపులు చేసింది. ఏటా ద్రవ్యలోటు పేరుతో అప్పులు చేసి అవి లక్షల కోట్లకు చేరుకున్న అనంతరం ఈ ఏడాది ఏకంగా రూ.14 వేల కోట్ల వడ్డీ చెల్లించడానికి సిద్ధపడ్డ ప్రభుత్వం ప్రజారోగ్యంపై మాత్రం ఆ వడ్డీ మొత్తంలో సగం కూడా ఖర్చు పెట్టలేక పోతోంది. దీన్ని బట్టే వైద్యారోగ్య రంగంపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఎంతో తెలిసిపోతోంది. కేవలం భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, పవర్ ప్లాంట్లు, రోడ్లు, వంతెనలు కట్టడమే పెట్టుబడి వ్యయం కాదని, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న సామాన్య ప్రజల ఆరోగ్యం కాపాడడానికి చేసే ఖర్చు కూడా పెట్టుబడి వ్యయమేనని పలువురు సామాజికవేత్తలు అభిప్రాయడుతున్నారు.
తెలంగాణ ఆవిర్భావం నుంచి జీఎస్‌డీపీలో ప్రజారోగ్యంపై సర్కారు చేసిన ఖర్చు
ఆర్థిక సంవత్సరం | జీఎస్‌డీపీ | ఆరోగ్యశాఖకు నిధులు (రూ.కోట్లలో) | జీఎస్‌డీపీలో వాటా |
2014-15 | రూ. 4.00 లక్షల కోట్లు | 2478 | 0.62% |
2015-16 | రూ. 4.68 లక్షల కోట్లు | 3500 | 0.75% |
2016-17 | రూ. 6.41 లక్షల కోట్లు | 4869 | 0.76% |
2017-18 | రూ. 7.32 లక్షల కోట్లు | 5031 | 0.69% |
2018-19 | రూ. 8.42 లక్షల కోట్లు | 5375 | 0.64% |
2019-20 | రూ. 9.52 లక్షల కోట్లు | 5116 | 0.54% |
2020-21 | రూ. 11.00 లక్షల కోట్లు | 5666 | 0.51% |