ఏపీలో పల్లెల ముఖ చిత్రం మారనుందా?

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వపరంగా అన్ని సేవలందించే సచివాలయం. పక్కనే రైతు భరోసా కేంద్రం. అనుసంధానంగా వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించే కేంద్రం. దానికి ఆనుకొని పాల సేకరణ కేంద్రం. ఒంట్లో బాగలేకుంటే చూయించుకోవడానికి నాలుగడుగుల అవతల విలేజ్ ​క్లినిక్. కూతవేటు దూరంలో రైతుల పంటలు నిల్వ ఉంచుకునే శీతల గిడ్డంగి. అ పక్కకు తిరిగితే గ్రామ ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు అందించే జనతా బజారు. కొంచెం అవతలగా పశువులాస్పత్రి.​ ఫర్లాంగు దూరంలో ప్రభుత్వ […]

Update: 2020-11-18 09:30 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వపరంగా అన్ని సేవలందించే సచివాలయం. పక్కనే రైతు భరోసా కేంద్రం. అనుసంధానంగా వ్యవసాయ పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించే కేంద్రం. దానికి ఆనుకొని పాల సేకరణ కేంద్రం. ఒంట్లో బాగలేకుంటే చూయించుకోవడానికి నాలుగడుగుల అవతల విలేజ్ ​క్లినిక్. కూతవేటు దూరంలో రైతుల పంటలు నిల్వ ఉంచుకునే శీతల గిడ్డంగి. అ పక్కకు తిరిగితే గ్రామ ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు అందించే జనతా బజారు. కొంచెం అవతలగా పశువులాస్పత్రి.​ ఫర్లాంగు దూరంలో ప్రభుత్వ పాఠశాల. వావ్​.. ఇది కదా గ్రామ స్వరాజ్యమంటే.. అంటూ ప్రభుత్వాధినేతలు మురిసిపోతున్నారు. అధికార పార్టీ నాయకులకైతే ఒంటిమీద దుస్తులే నిలవడం లేదు. ఇవన్నీ గ్రామీణులు సమానంగా అందిపుచ్చుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ప్రధాన ఉత్పత్తి సాధనమైన భూ సంబంధాల్లో మార్పు రాకుండా సాధ్యం కాదు. కొద్దిమందికే అభివృద్ధి ఫలాలు పరిమితమవుతాయి. మరింత అసమానతలు పెరగడానికి దోహదపడతాయి.

రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామ సచివాలయాలు సొంత భవనాల్లో ఉన్నాయి. లేనిచోట నిర్మిస్తున్నారు. ఈపాటికే ఉన్న రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా రూ.1,682 కోట్ల వ్యయంతో 9,899 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఆర్బీకేల పరిధిలో రూ.9,104 కోట్ల వ్యయంతో మల్టీపర్పస్​కేంద్రాలను నెలకొల్పనున్నారు. ప్రధానంగా గోడౌన్లు, కోల్డ్‌ రూములు, ఆక్వా మౌలిక సదుపాయాలు, పాల సేకరణ కేంద్రాలు, బల్క్​ మిల్క్ ​సెంటర్లు, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, ఈ–మార్కెటింగ్‌ ప్లాట్ ‌ఫారాలు, జనతా బజార్లు ఈ మల్టీ పర్పస్‌ కేంద్రాల్లో ఏర్పాటవుతాయి. గోడౌన్లు, కోల్డ్​స్టోరేజీల కోసం నాబార్డు నుంచి రూ.2,706 కోట్లు వెచ్చిస్తారు.

ఆక్వా మౌలిక సదుపాయాల కోసం మత్స్యశాఖ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.698.27 కోట్లు ఖర్చు పెట్టనున్నాయి. రూ.1,362 కోట్లతో పాలసేకరణ కేంద్రాలు, పాల ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేస్తారు. మండల స్థాయిలో కస్టమ్స్​ హైరింగ్​ కేంద్రాల ఏర్పాటునకు రూ.181 కోట్లు, ఆహార శుద్ది కేంద్రాల కోసం రూ.2122 కోట్లు వెచ్చిస్తారు. రూ.12 కోట్లతో ఈ – మార్కెటింగ్ ​ప్లాట్ ​ఫారాలు, రూ.750 కోట్లతో జనతా బజార్లు ఏర్పాటు చేస్తారు. ఇవిగాక హెల్త్, వెటర్నరీ క్లినిక్​లు వస్తాయి. సర్వ హంగులతో కూడిన ప్రభుత్వ పాఠశాలలుంటాయి. మొత్తంగా గ్రామీణ మౌలిక స్వరూపమే మారిపోతుంది. వేల కోట్ల ప్రజాధనంతో అన్ని రకాల మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలు కల్పిస్తే.. వీటన్నింటినీ అన్ని కుటుంబాలు సమానంగా అందిపుచ్చుకొని పరిస్థితుల్లేవు. తీవ్రమైన అసమానతలు తలెత్తే ప్రమాదం ఉంది. అదెలాగో చూద్దాం.

అదొక మేజరు పంచాయతీ. అన్నపూర్ణగా పేరుగాంచిన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామం. ఆ ఊళ్లో మొత్తం 16 వేల జనాభా. సుమారు ఏడు వేల కుటుంబాలుంటాయి. సాగు భూమి 5,500 ఎకరాలుంటుంది. కేవలం వెయ్యి కుటుంబాల చేతుల్లోనే ఈ భూమి ఉంది. దాదాపు 3,500 కుటుంబాలు కౌలు రైతులు, వ్యవసాయ కూలీలుగా భూమిపై ఆధారపడి బతుకుతున్నాయి. మరో వెయ్యి కుటుంబాలు చేతి వృత్తులు, చిరు వ్యాపారాలతో కొనసాగుతున్నాయి. మిగిలినవి చిరుద్యోగాలు, ఇతరత్రా పనులతో కుటుంబాలు నెట్టుకొస్తున్నాయి. ప్రధానమైన వ్యవసాయంలో 80 శాతం కౌలు సాగే నడుస్తోంది. పంటల స్కేల్​ఆఫ్​ఫైనాన్స్​ప్రకారం ఒక్క కౌలు రైతుకీ బ్యాంకు రుణం అందలేదు. ఓ ఇరవై శాతం మందికి జాయింట్​లయబుల్​గ్రూపులుగా ఏర్పడితే ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున రుణం ఇచ్చారు. మిగతా పెట్టుబడిని అధిక వడ్డీలకు సమకూర్చుకోవాలి.

మొన్నటికి మొన్న ఇన్​పుట్ ​సబ్సిడీ వస్తే కౌలు రైతులకు దక్క లేదు. భూ యజమానులకే పోయింది. వరదలకు వరి పంట భారీగా దెబ్బతింది. 30 శాతం దిగుబడి వచ్చే పరిస్థితి లేదు. రేపు పాల కేంద్రాలు వస్తే అధిక వడ్డీకి తెచ్చుకొని గేదెలు కొనుక్కోవాలి. వాటికి మేత కోసం మళ్లీ కొంత భూమి కౌలు పట్టాలి. ఏటా కౌలు రేట్లు పెరుగుతున్నాయి. అప్పుల పాలై కౌలు సాగు చేయలేకుంటే భూ యజమానులు కార్పొరేట్​కంపెనీలకు ఇచ్చేస్తారనే భయం. ప్రభుత్వం ప్రజాధనంతో ఓ సదుపాయాన్ని కల్పిస్తే దాన్ని అన్ని వర్గాలు సమానంగా ప్రయోజనం పొందేట్లు చర్యలు తీసుకోవాలి. లేదంటే గ్రామాల్లోనే అంబానీలు, అదానీలు తయారై ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తారు. ఈ ఉపద్రవాన్ని ప్రభుత్వాధినేతలు గుర్తెరగాలి. గ్రామాల్లో 80 శాతంగా ఉన్న పేద, దిగువ మధ్య తరగతి వర్గాలకు ఈ సదుపాయాలతో మరింత ప్రయోజనం పొందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

సచివాలయానికి అనుసంధానంగా బ్యాంకు శాఖ ఉండాలి

సచివాలయం పక్కనే ఓ బ్యాంకు శాఖ పెట్టాలి. వాస్తవ పంట సాగుదారులను గుర్తించాలి. వారికే పంట రుణాలు ఇవ్వాలి. పంట నష్ట పరిహారం నుంచి అన్ని ప్రోత్సాహకాలు సాగుదార్లకే దక్కాలి. పంట ఉత్పత్తులకు ధర వచ్చే దాకా గోదాముల్లో పెట్టుకుంటే దానిపై బ్యాంకు రుణం ఇవ్వాలి. పాడి గేదెలకు మేత కోసం సహకార సంఘంగా ఏర్పాటు చేసి ప్రభుత్వం లీజు చెల్లించి కొంత భూమిని ఇవ్వాలి. -గుత్తికొండ కృష్ణారావు, రైతు, కైకరం

గ్రామీణ పేదలకు భూమిపై హక్కు కల్పించాలి

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలను కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. వివిధ వృత్తిదార్లకు సంబంధించిన మాన్యాలు అన్యాక్రాంతమయ్యాయి. కొన్ని చోట్ల కుటుంబ అవసరాలకు అయినకాడికి తెగనమ్ముకున్నారు. ఇంకొన్ని చోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. వాటన్నింటినీ తిరిగి ఆయా వృత్తిదార్లకు ఇవ్వాలి. లేదంటే ప్రభుత్వమే కొనుగోలు చేసి భూమిపై హక్కు కల్పించాలి. అలాగే కౌలు రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన కౌల్దారీ చట్టాన్ని తీసుకురావాలి. గ్రామీణ అసమానతలు పెరగకుండా ప్రభుత్వం తగు విధానాలు అమలు చేయాలి. -కే.శ్రీనివాస్, రైతు సంఘం నేత, ఏలూరు

Tags:    

Similar News