మేడ్చల్ జిల్లాలో పాలన అస్తవ్యస్తం

రాజధానిని ఆనుకొని ఉన్న మేడ్చల్ జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా మారింది. జిల్లా కలెక్టర్‌తో సహా కీలకమైన జిల్లా స్థాయి అధికారుల పోస్టులన్నీ ఇన్‌చార్జిల పాలనలో మగ్గుతున్నాయి. పాలన కుంటుపడింది.. అభివృద్ధి గతి తప్పింది. జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా.. ఇన్ చార్జిల పాలనకు కేరాఫ్ గా నిలుస్తున్నది. ఇక్కడ అనేక విభాగాలకు ఇన్ చార్జిలే దిక్కవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు మెజార్టీ శాఖల్లో ఇన్ చార్జీ […]

Update: 2021-02-05 13:25 GMT
రాజధానిని ఆనుకొని ఉన్న మేడ్చల్ జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా మారింది. జిల్లా కలెక్టర్‌తో సహా కీలకమైన జిల్లా స్థాయి అధికారుల పోస్టులన్నీ ఇన్‌చార్జిల పాలనలో మగ్గుతున్నాయి. పాలన కుంటుపడింది.. అభివృద్ధి గతి తప్పింది. జిల్లాను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దిశ ప్రతినిధి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా.. ఇన్ చార్జిల పాలనకు కేరాఫ్ గా నిలుస్తున్నది. ఇక్కడ అనేక విభాగాలకు ఇన్ చార్జిలే దిక్కవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు మెజార్టీ శాఖల్లో ఇన్ చార్జీ అధికారులే ఉన్నారు. వారంలో రెండు రోజులు లేదంటే మూడు రోజులు వచ్చిపోతూ హడావుడిగా ఫైళ్లపై సంతకాలు చేసేస్తున్నారు. దీనివల్ల వారికి పనిభారం పెరగడంతో పాటు ప్రజల పనుల్లో జాప్యం జరుగుతున్నది. ఇక అధికారులు పనిభారం అధికమై ఇటు సొంత శాఖకు అటు ఇన్ చార్జి తీసుకున్న శాఖకూ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. ఈ మాట స్వయంగా పలువురు అధికారుల నోటే వినిపిస్తున్నది. కలెక్టర్ పోస్టుతోపాటు జిల్లా రెవెన్యూ అధికారి, పౌర సంబంధాల అధికారి, నాలుగు మండలాల తహసీల్దార్లతోపాటు పలు శాఖల్లో పోస్టులు ఇన్ చార్జీలతోనే నడుస్తున్నాయి.

బాస్ పోస్టు ఖాళీ..

జిల్లాలో అత్యంత కీలకమైన కలెక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. ఇక్కడ పని చేసిన వాసం వెంకటేశ్వర్లును గతేడాది నవంబర్ 14వ తేదీన అనుహ్యంగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతికి అదనపు బాధ్యతలను అప్పగించారు. కానీ ఆమె వారంలో రెండుమూడు రోజులు వచ్చిపోతుండడంతో పాలన ముందుకు సాగడం లేదు. గతంలో ఇక్కడ పని చేసిన ఎంవీ రెడ్డి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురాగా, ఆ తర్వాత వచ్చిన వాసం వెంకటేశ్వర్లు ఆరు మాసాలపాటే పనిచేశారు. ఆయన రోజు పర్యటనలు, సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ.. పాలన పరంగా ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. వెంకటేశ్వర్లు వెళ్లి మూడు మాసాలు కావస్తున్నా..ప్రభుత్వం జిల్లాకు పూర్తిస్థాయి కలెక్టర్ ను నియమించలేదు. దీంతో పాలన అస్తవ్యవస్తంగా మారిందని పలువురు అధికారులు వాపోతున్నారు. గురువారం ( ఈ నెల 4న) రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ హరీశ్ ను మెదక్ కలెక్టర్ గా నియమించగా, సీసీఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సంగీతను పెద్దపల్లి కలెక్టర్ గా బదిలీ చేశారు. ఈ క్రమంలోనే మేడ్చల్ కు సైతం కొత్త కలెక్టర్ ను నియమిస్తారని ప్రచారం జరిగింది. కానీ అది జరగలేదు. రాష్ట్రంలో 33 జిల్లాలకు పూర్తిస్థాయి కలెక్టర్లు ఉండగా, ఒక్క మేడ్చల్ కు మాత్రమే ఇన్ చార్జి కలెక్టర్ కొనసాగుతున్నారు.

కీలక పోస్టులు ఖాళీ..

జిల్లాలో కీలక పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆకస్మికంగా తనిఖీలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ మందగించింది. జిల్లా రెవెన్యూ అధికారిగా లింగ్యా నాయక్ ఇన్ చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈయనతోపాటు ఉప్పల్, బాలానగర్, మూడు చింతల పల్లి మండలాలకు పూర్తిస్థాయిలో తహసీల్దార్లను నియమించలేదు. ఉప్పల్ కు కాప్రా తహసీల్దార్ గౌతమ్ కుమార్ ను, మూడు చింతలపల్లికి శామీర్ పేట తహసీల్దార్ సురేందర్ ను, బాలానగర్ కు కూకట్ పల్లికి చెందిన గోవర్ధన్ ఇన్ చార్జులుగా కొనసాగుతున్నారు. దీనికితోడు జిల్లా పౌర సంబంధాల అధికారి కిరణ్ కుమార్ కు సైతం హెడ్ ఆఫీసులో పోస్టింగ్ ఇవ్వగా, జిల్లాలో ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారి కె.మల్లికార్జున్ రావు కు నిర్మల్ లో పోస్టింగ్ ఇవ్వగా.. మేడ్చల్ జిల్లాలో ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. ఇక్కడ రెగ్యులర్ పోస్టింగ్ లో ఉన్న డాక్టర్ వీరాంజనేయులను డిప్యూటేషన్ పై పంపారు. పే అండ్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న ఎస్వీఆర్ చంద్రశేఖర్ కు నాగర్ కర్నూల్ లో పోస్టింగ్ ఇవ్వగా, ఇక్కడ ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో చంద్రశేఖర్ మేడ్చల్ జిల్లాలో మూడు రోజులు పనిచేస్తే.. నాగర్ కర్నూల్ లో మూడు రోజులు అందుబాటులో ఉంటున్నారని ఆ విభాగం ఉద్యోగులు చెబుతున్నారు.
భూ సమస్యలు పెండింగ్..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను ఆనుకొని మేడ్చల్ జిల్లా విస్తరించి ఉండడంతో ఇక్కడి భూములకు విపరీతంగా డిమాండ్ ఉంది. జిల్లాలో రోజూ ఏదో ఒకచోట భూ సమస్యలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి. పాత రెవెన్యూ చట్టాన్ని రద్దు చేసి నూతన చట్టాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర సర్కారు భూముల వివాదాలను పరిష్కరించేందుకు గతంలో ఉన్న తహసీల్దార్, ఆర్డీఓ, జేసీ కోర్టులను రద్దు చేసింది. వారి వద్ద పెండింగ్ లో ఉన్న కేసులన్నింటీని జిల్లా స్థాయిలోనే పరిష్కరించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రిబ్యూనల్ ను ఏర్పాటు చేసింది. జిల్లాలో రెగ్యులర్ కలెక్టర్ లేకపోవడంతో కేసుల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇన్ చార్జి కలెక్టర్ గా ఉన్న శ్వేతామహంతి మేడ్చల్ జిల్లాకు వారానికి రెండుమూడు సార్లు వచ్చి నాలుగు శాఖలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. పెండింగ్ ఫైళ్లన్నీ క్లీయర్ చేసేందుకు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.

Tags:    

Similar News