పేరుకే పార్ట్ టైమ్...చేసింది ఫుల్ టైమ్!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2024 సెప్టెంబర్ 4 నుండి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు 6000 మంది పార్ట్ టైం టీచర్లను ఎటువంటి సమాచారం

Update: 2024-09-13 00:45 GMT

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2024 సెప్టెంబర్ 4 నుండి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న దాదాపు 6000 మంది పార్ట్ టైం టీచర్లను ఎటువంటి సమాచారం లేకుండా తొలగిస్తున్నామని సర్కులర్ ద్వారా, జోనల్ ఆఫీసర్ల ద్వారా తెలియజేస్తూ వీరికి ఉద్వాసన పలకడం జరిగింది. దీని ద్వారా ఆ 6000 మంది కుటుంబాలు రోడ్డున పడి జీవితాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. వీరు ఈ గురుకుల సంస్థను నమ్ముకుని గత పది పదిహేను సంవత్సరాల నుండి ఉద్యోగాలు చేస్తున్నారు.  

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో పేదపిల్లల కోసం, వారి విద్యాభివృద్ధిలో ఎంతో శ్రమతో పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించడంలో ఈ పార్ట్ టైం టీచర్ల పాత్ర అమోఘం. గత సంవత్సరం ట్రిబ్ (TREIB) ద్వారా వచ్చిన నూతన ఉపాధ్యాయులను నింపగా కూడా ఈ 6000 మంది పార్ట్ టైం ఉపాధ్యాయుల అవసరం ఉంది. కానీ వీరిని ఏ కారణం చేత తొలగించారో ఇప్పటివరకు సంస్థ అధికారులు, కార్యదర్శి కానీ సమాధానం చెప్పడం లేదు. దీని ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల చదువులపై ప్రభావం చూపనుంది. కావున దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి.

పాఠాలు చెప్పడం లేదని..

ఒకవేళ పార్ట్ టైమ్ టీచర్లను తొలగించాలనుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో పనిచేసే పార్ట్ టైం టీచర్లను కూడా తొలగించాలి. కానీ కేవలం ఎస్సీ గురుకులాల్లో పనిచేసే పార్ట్ టైం టీచర్లను తొలగించడంలో మతలబు ఏంటనేది బహిర్గతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో గురుకుల పాఠశాలల సంస్థ కార్యదర్శులుగా పనిచేసిన వారికి రాని ఇబ్బంది ఇప్పుడు రావడంలో ఆంతర్యం ఏమిటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్ట్ టైం టీచర్లు లేకుండా గురుకులాలు నడవడం అనేది ఒక కల. ఇప్పటికే పిల్లలు పాఠాలు జరగడం లేదని అక్కడక్కడ వారి తల్లిదండ్రులతో పాటు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇది ఇలాగే సాగదీస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల విద్యార్థులు రోడ్లపైకి వస్తే పరిస్థితి వస్తుంది.

ఇంత అన్యాయపు ఆరోపణలా?

రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలో పనిచేసే పార్ట్ టైం టీచర్లు పేరుకే పార్ట్ టైం.. కానీ చేసేది ఫుల్ టైం. వీరు సూపర్ విజన్ డ్యూటీ, నైట్ స్టడీ, నైట్ స్టే డ్యూటీ, ఎస్కార్ట్ డ్యూటీ, హాలిడే డ్యూటీ, మెస్ డ్యూటీ‌లతో పాటు హౌస్ మాస్టర్ డ్యూటీలు రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా పనిచేసి పిల్లల విద్యాభివృద్ధిలో తోడ్పాటు అందించడం జరుగుతుంది. కానీ ఇన్ని డ్యూటీలు చేస్తున్నప్పటికీ, వీరు కేవలం నాలుగు పీరియడ్లు మాత్రమే చెప్పి వెళ్తున్నారని సంస్థ కార్యదర్శి, ఉన్నతాధికారులు పేర్కొనడం చాలా హాస్యాస్పదం. వీరి సేవలను గుర్తించడంలో ఉన్నత అధికారులు విఫలం అవుతున్నారా? లేదా కిందిస్థాయి అధికారులు సరైన సమాచారం అందించడంలో పొరపాటు జరుగుతుందా? అనేది క్షేత్రస్థాయి పరిశీలన చేయాలి.

సమాన వేతనం, భద్రత కావాలి!

ఈ ఎస్సీ గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్ల జీతభత్యాలు, ఇతర గురుకులాల్లోని పార్ట్ టైం టీచర్ల జీతభత్యాల్లో చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి వీరికి సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలి. ఒకవేళ కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో గనుక తీసుకుంటే వీరినే తీసుకుని వారికి న్యాయం చేసి వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున, గురుకుల సంస్థ తరఫున భరోసా కల్పించాలని కోరుతున్నాం.

- కట్ట ప్రశాంత్ కుమార్

90006 10830

Tags:    

Similar News