గ్రేటర్‌లో కారుకు బ్రేకేనా..?
దిశ ప్రతినిధి , హైదరాబాద్: మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది.. 2016 ఎన్నికలలో విజయం సాధించిన సీట్లు నిలుపుకుంటుందా ? అంతకంటే ఎక్కువ డివిజన్లలో విజయకేతనం ఎగురవేస్తుందా ? లేక తగ్గుతాయా అనేది నగర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది . ప్రస్థుత జీహెచ్ఎంసీ పాలక మండలిలో టీఆర్ఎస్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లు ఉన్న విషయం తెలిసిందే. ఐతే ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు టీఆర్ఎస్ చేతిలో ఉన్న […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్: మహా నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుంది.. 2016 ఎన్నికలలో విజయం సాధించిన సీట్లు నిలుపుకుంటుందా ? అంతకంటే ఎక్కువ డివిజన్లలో విజయకేతనం ఎగురవేస్తుందా ? లేక తగ్గుతాయా అనేది నగర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది . ప్రస్థుత జీహెచ్ఎంసీ పాలక మండలిలో టీఆర్ఎస్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లు ఉన్న విషయం తెలిసిందే. ఐతే ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు టీఆర్ఎస్ చేతిలో ఉన్న సీట్లు నిలబెట్టుకోవడం అంతా సులువు కాదనేలా పరిస్థితులు కనబడుతున్నాయి.
చాపకింద నీరులా బీజేపీ….
దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి ఆ విజయమే గ్రేటర్ ఎన్నికలలో టానిక్‌లా పని చేస్తోంది. రోజు రోజుకు బీజేపీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దుబ్బాకలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలు కావడంతో జీహెచ్ఎంసీ ఎన్నికలు 2021 ఫిబ్రవరి తర్వాతనే ఉంటాయని అంతా భావించారు. ఐతే అనూహ్యంగా ఎన్నికలు రావడం ఇతర పార్టీలకు కొంత ఇబ్బందిగా మారినప్పటికీ బీజేపీ మాత్రం గ్రేటర్ ఎన్నికలను టార్గెట్ చేయాలని ముందుగానే నిర్ణయించుకోవడంతో ఆ పార్టీకి కలిసి వస్తోందనే ప్రచారం సాగుతోంది. ఇది బీజేపీ గతంలో కంటే అధిక స్థానాలు గెలుచుకుంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఎంఐఎంతో పొత్తు నిజంగానే ఉండదా …?
ఎంఐఎం పార్టీతో పొత్తు, స్నేహ పూర్వక పోటీ ఉండదని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ప్రకటించడం ఎవరికి లాభం అనే బహిరంగ చర్చలు అంతటా కొనసాగుతున్నాయి. ఎన్నికల వ్యూహంలో భాగంగా చేసిన ప్రకటన అని కొంత మంది అంటుండగా చాలా రోజుల నుండి టీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలోఉందని జరుగుతున్న ప్రచారంతో టీఆర్ఎస్ ఎంఐఎంకు కొంత దూరంగా ఉంటోందని ,ఇది నిజంగానే రెండు పార్టీల మధ్య దూరాన్ని పెంచిందని, దీని ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటుందని రెండు పార్టీల నాయకులు చెబుతున్నారు. టీఆర్ఎస్‌తో అవగాహన ఉన్నా ? లేకున్నా ఎంఐఎంపై ఎలాంటి ప్రభావం ఉండకపోగా టీఆర్ఎస్‌కు మాత్రం నష్టం కల్గించేలా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి.
ఇతర పార్టీల ప్రభావం….
మహానగర పాలక సంస్థ ఎన్నికలలో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, వామ పక్ష పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తుండగా.. జనసేన కమలం పార్టీకే మద్దతు తెలిపింది. ఆయా పార్టీలు ఎన్ని డివిజన్లలో విజయం సాధిస్తాయో తెలియనప్పటికీ గెలిచే అవకాశాలు ఉన్న వారిపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు. గత ఎన్నికలలో జాంబాగ్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన అభ్యర్థి కేవలం 5 ఓట్ల తేడాతో ఓటమి చవి చూశారు. ఈ పర్యాయం కూడా గ్రేటర్ ఎన్నికలలో ఆయా పార్టీలు ఓట్లు చీల్చుకుంటే అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓటమి పాలవుతారని, ఇదే జరిగితే టీఆర్ఎస్ పార్టీ గతంలో గెలిచిన 99 స్థానాలను నిలబెట్టుకోవడం కష్టంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.