ఆర్థిక వ్యవస్థపై కరోనా పిడుగు!
దిశ, వెబ్‌డెస్క్ రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆందోళనకు గురిచేస్తోన్నాయి. చైనాను దాటి ఆయా దేశాల్లో కేసులు నమోదవుతుండటమే దీనికి కారణం. ఈ ప్రభావం దేశీయంగా ఇదివరకే కొనసాగుతున్న మందగమనానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. 2019 డిసెంబర్‌తో ముగిసే మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాలు శుక్రవారం సాయంత్రం వెలువడనున్నాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని గాడిన పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. కొనుగోలు శక్తిని పెంచేందుకు తగిన చర్యలు […]
దిశ, వెబ్‌డెస్క్
రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆందోళనకు గురిచేస్తోన్నాయి. చైనాను దాటి ఆయా దేశాల్లో కేసులు నమోదవుతుండటమే దీనికి కారణం. ఈ ప్రభావం దేశీయంగా ఇదివరకే కొనసాగుతున్న మందగమనానికి మరింత ఆజ్యం పోసినట్టు అయింది. 2019 డిసెంబర్‌తో ముగిసే మూడో త్రైమాసిక జీడీపీ గణాంకాలు శుక్రవారం సాయంత్రం వెలువడనున్నాయి.
దేశీయ ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని గాడిన పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. కొనుగోలు శక్తిని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ సానుకూలంగా మారుతుందని తెలిపారు. అయినా కొంతమంది నిపుణుల అంచనా ప్రకారం మూడో త్రైమాసికంతోపాటు, 2020 జనవరి-మార్చి త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు 5 శాతం దాటే అవకాశం లేదని నమ్ముతున్నారు. 2019 మూడో త్రైమాసికానికి కొందరు నిపుణులు 4.5 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేశారు. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు 5.7 శాతంగా అంచనా వేశారు.
ఇక మార్కెట్ల పరిస్థితి మరింత దిగజారింది. కరోనా వైరస్ అంతర్జాతీయ మార్కెట్లనూ వణికిస్తోంది. ఆయా దేశాల్లో కరోనా కేసులు నమోదవుతుండటంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాలను నమోదు చేస్తున్నాయి. అన్ని రంగాల్లోని షేర్లు అమ్మకాలకు సిద్ధమయ్యాయి. ప్రధానంగా ఉక్కు రంగం అన్నింటి కంటే ఎక్కువ నష్టాలను మూటగట్టుకుంది. భారీ పతనం కారణంగా నిమిషాల వ్యవధిలోనే రూ. 5 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైపోయింది. దీంతో మొత్తం మార్కెట్ మూలధనం రూ. 147.12 లక్షల కోట్లకు దిగజారింది. ఈ వారంలో వరుసగా ఆరు రోజుల నష్టాల కారణంగా మార్కెట్లో రూ. 10.67 లక్షల కోట్ల మదుపర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది.
కరోనా వైరస్‌ను వీలైనంత త్వరగా నియంత్రించకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ముప్పు తప్పదని, ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోలేమని గ్లోబల్ ఈక్విటీ రీసెర్చ్ సంస్థ విశ్లేషించింది. గత వారం కంటే ఈ వారంలో కరోనా వైరస్ ఇటలీ, దక్షిణకొరియా, ఇరాన్ దేశాలకు విస్తరించడం ఈ వైరస్ ఎంత ప్రమాదకరమో సూచిస్తుందని, ఇది మరింత తీవ్రం కాకముందే కట్టడి చేయాలని పేర్కొంది. గతవారం చైనాలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపించాయి. కానీ, ఇతర దేశాల్లో కేసులు పెరగడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు ఎక్కువయ్యాయి. చైనాను దాటి అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. దీన్ని ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అంతేకాకుండా కరోనా కేసులు లక్షకు దగ్గరకు రావడంతో మదుపర్లలో ఆశలు సన్నగిల్లుతున్నాయి. మార్కెట్లతోపాటు రూపాయి మారకం విలువ కూడా యూఎస్ డాలర్‌తో పోలిస్తే 38 పైసలు బలహీన పడి రూ. 71.93 వద్ద కొనసాగుతోంది.