గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ బరిలో హేమాహేమీలు.. గెలిచేదెవరు..?

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లాలో మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాలు కొలువుదీరినప్పటికీ గాంధారి మార్కెట్ కమిటీలో నూతన కమిటీని వేసేందుకు తర్జనభర్జన అవుతున్నారు. ఈ మార్కెట్ కమిటీ బరిలో నిలిచేందుకు హేమాహేమీలు పోటీలో ఉండడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధారి మార్కెట్, మంచి బిజినెస్ ప్రాంతం కావడంతో ఈ కమిటీగిరి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ఆరుతడి పంటలు సాగు చేస్తూ చిరుధాన్యాలు పండించడంలో జిల్లాలోని అగ్రగామిగా గాంధారి […]

Update: 2021-10-12 01:43 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : కామారెడ్డి జిల్లాలో మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గాలు కొలువుదీరినప్పటికీ గాంధారి మార్కెట్ కమిటీలో నూతన కమిటీని వేసేందుకు తర్జనభర్జన అవుతున్నారు. ఈ మార్కెట్ కమిటీ బరిలో నిలిచేందుకు హేమాహేమీలు పోటీలో ఉండడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధారి మార్కెట్, మంచి బిజినెస్ ప్రాంతం కావడంతో ఈ కమిటీగిరి కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ఆరుతడి పంటలు సాగు చేస్తూ చిరుధాన్యాలు పండించడంలో జిల్లాలోని అగ్రగామిగా గాంధారి నిలుస్తుంది. ఇక్కడ పండించిన పంటలు వివిధ ప్రాంతాలకు తరలించడం తో మార్కెట్ కమిటీకి పన్ను రూపంలో భారీ మొత్తంలో ఆదాయం లభిస్తుంది. అధిక ఆదాయం లభించే మార్కెట్ కమిటీకి చైర్మన్ గిరి చేస్తే తమకు ఎప్పటికి గుర్తింపు ఉంటుందనే భావనతో సీనియర్ నాయకులు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు.

చైర్మన్ పదవి కూడా జనరల్ కావడంతో పోటీ మరింత తీవ్రమైంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి మండలంలో రాజకీయం ఎక్కువగా ఉండడంతో ప్రతి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలంటే అధికార పార్టీ ఎమ్మెల్యేకు తలనొప్పి. ఎందుకంటే గాంధారి మండలంలో అత్యధికంగా ఎస్టీ జనాభాతో పాటు లబాన్ లంబాడీలు కూడా అధికంగా ఉండడం కూడా మరో కారణం. గాంధారి మండలంలో అత్యధికంగా మొక్కజొన్న, సోయా,ఆరుతడి పంటలను పండించి రైతులు అధిక దిగుబడులు సాధించి వీటిని మార్కెట్ కు తరలిస్తుంటారు. దీంతో లోకల్ మార్కెట్ కమిటీ ఫీజుల చెల్లింపుతో మార్కెట్ కమిటీకి అధిక ఆదాయం వస్తుంది. దీంతో మార్కెట్ కమిటీ అభివృద్ధి చెందడంలో ముందుంటుంది. కాగా, ఎలాగైనా ఈ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి హేమాహేమీలు పోటీపడుతున్నారు.

ఇప్పటికే ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ పాలకవర్గం కొలువు తీరడం, నూతన పాలక వర్గాన్ని స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ భర్తీ చేయడం జరిగింది. కానీ, గత నెల 15న గాంధారి పాలకవర్గం ముగియడంతో నిజామాబాద్ మార్కెట్ యార్డ్ డిఎంఓ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పదవి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ నూతన కమిటీని నియమించకపోవడంతో స్థానిక నాయకులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ పదవి తమకే దక్కాలని ఎవరికి వారే ఎమ్మెల్యేతో ఉన్న సంబంధాలతో ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ గాంధారి మండల పార్టీ అధ్యక్షుడిగా నియామకం ముగిసిపోవడంతో ఇప్పుడు ఉన్న ఏకైక పదవి మార్కెట్ కమిటీ కావడం, దీనికి తోడు ఈ పదవికి ప్రోటోకాల్ ఉండడంతో ఈ పదవిని తీసుకుంటే రాబోయే ఎలక్షన్ వరకు చైర్మన్ గా కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఈ పదవిని ఎలాగయినా దక్కించుకునేందుకు బరిలో నిలిచే నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

బరిలో నిలిచేది వీరే..

గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ బరిలో పోటీ పడేందుకు తామంటే తామే అని, మేమేం తక్కువ కాదన్నట్టు పోటీ సాగుతుంది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేకు మేము కూడా దగ్గరుండి గెలుపునకు సహకరించామని ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. ఈ పోటీలో ప్రధానంగా మాజీ జెడ్పీటీసీ తానాజీ రావు, ముదెల్లి సింగిల్ విండో మాజీ చైర్మన్ సింగసాని శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త శ్రీకాంత్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ ముకుందరావు, మాజీ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శివాజీ రావు, గాంధారి విండో డైరెక్టర్ సంతోష్ తో పాటు మరో జర్నలిస్ట్ కూడా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వీరితో పాటు గాంధారికి చెందిన బాలయ్య, ప్రస్తుత మాజీ టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, కేసిఆర్ కు దగ్గరి బంధువు సత్యం రావు కూడా ఈ పదవి కోసం బరిలో ఉన్నారు.

పదవి దక్కేదెవరికో..

గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి రేసులో హేమాహేమీలు పోటీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేను ప్రసన్నం చేసుకునేది మాత్రం ఎవరో. ఎమ్మెల్యే జాజాల సురేందర్ గట్టు కిందికి ఇస్తే కనుక ముదెళ్లి సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి లు పోటీ పడుతున్నారు. గాంధారికి వచ్చేసరికి మాజీ జెడ్పీటీసీ తానాజీ రావు ఇప్పటికే జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతుండడంతో మిగతా వారికి అవకాశం వచ్చేలా కనిపిస్తుంది. మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీని జెండా మోసిన వ్యక్తిగా ముకుందరావు మండలంలో ఉన్నారు. ఎమ్మెల్యే సురేందర్ వెంట ఉన్న వారిలో కూడా ఒకరికి అవకాశం వస్తుందేమో అనే ఆలోచనలు ఉన్నాయి.

స్థానిక నేతల అభిప్రాయాల ప్రకారమే..

గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొనడంతో స్థానిక నాయకులు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు సంజీవ్ యాదవ్, జెడ్పీటీసీ శంకర్ నాయక్, ఎంపీపీ రాధా బలరాంతో పాటు మరికొంతమంది అభిప్రాయం తీసుకుని అందరి ఆలోచనతో చైర్మన్ ను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా చైర్మన్ పదవి కోసం మండలంలో తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఎవరికి వారే నువ్వా నేనా అన్నట్టు ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ప్రోటోకాల్ పోస్ట్ కావడంతోనే తీవ్ర పోటీ..

గాంధారి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని దక్కించుకుంటే ప్రోటోకాల్ ఉంటుందని, త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు తామే ఈ పదవిలో ఉండవచ్చు అనే ఆలోచనతో భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఇప్పుడైతే ఎలాంటి సాధారణ ఎన్నికలు లేకపోవడంతో ఎలాగైనా ఈ పదవిని దక్కించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Tags:    

Similar News