రైతు వేదికల నిర్మాణానికి రూ.350 కోట్లు
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో 2,604 రైతు వేదికల నిర్మాణం కోసం వ్యవసాయ శాఖ రూ.350 కోట్ల మేర నిధులను విడుదల చేసింది.ఇందుకు సంబంధించి ఆ శాఖ కార్యదర్శి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు వేర్వేరు పద్దుల కింద ఈ నిధులను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో కేటాయించిన మేరకు మొత్తం రూ.350 కోట్లను ఒకే టర్మ్‌లో విడుదల చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈఓ) […]
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలో 2,604 రైతు వేదికల నిర్మాణం కోసం వ్యవసాయ శాఖ రూ.350 కోట్ల మేర నిధులను విడుదల చేసింది.ఇందుకు సంబంధించి ఆ శాఖ కార్యదర్శి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మూడు వేర్వేరు పద్దుల కింద ఈ నిధులను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో కేటాయించిన మేరకు మొత్తం రూ.350 కోట్లను ఒకే టర్మ్‌లో విడుదల చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారుల (ఏఈఓ) క్లస్టర్ల పరిధిలో 2,604 రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం భావించింది. ఒక్కో రైతువేదిక కనీసం రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏక కాలంలో కనీసంగా 160 మంది రైతులు కూర్చునేందుకు వీలుగా ఉండాలని ఇటీవల ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అందుకు తగిన విధంగా డిజైన్ కూడా తయారైంది. ఒక్కో నిర్మాణానికి రూ.12 లక్షల నుంచి రూ. 20 లక్షల మేర ఖర్చవుతుందని అంచనా. తొలి విడతలో 19 జిల్లాల్లో 958 రైతు వేదికల నిర్మాణం జరగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రైతు వేదికల నిర్మాణాలను 3నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. రాష్ట్రంలో 5 వేల ఎకరాలకు ఒకరు చొప్పున ఏఈవోలు ఉన్నారు. ఏఈవో క్లస్టర్ల పరిధిలో రెండు, మూడు గ్రామాలకు కలిపి ఒక గ్రామంలో రైతు వేదికల నిర్మాణం జరగనుంది. రైతులతో సమావేశం జరపడానికి వేదికగా ఉపయోగపడాలనేది ఈ పథకం ఉద్దేశం. ఇందుకోసం మైకులు, కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలు అవసరం. అవసరమైనప్పుడు ఎరువులు, విత్తనాలు, పంట ఉత్పత్తులను నిల్వ ఉంచుకోడానికి కూడా ఇవి ఉపయోగపడనున్నాయి. రైతుల సమావేశాలు, శిక్షణ, పథకాలపై అవగాహన తదితర పలు రకాల అవసరాలకు ఈ రైతు వేదికలు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు నిధుల విడుదలతో నిర్మాణపు పనులు ఊపందుకోనున్నాయి.