సర్కారు ఖజానాకు ‘మందు’ కిక్కు.. రికార్డు బ్రేక్
దిశ, తెలంగాణ బ్యూరో : మద్యం వ్యాపారానికి ముందే సర్కారు ఖజానాకు భారీ ఆదాయం వచ్చి చేరింది. దరఖాస్తు పత్రాల ద్వారానే రూ. 1208.66 కోట్ల ఆదాయం వచ్చింది. 2019లో నిర్వహించిన టెండర్లలో అప్లికేషన్ ఫారాల ద్వారా రూ. 968.02 కోట్లు వచ్చిన ఆదాయం ఈసారి మాత్రం భారీగా పెరిగింది. మళ్లీ ఈసారి కూడా ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా పోటీ పడ్డారు. ఒక్కో షాపునకు సగటున 48 టెండర్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2620 ఏ4 వైన్‌షాపులకు […]
దిశ, తెలంగాణ బ్యూరో : మద్యం వ్యాపారానికి ముందే సర్కారు ఖజానాకు భారీ ఆదాయం వచ్చి చేరింది. దరఖాస్తు పత్రాల ద్వారానే రూ. 1208.66 కోట్ల ఆదాయం వచ్చింది. 2019లో నిర్వహించిన టెండర్లలో అప్లికేషన్ ఫారాల ద్వారా రూ. 968.02 కోట్లు వచ్చిన ఆదాయం ఈసారి మాత్రం భారీగా పెరిగింది. మళ్లీ ఈసారి కూడా ఖమ్మం జిల్లాలోనే అత్యధికంగా పోటీ పడ్డారు. ఒక్కో షాపునకు సగటున 48 టెండర్లు దాఖలయ్యాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 2620 ఏ4 వైన్‌షాపులకు టెండర్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ షాపులను దక్కించుకునేందుకు చాలా మంది వ్యాపారులు పోటీ పడ్డారు. గురువారం అర్థరాత్రి వరకు కూడా టెండర్ల ప్రక్రియ కొనసాగింది. మొత్తం 60,433 టెండర్లు నమోదయ్యాయి. వీటికి శనివారం లాటరీ తీయనున్నారు. లాటరీ ద్వారా దుకాణాలను ఖరారు చేయనున్న విషయం తెలిసిందే. వచ్చే రెండేండ్లలో ఎన్నికల కోలాహలం ఉండటంతో ఈసారి దుకాణాలకు పోటీ పెరిగింది. అంతేకాకుండా కమీషన్కూడా 10 శాతానికి పెంచారు. దీంతో టెండర్లు వేసేందుకు ఆశావహులు పోటీ పడ్డారు.
రూ.1208 కోట్ల ఆదాయం..
రాష్ట్రంలో మద్యం షాపుల టెండర్లకు విపరీతమైన స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఊహించనంత రెస్పాన్స్ వచ్చింది. గురువారంతో దరఖాస్తుల దాఖలుకు గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పంటపండింది. ఖజానాకు భారీగా కాసుల వర్షం కురిసింది. మద్యం షాపుల లైసెన్సుకు దరఖాస్తులు చేసేందుకు చివరి రోజైన గురువారం రాత్రి 11 గంటల వరకు క్యూలో నిలబడి ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితంగా దరఖాస్తు రూపంలో ఎక్సైజ్ శాఖకు రూ. 1208.66 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 2,620 మద్యం షాపులకు 60,433 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 2017లో ఈ దుకాణాలకు టెండర్ల సమయంలో అప్లికేషన్ ఫీజు రూ. లక్ష ఉండగా.. ఆ ఏడాది రూ. 498 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత 2019లో నూతన మద్యం పాలసీని తీసుకువచ్చారు. అప్లికేషన్ ఫీజు రూ. 2 లక్షలకు పెంచారు. దీంతో అప్లికేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ. 968 కోట్లకు చేరింది. దీంతో ఈ ఏడాది కూడా కొత్త మద్యం పాలసీ వచ్చినా.. అప్లికేషన్ ఫీజును యధాతథంగా ఉంచారు. అయినప్పటికీ తొలి ఆదాయం రూ. 1,208 కోట్లకు చేరింది.
ఖమ్మం ఫస్ట్..
గతంలో మాదిరిగానే.. ఈసారి కూడా ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాలకు పోటీ ఎక్కువగా ఉంది. ఖమ్మం ఎక్సైజ్ డివిజన్‌లో మొత్తం 210 షాపులుండగా.. 10,080 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో షాపునకు సగటున 48 టెండర్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో మద్యం దుకాణాలకు అధికంగా టెండర్లు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే ఒక్కో దుకాణానికి 23 దరఖాస్తుల చొప్పున నమోదయ్యాయి.
ఆఖరి రోజు దండిగా..
మద్యం దుకాణాల టెండర్లకు గురువారం ఆఖరి రోజు కావడంతో అత్యధికంగా దరఖాస్తులు దాఖలయ్యాయి. గురువారం రాత్రి వరకు ఒక్కరోజే 29,743 అప్లికేషన్స్వచ్చాయి.
ఏపీ వ్యాపారుల హవా..
ఈసారి రాష్ట్రంలోని లిక్కర్ షాపులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చాలా మంది మద్యం వ్యాపారులు టెండర్లు వేసినట్టుగా అంచనా వేస్తున్నారు. ఏపీలో సర్కార్ మద్యం షాపులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఏపీకి చెందిన వ్యాపారస్తులు తెలంగాణలో మద్యం షాపులను దక్కించుకోవడానికి బంధువులు, స్నేహితుల ద్వారా టెండర్లు దాఖలు చేశారు. ఏపీలో కొత్త పాలసీ ప్రకారం మద్యం వ్యాపారుల ఆగడాలకు సర్కార్ చెక్ పెట్టినట్లైంది. అక్కడ ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో తమ వ్యాపారాన్ని కొనసాగించాలని ఏపీ మద్యం వ్యాపారస్తులు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే భారీగా టెండర్లు వేసినట్లు తెలుస్తోంది.
ఇక్కడ మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం, పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి కూడా వ్యాపారులు పోటీ పడ్డారు. ముఖ్యంగా సరిహద్దు జిల్లాలలో ఏపీ నుంచి పోటీ ఎక్కువగా ఉంది. ప్రభుత్వమే నేరుగా మద్యం వ్యాపారం చేస్తుండటంతో ఏపీలో స్టాండర్డ్ బ్రాండ్స్ మద్యం దొరకడం లేదు. రాష్టంలో తయారయ్యే ప్రత్యేక బ్రాండ్స్ మద్యాన్ని మాత్రమే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తమకు అలవాటైన బ్రాండ్స్ తెచ్చుకునేందుకు కూడా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో ప్రధానంగా రాష్ట్ర సరిహద్దులలోని షాపులకు ఎక్కువ టెండర్లు వేసినట్లైంది. అందుకే ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల పరిధిలోని దుకాణాలకు ఎక్కువగా నామినేషన్లు వచ్చాయి. ఉదాహరణకు ఏపీలోని కర్నూలుకి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ఏపీకి చెందిన టెండర్లు వేశారు.
రేపు లాటరీ ద్వారా కేటాయింపు..
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో లాటరీ ద్వారా దుకాణాలను అప్పగించేందుకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే, లాటరీలో ఎవరైనా ఎంపికైన తర్వాత ముందుకు రానట్లయితే వారిపై ఐదు లక్షల జరిమానా విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ దుకాణాలు 2023 వరకు ఉంటాయి.
ఏడాది ఆదాయం (కోట్లల్లో) వచ్చిన దరఖాస్తులు
2017 498 ––
2019 968 48,401
2021 1208 60,433.