కాళ్లు మొక్కి… అభివృద్ధి పనులు చేపట్టి.. వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ దృష్టిలో ఇలా..
దిశ ప్రతినిధి, మెదక్/గజ్వేల్: సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజకీయ ఎంట్రీపై చాలా కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కి తెరపడింది. సోమవారం అధికారికంగా తన రాజీనామా లేఖను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కి అందించిన అనంతరం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆది నుండి సీఎం కేసీఆర్‌కు వీర విధేయుడిగా పేరుగాంచడంతో పాటు ప్రభుత్వ ఆశయాలను, పథకాలను సమర్థవంతంగా అమలయ్యేలా పని చేయడంలో దిట్టగా పేరుగాంచారు. ఓ దశలో ప్రతిపక్షాల విమర్శలను సైతం అదే […]
దిశ ప్రతినిధి, మెదక్/గజ్వేల్: సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజకీయ ఎంట్రీపై చాలా కాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ కి తెరపడింది. సోమవారం అధికారికంగా తన రాజీనామా లేఖను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కి అందించిన అనంతరం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆది నుండి సీఎం కేసీఆర్‌కు వీర విధేయుడిగా పేరుగాంచడంతో పాటు ప్రభుత్వ ఆశయాలను, పథకాలను సమర్థవంతంగా అమలయ్యేలా పని చేయడంలో దిట్టగా పేరుగాంచారు. ఓ దశలో ప్రతిపక్షాల విమర్శలను సైతం అదే స్థాయిలో తిప్పికొట్టారు. వాస్తవానికి దుబ్బాక, హూజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో దాదాపు టికెట్ కన్ఫామ్ అయ్యి రాజకీయ భవిష్యత్ కార్యాచరణ అక్కడి నుండే ప్రారంభించాల్సి ఉండగా.. పలు కారణాల నేపథ్యంలో ఆ యత్నానికి బ్రేక్ పడింది. తాజాగా ఎమ్మెల్సీ పదవులకు భారీగా ఖాళీలు ఏర్పడటంతో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించేందుకు అనువైన సమయంగా భావించడంతో పాటు ఎమ్మెల్యే కోటాలో సేఫ్ గా ఎమ్మెల్సీ పదవి పొందచ్చనే భావనే రాజకీయ అరంగేట్రానికి కారణంగా తెలుస్తోంది.
గత కొద్ది రోజులుగా ఫాంహౌజ్ లో ముఖ్యమంత్రితో ఎమ్మెల్సీ హమీపై వెంకట్రామిరెడ్డి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంకట్రామిరెడ్డి ములుగు మండలంలోని కలెక్టర్ అధికారిక గెస్ట్ హౌజ్ ను ఖాళీ చేయడం, అధికారిక కార్యక్రమాలకు పట్ల అంటీముట్టనట్లు వ్యవహరించడం ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఖాయమనే సంకేతాన్ని సూచించింది.
సీఎం దృష్టిలో..
సిద్దిపేట కలెక్టర్ గా భాధ్యతలు అప్పగించిన రోజు నుండే జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు సీఎం ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి అమలు చేశారు. నూతన కలెక్టర్ కార్యాలయ ప్రారంభం రోజున ముఖ్యమంత్రి కాళ్ళు మొక్కిన సమయంలో ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. తండ్రి,గురువు లాంటి పెద్దాయన కేసీఆర్ ఆశీస్సులు తీసుకుంటే తప్పేంటని వెంకట్రామిరెడ్డి ఎదురు ప్రశ్నించారు. నాటి నుండే సీఎం దృష్టిని ఆకర్షించడం మొదలు పెట్టారు. ఇక మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా భూ సేకరణ విషయంలో రైతులను ఒప్పించడం, నిర్వాసితులకు న్యాయం చేయడం, పరిహరం,పునరావాసం అంశంలో తగిన న్యాయం చేయడం, కోర్టుల్లో కేసులను సైతం ధీటుగా ఎదుర్కొని కౌంటర్లు దాఖలు చేయడంతో పాటు డబుల్ బెడ్ రూం పనులు వేగవంతం చేసి నిర్వాసితులను పునరావాసం కల్పించడం లాంటి అంశాలు కేసీఆర్‌ను ఆకర్షించాయి. అలాగే జిల్లా నుండి మంత్రిగా ఉన్న హరీష్ రావుతో సఖ్యత విషయంలోనూ వెంకట్రామిరెడ్డి సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు.
గజ్వేల్ అభివృద్దిపై చెరగని ముద్ర ….
గజ్వేల్ అభివృద్దిపై వెంకట్రామిరెడ్డి కలెక్టర్ గా చెరగని ముద్ర వేశారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా అనతి కాలంలోనే అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని అభివృద్ది పర్చి తెలంగాణ రాష్ట్రానికే తల మానికంగా మారేలా కృషి చేసి సక్సెస్ అయ్యారు. గజ్వేల్ అభివృద్ది పనుల ప్రారంభోత్సవ అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా గజ్వేల్ ఎమ్మెల్యే తాను కాదని, వెంకట్రామిరెడ్డి అంటూ సంభోధించడం గమనార్హం. మిషన్ భగీరథ, గ్రామాల్లో రహదారుల విస్తరణ, గజ్వేల్ రింగు రోడ్డు, కలెక్టరేట్ ను తలపించేలా ప్రభుత్వ కార్యాలయాలకు బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు, మున్సిపల్ కార్యాలయం, ఏకంగా జిల్లా ఆసుపత్రి, మహతి ఆడిటోరియం, కేజీ టూ పీజీ ఎడ్యుకేషన్ హబ్ లు, ఆసియా ఖండంలోనే ఎక్కడా లేని విధంగా వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాలు నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలిపాయి.
తొలి నుండి అధినేతలతో..
వెంకట్రామి రెడ్డి ఆది నుండి ఆయా పార్టీల అధినేతలు, ముఖ్యమంత్రులతో సన్నిహితంగా మెదిలేవారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ముఖ్యమంత్రులు సైతం వెంకట్రామ్ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే వారంటే అతిశయోశక్తి కాదు. గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి ,వైయస్ రాజ శేఖర్ రెడ్డి పులివెందుల నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారిగా పని చేశారు. ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ది పరుగులు పెట్టించి వారి మన్ననలు పొందారు.