నేతల సేవలో తరిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పదవులు శాశ్వతం కాదని తెలిసినా ఎప్పుడో ఒక్కసారి గద్దెనెక్కాలనుకుంటారు రాజకీయ నాయకులు. అయితే ఆ పదవి ద్వారా వచ్చే అధికార దర్పమంటే అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీలు, కేబినెట్ హోదా పదవులంటే అందరికీ మక్కువే. బుగ్గకారుతోపాటు వెనకా ముందు అంగరక్షకులు, ఎస్కార్టు గా పోలీసులు.. ఇలా స్టేటస్ కోసం నాయకులు పరితపిస్తుంటారు. అంతా బాగుంది కాని, తెలంగాణలో తొలి ప్రభుత్వం చివరి రోజుల్లో కేబినెట్ హోదాకు తక్కువగా ఉన్నవారికి ఎస్కార్టుగా […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పదవులు శాశ్వతం కాదని తెలిసినా ఎప్పుడో ఒక్కసారి గద్దెనెక్కాలనుకుంటారు రాజకీయ నాయకులు. అయితే ఆ పదవి ద్వారా వచ్చే అధికార దర్పమంటే అందరూ ఇష్టపడతారు. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీలు, కేబినెట్ హోదా పదవులంటే అందరికీ మక్కువే. బుగ్గకారుతోపాటు వెనకా ముందు అంగరక్షకులు, ఎస్కార్టు గా పోలీసులు.. ఇలా స్టేటస్ కోసం నాయకులు పరితపిస్తుంటారు. అంతా బాగుంది కాని, తెలంగాణలో తొలి ప్రభుత్వం చివరి రోజుల్లో కేబినెట్ హోదాకు తక్కువగా ఉన్నవారికి ఎస్కార్టుగా పోలీసులు ఉండొద్దని, సైరన్ వాడొద్దని, బుగ్గ కార్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏడేండ్లు గడుస్తున్నా ఇందూర్ ఉమ్మడి జిల్లాలో మాత్రం ఎమ్మెల్యేలు తమ అధికార, ఆనధికార పర్యటనలకు బాడీ గార్డులతో పాటు పోలీస్ ఎస్కార్టు లేకుండా అడుగు బయట పెట్డడం లేదు. ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి వచ్చి లోకల్ లో ఉన్నారంటే ఆయా ప్రాంతాల సర్కిల్ ఇన్స్పెక్టర్లతోపాటు లోకల్ ఎస్సైలు హాజరు కావాల్సిందే. దానికి తోడు అధికార, అనధికార పర్యటన సందర్భంగా సైరన్‌తో కూడిన పోలీస్ కాన్వాయ్ ఉండాల్సిందే.
ఎస్కార్ట్ ఉంటే ఎమ్మెల్యే ఉన్నట్లే..
నిజామాబాద్ జిల్లాలో 29, కామారెడ్డి జిల్లాలో 23 స్టేషన్లు ఉండగా, ఆయా పరిధిలోని పోలీసులు అధికార పార్టీ నేతల సేవలో తరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో లేదో కానీ, నిజామాబాద్ జిల్లాలో మాత్రం క్యాంపు కార్యాలయం నుంచీ గెస్ట్ హౌజ్ ల వద్ద అందుబాటులో ఉంటున్నారు. ఎమ్మెల్యేల వెంటే ఉంటూ వారికి ఊడిగం చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు అనుచరులు, సొంతంగా కాన్యాయ్ ఉన్నా పోలీస్ కాన్వాయ్ ఉంటేనే సొసైటీలో గౌరవం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటన సమయంలో అధికారులు పోలీస్స్టేషన్లలో అందుబాటులో ఉండడం లేదనే విమర్శలూ ఉన్నాయి. తెలంగాణలో ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సుప్రీం అని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయ ప్రభావం మిగిలిన విభాగాలు, ప్రభుత్వ శాఖలపై పడిందో లేదో తెలియదు గానీ, పోలీస్‌శాఖపై పడిందని చెప్పవచ్చు. సీఐలు, ఎస్సైలు తమ సర్వీస్ ను పూర్తి చేసుకోవాలన్న, వారు ఆ పోస్టింగ్ లో ఉండాలన్నా ఖచ్చితంగా ఎమ్మెల్యేల లెటర్ ఉండాల్సిందే. పోస్టింగ్ ల కోసం అమ్యామ్యాలు ఇచ్చినా సరే తమ పోస్టింగ్ ఊడకుండా ఉండాలంటే వారంతా నేతల సేవలో తరించాలన్న సూత్రాన్ని సీఐ, ఎస్సైలు ఒంటబట్టించుకున్నారు. అందుకే అధికారుల ఆదేశాలు లేకున్నా పోలీసులు నేతలకు ఎస్కార్టు పోలీసింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
మెమోలు ఇచ్చినా మారడం లేదు…
నిజామాబాద్ జిల్లాలో అనధికారికంగా నడుస్తున్న ఎస్కార్టు వ్యవస్థపై అధికారులు కన్నెర్ర జేసిన సంఘటనలూ అనేకంగా ఉన్నాయి. జిల్లాకు చివరి ఎస్పీగా పనిచేసిన విశ్వ ప్రసాద్ తో పాటు ప్రస్తుత సీపీ కార్తీకేయ పలువురు అధికారులను మందలించారు. మరికొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించే సీఐ, ఎస్సైలకు మెమోలను ఇచ్చినా పరిస్థితుల్లో మార్పు లేదు. ఎమ్మెల్యే సుప్రీం అని సీఎం చెప్పిన తరువాత జిల్లాలో ఎమ్మెల్యేలతో పాటు పలు కార్పొరేషన్ పదవులు అనుభవిస్తున్న వారు చెప్పినట్లు కేసుల నమోదుతో పాటు వారికి నచ్చినట్లు వ్యవహరిస్తూ ఆగ్రహనికి గురికాకుండా వారి సేవలో నిమగ్నమవుతున్నారని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలో గతంలో లాగా మావోయిస్టుల కదలికలు లేకున్నా ఎమ్మెల్యేలకు ఎస్కార్టు కల్పించడంపై విమర్శలు వస్తున్నాయి. అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాత్రం ఎంపీ, ఎమ్మెల్సీలకు మాత్రం ఎలాంటి ఎస్కార్టును ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. నిజామాబాద్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో, కామారెడ్డి జిల్లాల్లోని మరో నియోజకవర్గంలో పోలీస్‌శాఖ వారి కుటుంబ సభ్యులు ఎస్కార్టు తో తిరగడంపై ఆరోపణలు ఉన్నాయి. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి నెలకొంది.