నిధులన్నీ ఫ్రిజింగ్.. రూ.లక్ష కావాలన్నా ప్రగతి భవన్ వెళ్లాల్సిందే..!
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మళ్లీ ఖాళీ అయింది. ట్రెజరీలో ముఖ్యమైన బిల్లుల చెల్లింపులకు కూడా బ్రేక్ పడింది. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్, లీవ్ ఎన్ క్యాష్‍మెంటు బిల్లుల చెల్లింపులకు ట్రెజరీలో చెల్లింపులు జరగటం లేదు. రాష్ట్రం మొత్తంగా అభివృద్ధి పనుల బిల్లులు పేరుకుపోయాయి. దాదాపు ఏడాదిన్నర నుంచే పలు బిల్లులు ఆగిపోగా… ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మళ్లీ కిందిస్థాయి బిల్లులు కూడా నిలిపివేశారు. మరోవైపు […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మళ్లీ ఖాళీ అయింది. ట్రెజరీలో ముఖ్యమైన బిల్లుల చెల్లింపులకు కూడా బ్రేక్ పడింది. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్, లీవ్ ఎన్ క్యాష్‍మెంటు బిల్లుల చెల్లింపులకు ట్రెజరీలో చెల్లింపులు జరగటం లేదు. రాష్ట్రం మొత్తంగా అభివృద్ధి పనుల బిల్లులు పేరుకుపోయాయి. దాదాపు ఏడాదిన్నర నుంచే పలు బిల్లులు ఆగిపోగా… ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మళ్లీ కిందిస్థాయి బిల్లులు కూడా నిలిపివేశారు.
మరోవైపు కొన్ని పనులు, అత్యవసరాల కోసం ఇప్పటి వరకు రూ. 2 కోట్ల వరకు బిల్లులు చెల్లించే అంశంపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకునే వెసలుబాటు ఉన్నా… కొద్దికాలంగా కనీసం లక్ష రూపాయల బిల్లు కూడా ప్రగతిభవన్ నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ నుంచి క్లియరెన్స్ వస్తేనే బిల్లు పాసవుతోంది. ఇప్పుడు క్లియరెన్స్ ఇచ్చేందుకు సీఎం కూడా అందుబాటులో లేకపోవడంతో బిల్లులన్నీ ఆగిపోయాయి.
ఇప్పుడు రాష్ట్రంలోని సాగునీటిపారుదల శాఖతో పాటు రోడ్లు, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీ, పంచాయతీ రాజ్ విభాగాల్లో పనుల బిల్లులన్నీ బకాయి ఉన్నాయి. ప్రస్తుత నేపథ్యంలో ఈ పనులకు బిల్లులు చెల్లించరాదంటూ ఏకంగా ప్రగతిభవన్ నుంచి ఆదేశాలిచ్చినట్లు అధికారవర్గాల్లో చర్చ. కొన్ని బిల్లులకు టోకెన్లు జారీ చేసినా నగదు మాత్రం రావడం లేదు. ఏడాదిన్నర నుంచి టోకెన్లు తీసుకుని బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు.
11 వేల చెక్కులు… రూ. 19 వేల కోట్లు
ప్రస్తుతం రాష్ట్రంలో ఆయా విభాగాల్లో రూ. 17 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారవర్గాల సమాచారం. నీటిపారుదల శాఖలో రూ. 14 వేల కోట్లు, ఆర్‌అండ్‌బీలో రూ. 1200 కోట్లు, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీల్లో రూ.1000 కోట్లు, పంచాయతీరాజ్‌లో రూ. 900 కోట్లు, మిషన్ భగీరథ పనులకు సంబంధించిన రూ. 800 కోట్లు… ఇలా మొత్తం రూ. 19 వేల కోట్ల బిల్లులు బాకీ పడినట్లు చెప్పుతున్నారు.
మరోవైపు కొన్ని ముఖ్యమైన పనులు, కీలకమైన బిల్లులు ట్రెజరీకి వెళ్లి కూడా ఆగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ట్రెజరీ కార్యాలయాల్లో మొత్తం 11 వేల చెక్కులు ఆగిపోయినట్లు సమాచారం. చెల్లింపుల కోసం అన్నీ అనుమతులు తీసుకుని చెక్కులు ట్రెజరీల్లో జమ చేసినా అక్కడ నుంచి తిరిగి రావడం లేదు.
పంచాయతీల్లో మరీ ఘోరం
రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలకు సంబంధించి మార్చి రెండో వారం నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ. 1300 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి సంబంధించిన చెక్కులన్నీ సిద్ధమయి ట్రెజరీకి వెళ్లాయి. కానీ ట్రెజరీల నుంచి మాత్రం బయటకు రావడం లేదు. పంచాయతీల ఖాతాల్లో పల్లె ప్రగతి నిధులు కనిపిస్తున్నా వాటిని విడుదల చేసుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం వాటిపై ఫ్రీజింగ్ విధించింది. వీటితో పాటుగా ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, హరితహారం వంటి పనుల బిల్లులు కూడా ఆపేశారు. కొన్నిచోట్ల పనులు చేసిన సర్పంచ్‌లు వీటికోసం తిరుగుతూనే ఉన్నారు. పంచాయతీలకు సంబంధించిన మొత్తం రూ. 1300 కోట్ల బిల్లులకు బ్రేక్ వేశారు.
ట్రాక్టర్ల చెక్కులు కూడా రిటర్న్
మరోవైపు పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్లు తీసుకున్నారు. వీటికి ఈఎంఐలు చెల్లించాల్సి ఉండగా… దాదాపు రూ. 80 కోట్ల చెక్కులు మళ్లీ వాపసు వచ్చాయి. దీంతో సదరు ఫైనాన్స్ కంపెనీలు పంచాయతీరాజ్ కమిషనర్‌కు లేఖ పంపించినట్లు అధికారులు చెప్పుతున్నారు. ఈ చెక్కులు వాపసు రావడంతో గ్రామ పంచాయతీల పాలకవర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ట్రాక్టర్ల ఈఎంఐలు సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శుల పేర్లతో ఉన్నాయి. దీంతో వారికి సైతం నోటీసులు జారీ అవుతున్నాయి.
పనులన్నింటికీ బ్రేక్
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ. 19వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో ఆయా శాఖల్లో పనులకు బ్రేక్ వేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అయితే మొత్తం ప్రధాన పనులు ఆపేశారు. సీసీరోడ్లు, ఇంటిగ్రేటేడ్ మార్కెట్లు, నీటి సరఫరా వ్యవస్థ వంటి పనులకు కూడా బ్రేక్ వేశారు. ఇక గ్రామాల్లో ఏ పనులు చేయడం లేదు. సర్పంచ్‌లు పనులు చేద్దామంటూ బిల్లులు రాకపోవడంతో పనులంటేనే భయపడుతున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పనులకు బ్రేక్ పడింది.