దేశద్రోహి పార్టీ మజ్లిస్.. ఆ పార్టీకి ఓటు వేస్తారా? బండి సంజయ్ సంచలన కామెంట్స్
శాసన మండలి ఎన్నికల్లో దేశ ద్రోహ పార్టీ అయిన మజ్లిస్ పార్టీకి, దేశభక్తుల పార్టీ అయిన బీజేపీ పార్టీకి యుద్ధం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: శాసన మండలి ఎన్నికల్లో దేశ ద్రోహ పార్టీ అయిన (Majlis party) మజ్లిస్ పార్టీకి, దేశభక్తుల పార్టీ అయిన బీజేపీ (BJP) పార్టీకి యుద్ధం జరుగుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్‌లో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేశద్రోహ పార్టీకి మజ్లిస్‌కు ఓటు వేస్తారా? లేక దేశభక్తి, సనాతన ధర్మం గురించి ఆలోచించే బీజేపీ పార్టీకి ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీని గెలిపించడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని మజ్లిస్‌కు అప్పగించేందుకు రెండు పార్టీలు పోటి పడుతున్నాయని, అందుకే ఇద్దరు పోటీలో లేరన్నారు. బీఆర్ఎస్ పార్టీని కేసుల నుంచి కాపాడేది కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1కు తప్ప అందరికీ బెయిల్ వచ్చిందని వివరించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బియ్యాన్ని బీజేపీ పార్టీ అందిస్తోందని చెప్పారు. అనేక కేంద్ర సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేసే పరిస్థితి లేదన్నారు. కానీ కేంద్ర వెనకడుగు వేయకుండా తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తోందన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ భృష్టి పట్టిస్తోందని, ఆరు గ్యారంటీలను గాలికొదిలేసి ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి, మంత్రులకు పాలనపై పట్టు లేకుండా పోయిందన్నారు. రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. మంత్రి వర్గ విస్తరణ ఏఐసీసీ నిర్వహిస్తోందంటే రబ్బర్ స్టాంప్‌గా ఏవిధంగా మారిందో అర్థం చేసుకోవాలన్నారు.
జాతీయ పార్టీ కాబట్టి కొన్ని సూచనలు తీసుకోవచ్చని, కానీ కేబినెట్ విస్తరణ నిర్ణయిస్తుందని పీసీసీ చీఫ్ చెప్పడం పాలన ఎవరి చేతిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా హెచ్‌సీయూ విషయంలో మంత్రుల కమిటీ వేశారని, ఆ మంత్రులు ఏమి చేయాలో పీసీసీ ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ సూచనలు ఇస్తారంట.. దీంతో రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణలో కొనసాగుతోంది. సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని ఆరోపించారు. అవినీతి పాలన నడుస్తోందని, ఢిల్లీకి మూటలు పంపుతున్నారని, అన్నిట్లో కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ పాలనలో అభివృద్ధి కొనసాగుతోందని, 11 ఏళ్లుగా అవినీతి లేకుండా ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ తీసుకొస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.