ఈ నెల 5 నుంచి ఉచిత బియ్యం పంపిణీ

దిశ, తెలంగాణ బ్యూరో: రేషన్‌కార్డ్ దారులందరికి ఈ నెల 5 నుంచి ఉచితంగా 20కిలోల బియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాల చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఉచిత బియ్యం పంపిణీపై పౌరసరఫరాల భవన్లో పీడీఎస్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. 4వ తేదీలోగా అన్ని గోదాముల నుంచి రేష‌న్ షాపుల‌కు బియ్యాన్ని త‌ర‌లించాల‌ని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రేషన్ బియ్యం ర‌వాణా జ‌ర‌గ‌డం లేద‌ని ఆలస్యమయ్యేందుకు గల కారణాలను […]

Update: 2021-06-03 09:01 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రేషన్‌కార్డ్ దారులందరికి ఈ నెల 5 నుంచి ఉచితంగా 20కిలోల బియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాల చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గురువారం ఉచిత బియ్యం పంపిణీపై పౌరసరఫరాల భవన్లో పీడీఎస్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. 4వ తేదీలోగా అన్ని గోదాముల నుంచి రేష‌న్ షాపుల‌కు బియ్యాన్ని త‌ర‌లించాల‌ని అధికారులకు ఆదేశించారు.

ప్రభుత్వం ఆశించిన స్థాయిలో రేషన్ బియ్యం ర‌వాణా జ‌ర‌గ‌డం లేద‌ని ఆలస్యమయ్యేందుకు గల కారణాలను వివరించాలని అధికారులను ఆదేశించారు. ఉచితంగా అందిస్తున్న బియ్యం కోసం పేదలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు తీసుకురావద్దని హెచ్చరించారు. ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లతో మాట్లాడి అదనపు వాహనాలను సమకూర్చి రవాణాను వేగవంతం చేయాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలను జాయింట్ కమిషనర్ పర్యవేక్షించాలని, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలను డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షించాలని సూచించారు.

బియ్యం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని అధికారులకు తెలిపారు. ఉచిత బియ్యం పక్కదారి పట్టకుండా అర్హులైన పేదలకు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉద‌యం 6 నుంచి మ‌. 2 గంట‌ల వ‌ర‌కు ఉచిత బియ్యం పంపిణీ చేపట్టాలని సివిల్ సప్లే అధికారులకు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో రేషన్‌షాపుల వద్ద ఎక్కువ మొత్తం లబ్ధిదారులు గుమికూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రేషన్ దుకాణాల దగ్గర పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు.

బియ్యం పంపిణీ చేశాక మిగిలిన గన్నీ సంచులను తప్పని సరిగా పౌరసరఫరాల సంస్థకు విక్రయించాలని రేషన్ డీలర్లను ఆదేశించారు. జూన్‌లో ఉచిత బియ్యం పంపిణీ వల్ల 80 లక్షల గన్నీ సంచులు డీలర్ల దగ్గర మిగిలిపోనున్నాయ‌ని, ఈ గన్నీ సంచులను పౌరసరఫరాల సంస్థకు విక్రయించేలా అదనపు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ నుండి ఒక్కో గన్నీ సంచి ధరను రూ.18 నుండి రూ.21కి పెంచడం జరిగిందని తెలిపారు.

రేషన్ డీలర్లు గన్నీ సంచులను పౌరసరఫరాల సంస్థకు అప్పగించిన తరువాత వారం రోజుల్లో చెల్లింపులు జరపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ ఉషారాణి, డిప్యూటీ కమిషనర్ పద్మజ, అసిస్టెట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ రాజారెడ్డి, పీడీఎస్ డిప్యూటీ మేనేజర్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News