మాజీ ఎంపీ ‘పొన్నం’ సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ డైరెక్షన్‌లోనే ‘బండి’ యాత్ర
దిశ, హుస్నాబాద్ : బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు పదేళ్ల క్రితమే విద్యా (ఫీజు రీయింబర్స్ మెంట్) వైద్యం (ఆరోగ్యశ్రీ) వంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందన్నారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ గల్లీలో కేసీఆర్ అవినీతిపరుడు, నరరూప రాక్షసుడు, దుర్మార్గుడు అయన్ను జైలుకు పంపిస్తామని ఊకదంపుడు ముచ్చట్లు చెప్పడమే, కానీ చేతల్లో […]
దిశ, హుస్నాబాద్ : బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలకు పదేళ్ల క్రితమే విద్యా (ఫీజు రీయింబర్స్ మెంట్) వైద్యం (ఆరోగ్యశ్రీ) వంటి పథకాలను కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందన్నారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ గల్లీలో కేసీఆర్ అవినీతిపరుడు, నరరూప రాక్షసుడు, దుర్మార్గుడు అయన్ను జైలుకు పంపిస్తామని ఊకదంపుడు ముచ్చట్లు చెప్పడమే, కానీ చేతల్లో చూపించడం లేదని విమర్శించారు. బండి సంజయ్ గల్లీలో తిరిగితే సీఎం కేసీఆర్ ఢిల్లీలో తిరుగుతూ బీజేపీ నాయకులతో సమావేశం అవుతున్నారని ఆరోపించారు.
ప్రధాని మోడీ జిల్లాకో ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేస్తామని చెప్పినప్పటికీ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్‌కు మెడికల్ కాలేజ్ తీసుకురాని అసమర్ధుడు సంజయ్ అన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలకు, నిరుద్యోగులకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలుస్తానని గొప్పలు చెప్పిన సంజయ్ కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం చేసిందో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 80 శాతం ఉన్న హిందువుల పక్షాన మాట్లాడితే సెక్యులరిజం పార్టీలని భావోద్వేగానికి లోనై మొసలి కన్నీరు కారుస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్ని నిధులు వెచ్చించి అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేని 30 యాక్టు అమలు.. కేవలం సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేటలో అమలవుతుందన్నారు. బీజేపీ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ హుస్నాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేయడంతో రవాణా వ్యవస్థకు ఆటంకం కలుగుతుందని, తెలిసినా అధికారులు అనుమతి ఇచ్చారన్నారు. సభ సమావేశం ఇచ్చిన సమయాని కంటే నాలుగు గంటలు ఆలస్యంగా జరిగినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ప్రజా సంగ్రామ ముగింపు యాత్ర సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే జరగడంతో అధికారులే దగ్గరుండి సభను నడిపించడం సిగ్గుచేటన్నారు.