రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్.. తమ్ముడి కోసం ‘గుత్తా’ కొత్త స్కెచ్
దిశప్రతినిధి, నల్లగొండ : శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. ఆయన ఎమ్మెల్సీ కాలం ముగిసి దాదాపు రెండు నెలలు పూర్తయ్యింది. అప్పటి నుంచి ఆయన్ను సీఎం కేసీఆర్ మరోసారి ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలు మారుతుండటం.. ఫలితంగా ఎమ్మెల్సీగా రెన్యూవల్ అవ్వడం వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తారనే ప్రచారం పెద్దఎత్తున […]
దిశప్రతినిధి, నల్లగొండ : శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. ఆయన ఎమ్మెల్సీ కాలం ముగిసి దాదాపు రెండు నెలలు పూర్తయ్యింది. అప్పటి నుంచి ఆయన్ను సీఎం కేసీఆర్ మరోసారి ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఎప్పటికప్పుడు రాజకీయ పరిణామాలు మారుతుండటం.. ఫలితంగా ఎమ్మెల్సీగా రెన్యూవల్ అవ్వడం వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి నాగార్జునసాగర్ ఉపఎన్నికలో పోటీ చేస్తారనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తానంటూ ప్రకటించారు. కానీ ఆ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అధిష్టానం నోముల భగత్ వైపు మొగ్గుచూపింది. ఆ తర్వాత గుత్తాను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేస్తారని ఊహాగానాలు ఉన్నప్పటికీ హుజురాబాద్‌లో ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి జంప్ చేసిన కౌశిక్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ గవర్నర్‌కు పంపడంతో ఆ ఆశ కాస్త గల్లంతయ్యింది. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి తన రూటును మార్చడం గమనార్హం.
గుత్తా బ్రదర్స్ చేతుల్లో ‘నార్మాక్స్’ బంధీ..
వాస్తవానికి మాజీ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాజకీయ వ్యవహార శైలి ఇతర నాయకులకు పూర్తి భిన్నం. ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ రాజకీయ నేతల్లో గుత్తా ఒకరు. ఆయన తన రాజకీయ జీవితాన్ని గ్రామపంచాయతీ పాలకవర్గం నుంచి మొదలుపెట్టి ఏకంగా శాసనమండలి చైర్మన్ వరకు సాగారు. మధ్యలో ఎంపీగా, ఎమ్మెల్సీగా, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు పలు పదవులను అధిరోహించారు. ఇదిలావుంటే.. గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు గుత్తా జితేందర్ రెడ్డి సైతం యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉంటూనే వచ్చారు. కానీ ఆయన నల్లగొండ- రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం(నార్మాక్స్) చైర్మన్ గానే మంచి గుర్తింపు వచ్చింది. నార్మాక్స్ అంటే గుత్తా.. గుత్తా అంటే నార్మాక్స్ అనే స్థాయిలో ఆ సంఘం జితేందర్ రెడ్డి గుప్పిట్లోకి చేరిందని చెప్పాలి. నార్మాక్స్‌లో ఏ పని జరగాలన్నా.. గుత్తా జితేందర్ రెడ్డిదే పైచేయి అన్నట్టుగా మారింది. నార్మాక్స్‌ను గుత్తా జితేందర్ రెడ్డి అంతలా ప్రభావితం చేయడం వెనుక గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమేయమే కారణమన్న సంగతి అందరికీ తెలిసిందే.
మరోసారి నార్మాక్స్ దక్కించుకునేందుకేనా..
ప్రస్తుతం నార్మాక్స్ సహకార ఎన్నికలు జోరుగా సాగుతున్నాయి. మొదటగా డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది. తదనంతరం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. అయితే చైర్మన్ ఎన్నికలో గుత్తా బ్రదర్స్‌దే కీలక పాత్ర. వాస్తవానికి ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. నార్మాక్స్ మాత్రం గుత్తా బ్రదర్స్ చేతుల్లోనే ఉంటుందనే ప్రచారం లేకపోలేదు. అందుకు అనుగుణంగానే గుత్తా జితేందర్ రెడ్డి చాలా ఏండ్లుగా చైర్మన్ పదవిలో కొనసాగుతూ వచ్చారు. కానీ ఇటీవల కాలంలో గుత్తా బ్రదర్స్‌కు జిల్లాలో కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వాటిని రాజకీయంగా అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ గుత్తా వర్గీయులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి నార్మాక్స్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఉండటంతో సోదరుడు జితేందర్ రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టేందుకు గుత్తా సుఖేందర్ రెడ్డి రంగంలోకి దిగారనే చెప్పాలి. ఆ ఎన్నిక కోసమే వీలు చిక్కినప్పుడల్లా సీఎం కేసీఆర్ మెప్పు పొందడం కోసం ప్రెస్‌మీట్లు పెడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి గుత్తా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల కాలంలో ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతుండటం గమనార్హం. ఇంతకీ మరోసారి గుత్తా బ్రదర్స్ నార్మాక్స్‌ను చేజిక్కించుకుంటారా..? లేదా అన్నది వేచి చూడాల్సిందే.