నల్లగొండ టీఆర్ఎస్ పీఠంపై రసవత్తర చర్చ.. అనూహ్యంగా తెరపైకి వేముల!!

దిశ ప్రతినిధి, నల్లగొండ: అధికార టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే ఓవైపు నార్మాక్స్ ఎన్నికలు.. మరోవైపు టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలతో రాజకీయం వేడెక్కింది. అయితే నల్లగొండ టీఆర్ఎస్ అధ్యక్ష పీఠం వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. జిల్లా అధ్యక్ష పీఠం రేసులో నిన్నమొన్నటి వరకు ప్రధానంగా పలువురి పేర్లు విన్పించాయి. అయితే అనుహ్యంగా నల్లగొండ జిల్లా అధ్యక్ష పీఠం రేసులోకి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం […]

Update: 2021-09-25 04:12 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ: అధికార టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటికే ఓవైపు నార్మాక్స్ ఎన్నికలు.. మరోవైపు టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలతో రాజకీయం వేడెక్కింది. అయితే నల్లగొండ టీఆర్ఎస్ అధ్యక్ష పీఠం వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. జిల్లా అధ్యక్ష పీఠం రేసులో నిన్నమొన్నటి వరకు ప్రధానంగా పలువురి పేర్లు విన్పించాయి. అయితే అనుహ్యంగా నల్లగొండ జిల్లా అధ్యక్ష పీఠం రేసులోకి నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వచ్చారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం నుంచి పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చిన వేముల వీరేశానికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తే.. పార్టీ బలోపేతం అవుతుందనే చర్చ క్షేత్రస్థాయి కార్యకర్తల్లో నెలకొంది. ఇదే జరిగితే.. నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ రాజకీయ పరిస్థితులు కీలక మలుపు తిరగనుందనే ప్రచారం సాగుతోంది. అయితే నిజంగానే వేముల వీరేశానికి టీఆర్ఎస్ జిల్లా సారథ్య బాధ్యతలను అప్పగిస్తారా? లేదా? అన్నది వేచిచూడాల్సిందే.

ఉద్యమ నేపథ్యం.. ఎస్సీ సామాజిక వర్గం..

నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. అప్పటివరకు మావోయిస్టు నేతగా గుర్తింపు ఉన్న వీరేశం.. నకిరేకల్ గడ్డమీద ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేశారు. ఉద్యమ పరంగానే కాకుండా టీఆర్ఎస్ పార్టీ పరంగానూ క్రీయాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. జిల్లాలో ఏ ఎన్నిక జరిగినా.. అక్కడ తనదైన ముద్ర వేశారు. ఈ నేపథ్యంలో పలు అంశాల్లో వివాదస్పదంగానూ మారారు. ఈ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం జిల్లా టీఆర్ఎస్ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీ గ్రామస్థాయిలో బలోపేతం అవుతుందని, జిల్లాలోని నేతలందరినీ సమన్వయం చేసుకోవడంలో వీరేశం సఫలీకృతమవుతారని పార్టీ కేడర్ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఇదిలావుంటే.. టీఆర్ఎస్ ఏర్పడిన నాటి నుంచి ఓసీలే ఎక్కువ కాలం జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వేముల వీరేశానికి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ ఎక్కువగా విన్పిస్తోంది. దీంతో జిల్లా సారథ్య బాధ్యతలు స్వీకరించేందుకు వేముల వీరేశానికి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యానికి తోడు ఎస్సీ సామాజిక వర్గం బలంగా మారనుంది.

జిల్లా రాజకీయాల్లో కీలక మలుపు..

ప్రస్తుతం జరుగుతున్న టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు జిల్లా రాజకీయాల్లో కీలకం కానున్నాయి. ఎందుకంటే.. ఉమ్మడి నల్లగొండ జిల్లా గత ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్‌‌ పార్టీకి కంచుకోటగా ఉండేది. దీనికితోడు నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పట్టు సాధించాలంటే.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వంటి వారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందనే చెప్పాలి. జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు తమ ఉనికి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కోమటిరెడ్డి వర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పాలి. అలాంటి మూలాల్ని దాటి వెళ్లాలంటే.. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి ప్రజలతో పాటు రాజకీయాల్లో మంచిపట్టు ఉన్న వ్యక్తి జిల్లా అధ్యక్షుడు కావాల్సిన అవసరం ఉంది. జిల్లాలో ప్రతిపక్ష పార్టీలను గట్టిగా ఎదుర్కొవాలన్నా.. టీఆర్ఎస్‌లో అసంతృప్తి నేతలను బుజ్జగించాలన్నా.. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశానికి జిల్లా బాధ్యతలు అప్పగిస్తే మంచి ఫలితాలు ఉంటాయని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Tags:    

Similar News