పార్టీమారే యోచనలో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్..

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: వ్యూహాత్మకంగా పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారని భావిస్తున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​ టీఆర్​ఎస్ కు ​గుడ్​బాయ్​ చెప్పే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నా గుర్తింపు లేకపోగా వెక్కిరింపులు ఎదురవుతున్నాయని ఆయన తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇటీవల జరిగిన పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్ సంగారెడ్డి పర్యటన తరువాత ఆవేదన మరింత తీవ్రమైంది. టీఆర్ఎస్​కు బద్ద శత్రువైన కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని […]

Update: 2021-12-21 02:46 GMT

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: వ్యూహాత్మకంగా పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారని భావిస్తున్న సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​ టీఆర్​ఎస్ కు ​గుడ్​బాయ్​ చెప్పే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నా గుర్తింపు లేకపోగా వెక్కిరింపులు ఎదురవుతున్నాయని ఆయన తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇటీవల జరిగిన పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్ ​కేటీఆర్ సంగారెడ్డి పర్యటన తరువాత ఆవేదన మరింత తీవ్రమైంది. టీఆర్ఎస్​కు బద్ద శత్రువైన కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కేటీఆర్​ సభా వేదికలపై పొగడడాన్ని ప్రభాకర్​ జీర్ణించుకోలేకపోతున్నారు. జగ్గారెడ్డి అభ్యర్థతన తోనే సంగారెడ్డికి సీఎం కేసీఆర్​ మెడికల్​ కళాశాల మంజూరు చేశారని కేటీఆర్​ పేర్కొనడాన్ని చింతా ప్రభాకర్​తో పాటు టీఆర్​ఎస్​ శ్రేణులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా నియోజకవర్గంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న తమకు కనీస గౌరవం ఇవ్వకుండా జగ్గారెడ్డితో కేటీఆర్​ అత్యంత సన్నిహితంగా మెలగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఏం జరుగుతుందో ఏమో కానీ గత కొద్ది రోజులుగా మంత్రి హరీష్​రావు కూడా సంగారెడ్డిపై పెద్దగా దృష్టి సారించడం లేదని ప్రభాకర్​బాధపడుతున్నారు.

కార్యక్రమాలకు రావడానికి కూడా ఉత్సాహం చూపించడం లేదని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డికి టీఆర్​ఎస్​ నుంచి సపోర్టు ఉన్నదని, ఈ క్రమంలోనే ఆయన ఆగడాలు సాగుతున్నాయని భావిస్తున్నారు. జగ్గన్నా మా ఎంపీ, ఎమ్మెల్యేలను బాగా చూసుకోవాలని స్వయంగా కేటీఆరే జనంలో అనడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని చింతా ప్రభాకర్​తో పాటు సన్నిహితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్​ అలా అనడంతో స్థానికంగా జనంలో ఉండే తమకు అవమానంగా ఉండదా..? అని టీఆర్​ఎస్​ జిల్లా నేత ఒకరు ‘దిశ’ ప్రతినిధితో మండిపడ్డారు. జగ్గారెడ్డిని పార్టీలోకి తీసుకుంటే తీసుకోండి. ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుతో రాబోయే రోజుల్లో పార్టీకి తీవ్ర నష్టం తప్పదని అధికార పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘చావుడప్పు’కు దూరం

పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ వ్యాఖ్యలు, పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుతో తీవ్ర మనోవేదన చెందిన మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​ చావుడప్పు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ‘చావుడప్పు’ పేరుతో టీఆర్​ఎస్​ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేంద్ర వైఖరిపై నిరసన కార్యక్రమాలు జరిగాయి. సంగారెడ్డి నియోజకవర్గంలో మాత్రం నామమాత్రంగా మమా అనిపించారు. సంగారెడ్డి పట్టణంలో ఒకరిద్దరు నాయకులు రోడ్డుపైకి అలా వచ్చి నిరసన తెలిపి ఇలా వెళ్లిపోయారు. చింతా ప్రభాకర్​తో పాటు పార్టీకి చెందిన ముఖ్య నాయకులెవరూ చావుడప్పు కార్యక్రమంలో పాల్గొనకపోవడం గమనార్హం. పార్టీ కార్యక్రమం అంటేనే పార్టీ శ్రేణుల్లో ఆసక్తి కనిపించడం లేదు. ముఖ్య నేతలు ఎవరూ కూడా కనిపించడం లేదు. పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదని ఓ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. జగ్గారెడ్డిని పార్టీ అధిష్టానం పెంచి పోషిస్తున్నదని, కేటీఆర్​ పర్యటనతో ప్రతి కార్యకర్తకు అర్థం అయిపోయిందని ఆయన మండిపడ్డారు. రాజకీయంగా ఎవరి దారి వారు చూసుకోవడమే బెటర్​ అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ​

సన్నిహితులతో సమాలోచనలు

మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​ పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తనతో పాటు పార్టీ శ్రేణులంతా అధిష్టాన వైఖరిపై తీవ్ర ఆగ్రహంతోనే ఉన్నారు. మూడేళ్ల క్రితమే చేనేత, జౌళి అభివృద్ధి సంస్థ చైర్మన్​ ఇస్తామని స్వయంగా తానే ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్​ నెరవేర్చలేదు. పదవి ఇవ్వకపోగా పొమ్మనలేక పొగపెడుతున్నారు. అధికార కార్యక్రమాల్లో తమ పరువు​ తీయడానికే ప్రతిపక్ష ఎమ్మెల్యేను ఆకాశానికెత్తుతున్నారని ప్రభాకర్​ ఆవేదన చెందుతున్నారు. ఇందులో భాగంగానే గత మూడు రోజులుగా స్థానికంగా అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో ప్రభాకర్​ చర్చిస్తున్నట్లు సమాచారం.

ఏం చేద్దాం..? ఎలాంటి నిర్ణయం తీసుకుందాం..? పార్టీ మారుదామా..? ఏ పార్టీలోకి వెళ్దాం..? అనే అంశాలను నాయకులు, కార్యకర్తలను అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అయితే ఇలాంటి వైఖరితో ఉన్న పార్టీలో ఉండడం కంటే వెళ్లిపోవడమే మంచిదనే అభిప్రాయం ఎక్కువ మంది నుంచి వచ్చినట్లు తెలిసింది. జగ్గారెడ్డిని టీఆర్​ఎస్​లోకి తీసుకునే ఉద్దేశంతోనే కేటీఆర్​ ఆయనతో సన్నిహితంగా ఉన్నారని అభిప్రాయపడుతున్నారు. ఇంత కాలం జగ్గారెడ్డితో కొట్లాడి మళ్లీ ఆయన చేతికింద పనిచేయాలా..? అంటూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. జగ్గారెడ్డిని టీఆర్​ఎస్​లోకి తీసుకుని మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు కూడా పలువురు నాయకులు అనుకుంటున్నారు. జగ్గన్నా మా ఎంపీ, ఎమ్మెల్యేలను బాగా చూసుకోవాలని అందరి ముందు కేటీఆర్​ అనడంలో అర్థం అదేనని పార్టీ నాయకులు భావిస్తున్నారు. సంగారెడ్డిలో పార్టీని నాశనం చేసుకోవాలని అధిష్టానానికి ఇష్టం ఉంటే మనం ఏం చేస్తాం..? ఎవరి దారి వారు చూసుకోవడమే మంచిదనే అభిప్రాయం మెజార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలతో సంగారెడ్డిలో రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News